Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:04AM

కేసీఆర్‌ది రాచరికపాలనే

దళితులంటే ఆయన కుటుంబానికి చులకన...
మంత్రులు ఉత్సవ విగ్రహాలు..
ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ

గజ్వేల్‌ అర్బన్‌: కేసీఆర్‌ పాలన రాచరికాన్ని తలపిస్తున్నదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని నిండు సభలో సీఎం కేసీఆర్‌ అనడం దళితులను అవమానించడమేనన్నారు. కేసీఆర్‌ వెంటనే దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ దురహంకారానికి నిరసనగా రాష్ట్రంలోని పది జిల్లాల్లో పదిరోజుల పాటు ధర్నాలు, రాస్తారోకోలను నిర్వహిస్తామని, తన వ్యాఖ్యలను కేసీఆర్‌ వెనక్కు తీసుకునేవరకు వదలమని, ఎంతవరకైనా సిద్ధమేనన్నారు. 2001 నుంచి 2014 వరకు కేసీఆర్‌, హారీశ్‌లు వెయ్యిసార్లు మాట తప్పారని, మరి వారిని ఏమనాలోనని మండిపడ్డారు. మాట తప్పితే తల నరుక్కుంటానన్న కేసీఆర్‌ నిజంగా మాట మీద నిలబడే వ్యక్తే అయితే తెలంగాణ వచ్చిన రోజైన జూన్‌ 2నే తల నరుక్కునేవాడని దుయ్యబట్టారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా భూగర్భ డ్రైనేజీ శంకుస్థాపనకే వరంగల్‌కు వస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని, అదిలాబాద్‌ ఓపెన్‌ కాస్ట్‌లతో కూలీలు నష్టపోతున్నారన్న కేసీఆర్‌ వాటిని రెండు నెలల్లో మూయిస్తానని చెప్పారని, కానీ మూడు నెలలైనా ఆ ఉసే ఎత్తడం లేదన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీని 100 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామన్న కేసీఆర్‌ 102 రోజులైనా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మాట తప్పుతూ కేసీఆర్‌ ఎన్నిసార్లు తల నరుకుంటారోనని మంద కృష్ణ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటలను తప్పిన కేసీఆర్‌కు మతిస్థిమితం లేదన్నారు. దళితులంటే కేసీఆర్‌ కుటుంబానికి చులకన ఉందన్నారు. నిజానికి రాజయ్యను డిప్యూటీ సీఎం చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదని, దళిత ముఖ్యమంత్రిపై మాట తప్పినందుకు ఎమ్మార్పీఎస్‌ పోరాడుతుందని భయంతోనే దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేశారన్నారు.
డిప్యూటీ సీఎంను తొలగించే కుట్ర చేస్తున్నారని ఆయన శాఖ విషయంలో ఆయ నకు స్వేచ్చ లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రులంతా ఉత్సవ విగ్రహాలేనా అని ఆయన ప్రశ్నించారు. మాదిగల హక్కు వర్గీకరణ అని, దాన్ని కాదనే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. చంపినా అబద్దం చెప్పను అంటున్న కేసీఆర్‌ బతికి ఉండగా ఎనాడైనా నిజాలు చెప్పాడా అని ఎద్దేవా చేశాడు. అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుందని, దళిత సామాజిక వర్గాలు ఏకతాటి మీదకు రావాలని కోరారు. సమావేశంలో ఆయన వెంట గజ్వేల్‌ నియోజకవర్గ ఎమ్మా ర్పీఎస్‌ ఇన్‌చార్జి రాములు, జాతీయ నాయకులు లక్ష్మణ్‌ ఉన్నారు.