Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:56AM

సానియాకు మరో కోటి


మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేతకు నజరానా అందించిన సీఎం కేసీఆర్‌
పవర్‌లిఫ్టర్‌ హేమలతకు రూ. 25 లక్షలు, ఇల్లు

హైదరాబాద్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ నజరానా అందజేసింది. యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన హైదరాబాదీ సానియాను గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సన్మానించారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా కోటి రూపాయల చెక్‌ను ఆమెకు అందించారు. దీంతో సానియాకు అసలు కంటే కొసరు ఎక్కువగా దక్కినట్టుయింది. యూఎస్‌ ఓపెన్‌ ఖర్చుల కోసం గతనెలలోనే ప్రభుత్వం ఆమెకు రూ. కోటి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గినందుకు సానియా వంతుగా సుమారు రూ. 45 లక్షల ప్రైజ్‌మనీ దక్కిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే వారం మొదలయ్యే జపాన్‌ ఓపెన్‌తో పాటు చైనా ఓపెన్‌లో ఆమె విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు.
తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రాష్ట్ర కీర్తిని, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటాలని సానియాను కోరా రు. ఇక ప్రభుత్వం తనకు మరోసారి అందించిన ప్రోత్సాహా నికి సానియా కృతజ్ఞతలు తెలిపింది. ‘నా విజయం పట్ల సీఎం కేసీఆర్‌ చాలా సంతోషించారు. తెలంగాణను ప్రపంచ పటంపై నిలిపేందుకే ఇద్దరం పనిచేస్తున్నామన్నారు. నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాల’ని సానియా పేర్కొంది.
హేమలతకు చేయూత: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి చెందిన హేమలత గురువారం సీఎంను కలిసింది. 2002 ఆసియా క్రీడల పవర్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం స్వర్ణం సాధించినా ఆ తర్వాత జరిగిన అంతర్జాతీయ టోర్నీలకు తనను ఎంపికచేయలేదని వాపోయింది. జీవితాన్నంతా క్రీడలకే ధారపోసిన తాను ప్రస్తుతం పేదరికాన్ని అనుభవిస్తున్నానని కన్నీటి పర్యంతమైంది. దీంతో ఆమెను అన్ని రకాలుగా ఆదుకుంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇల్లు నిర్మించి ఇవ్వడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు.
లక్‌ అంటే హేమలతదే..!
2002లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన పవర్‌లిఫ్టర్‌ హేమలతకు గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ. 25 లక్షల నజరానా, ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ, దక్షిణకొరియాలోని బుసాన్‌ వేదికగా జరిగిన 2002 ఆసియాడ్‌లో అసలు పవర్‌లిఫ్టింగ్‌ క్రీడే లేదు. అలాంటప్పుడు హేమలత పతకం నెగ్గే ఆస్కారమే లేదు. అయితే 2002లో దక్షిణకొరియాలోనే జరిగిన ఆసియా జూనియర్‌ స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో మాత్రమే హేమలత స్వర్ణం నెగ్గింది.
జూనియర్‌ స్థాయిలో పతకం నెగ్గినందుకుగాను అప్పటి నిబంధనల మేరకు ఆనాటి ప్రభుత్వం హేమలతకు రూ. యాభై వేలు నగదు అందించినట్టు చెబుతున్నారు. మరి ఆసియాడ్‌లో పతకమే నెగ్గకున్నా భారీ మొత్తంలో నగదు అందుకోబోతున్న హేమలత అదృష్టవంతురాలే అని చెప్పుకోవాలి..! హేమలత ప్రస్తుతం సికింద్రాబాద్‌ జింఖానా స్టేడియంలో పవర్‌లిఫ్టింగ్‌ కోచ్‌గా పనిచేస్తోంది.