desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:52AM

స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థుల కలెక్టరేట్‌ ముట్టడి


 స్వల్ప లాఠీ చార్జి.. పలువురి అరెస్ట్‌, విడుదల
నల్లగొండ టౌన్‌/జమ్మికుంట,, సెప్టెంబర్‌ 11: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ విడుదలకు గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నలుమూలలనుంచి వందలసంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేశారు. నాయకుల ప్రసంగాల అనంతరం విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్ళేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు విద్యార్థులకు నడుమ తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పి పోకుండా ఉండేందుకై పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జి చేశారు. దీంతో రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసుల పైకి రాళ్ళను విసిరారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పలువురు నాయకులతోపాటు కొందరు విద్యార్థులను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిధులు విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సుమారు రెండువేల మంది విద్యార్థులు ధర్నా, రాస్తారోకో చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మార్కపూరి సూర్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 74వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని దీంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దుకిరె శ్రీనివాస్‌, బండి శ్రీనివాస్‌, మణికంట, మాదారపు రత్నాకర్‌, పి ప్రశాంత్‌, నాగరాజు, అచ్యుత్‌, రాజేందర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు