Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 23:29PM

మీ చర్యలు మిమ్మల్నే వెక్కిరిస్తాయ్‌


అమెరికాలో వడ్డీ రేట్ల ధోరణిపై రాజన్‌ హెచ్చరిక
ముంబై: అంతర్జాతీయంగా కనిష్ఠ స్థాయిల్లో ఉన్న వడ్డీ రేట్లు ఆకస్మికంగా పెరిగే ప్రమాదం ఉన్నదని, అదే జరిగితే ఆర్థిక వ్యవస్థలకు మరో భారీ నష్టం తప్పదని ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. 2008లో ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే హెచ్చరించిన ఘనత సాధించిన రాజన్‌ టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా హెచ్చరిక చేశారు. ఉన్నట్టుండి విరుచుకు పడినట్టుగా కాకుండా ముందస్తు సంకేతాలతో ఒక క్రమపద్ధతిలో వడ్డీరేట్లు పెంచుకుంటూ పోవాలని ఆయన వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకర్లకు సూచించారు.
పెట్టుబడి మూలధనాలపై వ్యయం ఎక్కువ కాలం మార్పులకు లోనవుతూ ఉంటే పెట్టుబడి నిర్ణయాలు కూడా దెబ్బ తింటాయని, దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై పడుతుందని ఆయన అన్నారు. ‘‘మనం ప్రస్తుతం ఒక రంధ్రంలో ఉన్నాం...ఉన్నట్టుండి బయటకు రావాలని ప్రయత్నిస్తే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. జాగ్రత్తగా దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఇందుకు ముందస్తు హెచ్చరికలు కూడా అవసరమే అన్నది అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌కు నా సలహా’’ అని రాజన్‌ వ్యాఖ్యానించారు.
పెట్టుబడులు కారుచౌకగా అందుబాటులో ఉంటే కేటాయింపులు దారి తప్పే ప్రమాదం ఉందంటారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఒక పరిమితికి మించి సుదీర్ఘకాలం పెట్టుబడి వ్యయాలు మారుతూ పోతే పెట్టుబడి నిర్ణయా లు కూడా ప్రభావితం అవుతాయన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. మనం సుదీర్ఘకాలం వడ్డీరేట్లను కృత్రిమంగా తక్కువ స్థాయిలో నిలిపి ఉంచామని, దీని వల్ల ఇప్పుడు ఉండాల్సిన స్థాయి కన్నా వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉండి ఆర్థిక వ్యవస్థలకు ఆరోగ్యకరం కాని పెట్టుబడులు వెల్లువెత్తాయని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్‌ బ్యాంకర్లు సుదీర్ఘ కాలంగా వడ్డీరేట్లను తక్కువ స్థాయిలో ఉంచి ఆదుకుంటామని మార్కెట్లకు భరోసా ఇస్తూ వచ్చారని, దాని వల్ల అసెట్‌ ధరలు ఫండమెంటల్స్‌కు సమతూకం కాని స్థాయిలో పెరిగిపోయి వ్యతిరేక వార్తలకు మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొనే స్థితిని కల్పించాయని ఆయన అన్నారు.
అమెరికా కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో సమన్వయం లోపించిందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఆత్మరక్షణ కోసం వర్థమాన దేశాలు చేపట్టిన చర్యలు అమెరికానే దెబ్బ తీశాయన్న విషయం ఆ దేశం గుర్తించాలని ఆయన తెలిపారు. అమెరికా స్వప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని చూసినా ఆర్థిక విధానాలు ఎలా ఉండాలన్న విషయంలో విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
ద్రవ్యోల్బణంపై గురి సరైన వ్యూహం కాదు
ద్రవ్యపరపతి విధానం విషయంలో ఆర్‌బిఐలో అంతర్గతంగా విభేదాలున్నట్టు బయటపడింది. ఆర్‌బిఐ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌, ప్రముఖ ఆర్థికవేత్త ఇందిరా రాజారామన్‌ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం అదుపు పైనే గురి పెట్టడాన్ని తప్పు పట్టారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బిఐ స్వయంగా నడుం బిగించడం సరైన వ్యూహం కాదన్నారు. ప్రపంచం యావత్తు ఆర్థిక స్థిరత్వ సాధనే ద్రవ్య విధాన లక్ష్యంగా పెట్టుకోగా ఆర్‌బిఐ ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా సాగుతూ తప్పు చేస్తున్నదని ఆమె విమర్శించారు. ద్రవ్యోల్బణం అదుపు చేసే లక్ష్యంతో వడ్డీరేట్లను పై స్థాయిలోనే నిలిపి ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమె విమర్శ ప్రాధాన్యత సంతరించుకుంది.