Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 22:28PM

మరో పెళ్లి ఆలోచన లేదు - ప్రభుదేవా

ప్రేమ కోసం పెళ్లి బంధాన్ని తెంచుకుని, చివరికి ప్రేమకూ దూరమై ఒంటరిగా మిగిలిన ప్రభుదేవా మరో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం తనకు సర్వం సినిమా, పిల్లలేనన్నారు. అజయ్‌ దేవగన్‌ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన హిందీ చిత్రం ‘యాక్షన్‌ జాక్సన్‌’ ప్రచారంలో భాగంగా చాలా కాలం తరువాత ఆయన సొంతగడ్డ చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుదేవా వ్యక్తిగత జీవితం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... ‘ప్రేమ, పెళ్లి గురించి నేను ఆలోచించడం లేదు. అసలు అంత సమయం కూడా లేదు నాకు. హిందీలో నేను తీస్తున్న సినిమాలు రూ.90-100 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. దర్శకుడిగా నాపై ఎంతో బాధ్యత ఉంది. అదే సమయంలో భయంగానూ ఉంది. అందుకే పని పని పని... ఇదే ప్రస్తుతం నా రోజువారీ జీవితం. చెన్నై వస్తే పిల్లలతో గడుపుతాను. మరో పెళ్లి ఆలోచన అస్సలు లేదు.’ అన్నారు. పాత స్నేహం మళ్లీ చిగురించే అవకాశముందా అని పరోక్షంగా నయనతార గురించి ప్రస్తావించగా.. గట్టిగా నవ్వి సమాధానం దాటవేశారు.
మా మెగాస్టార్‌ మళ్లీ నటిస్తున్నారా? హుర్రే...
సినిమాల గురించి ప్రభుదేవా మాట్లాడుతూ, దర్శకుడిగా తనకు కొత్త జీవితాన్నిచ్చిన తెలుగు పరిశ్రమకి ఎప్పటికీ రుణపడి ఉంటానని, అవకాశం దొరికితే తెలుగులో తప్పకుండా సినిమా తీస్తానన్నారు. చిరంజీవి 150వ సినిమా గురించి అడిగితే... ‘నిజమా... మా మెగాస్టార్‌ మళ్లీ నటిస్తున్నారా? వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది. గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఒక అభిమానిగా నేను కోరుకునే విషయమిది’ అన్నారు. మెగాస్టార్‌ సినిమాకి దర్శకత్వం వహించాలంటే లక్కు ఉండాలని, కొరియాగ్రాఫర్‌గా పిలిస్తే ఇప్పుడూ సిద్ధమేనని ప్రభుదేవా తన అభిమాన హీరోపై మమకారాన్ని చాటుకున్నారు.
- ఆంధ్రజ్యోతి, చెన్నై