Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 22:27PM

ఒకే వేదిక.. మూడు ఆడియోలు!

‘పరంపర’, ‘దేవ్‌’, ‘మళ్లీ రాదోయ్‌ లైఫ్‌’ ఆడియో వేడుకలు ఒకే వేదికపై జరిగాయి. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘‘మూడు చిత్రాల ఆడియో వేడుకలు ఒకే వేదికపై చేయాలనే ఆలోచన బావుంది. గతంలో ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూపించేవారు. తర్వాత అది మార్నింగ్‌ షోలో ఒక సినిమా, మిగిలిన మూడు ఆటలు మరో సినిమా పద్ధతిలో ఆడించారు. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లలో నాలుగు ఆటలు నాలుగు సినిమాలు చూపించే రోజులు వచ్చాయి’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్‌కుమార్‌రెడ్డి, బసిరెడ్డి తదితరులు కొత్త విధానం ఆహ్వానించదగ్గదని, ఈ సినిమాలు సక్సెస్‌ సాధించాలని అభిలషించారు.

పరంపర : ధృతి మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై తెరకెక్కిన సినిమా ఇది. రూపాదేవి మహంకాళి, మధు మహంకాళి నిర్మాతలు. మధు మహంకాళి దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆడియో సీడీలను సీనియర్‌ నరేశ్‌ ఆవిష్కరించి, ప్రవీణ్‌ సత్తారుకు అందించారు. మధు మహంకాళి మాట్లాడుతూ ‘‘ఇది మూడు తరాలకు చెందిన కథ. తన ముందు తరాల వాళ్లు చేసిన తప్పు తను చేయకూడదని, తనకు జరిగిన నష్టం తన కొడుక్కి జరగకూడదని ఓ తండ్రి పడే తపన ఈ కథ. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అని తెలిపారు.

దేవ్‌ : జేడ్‌ ప్లాంట్‌ పతాకంపై ఇంద్రజిత్‌ లంకేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవ్‌’. డా.శిల్పారమేశ్‌ రమణి నిర్మించారు. జెస్సీ గిఫ్ట్‌ సంగీతాన్ని అందించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని డిజిక్వెస్ట్‌ బసిరెడ్డి అందుకున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో తొలిసారి తెలుగు ఇండసీ్ట్రలో ఎంటర్‌ అవుతున్నాం. తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉండే కథ ఇది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఈ కథ తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని తెలిపారు.

మళ్లీ రాదోయ్‌ లైఫ్‌ : అక్యూట్‌ యాంగిల్‌ పతాకంపై రఘు బెల్లంకొండ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘మళ్లీ రాదోయ్‌ లైఫ్‌’. విజయ్‌ కురాకుల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ పాటల్ని తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. తొలి సీడీని సునీల్‌కుమార్‌రెడ్డి అందుకున్నారు. రఘు బెల్లంకొండ మాట్లాడుతూ ‘‘సూసైడ్‌ ప్రివెన్షన్‌ డే రోజున మా సినిమా ఆడియో విడుదల కావడం యాప్ట్‌ అని భావిస్తున్నాం. పంటలు పండక రైతులు, ప్రేమ విఫలమై ప్రేమికులు.. ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు తమ ఆలోచనలను మార్చుకుని సమాజం కోసం, కుటుంబం కోసం ఏం చేశారనేదే ఈ సినిమా కథ’’ అని అన్నారు.