Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 22:26PM

విష్ణులో సీరియస్‌నెస్‌ నచ్చింది - రామ్‌గోపాల్‌వర్మ

‘‘రౌడీ సినిమా చేసేటప్పుడు విష్ణులో సీరియస్‌నెస్‌ని గమనించాను. అది నచ్చి ‘అనుక్షణం’ సినిమాలో పోలీస్‌ పాత్రకు అతను సరిపోతాడని అనుకున్నాను’’ అని అంటున్నారు రామ్‌గోపాల్‌వర్మ. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘అనుక్షణం’. శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మ గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..

‘‘విష్ణు పోలీస్‌ ఆఫీసర్‌గా నటించాడు. ‘రౌడీ’ సినిమా చేస్తున్నప్పుడు విష్ణులో నాకు మంచి సీరియస్‌ పర్సెన్‌ కనిపించాడు. ఈ కాన్సెప్ట్‌కి అతను పక్కాగా సరిపోతాడనిపించింది. చాలా సెటిల్డ్‌గా చేశాడు. సోఫిస్టికేటెడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర అతనిది. ఈ జోనర్‌లో నేను సినిమా చేయడం మొదటిసారి. ఇలాంటి సీరియల్‌ కిల్లర్‌ చిత్రాలు విదేశాల్లో ఏడాదికి మూడు, నాలుగు వస్తుంటాయి. ఈ తరహా అంశాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. నేను కూడా ఇలాంటి అంశాలను చాలా చదివాను. డాక్యుమెంటరీలు చూశాను. 2009లో ఉత్తరాదిన వరుస హత్యలు, ఆ తర్వాత బెంగుళూరులో ఆటోశంకర్‌ చేసిన వరుస హత్యలకు సంబంధించిన సమాచారం ఉంది. ఆసక్తికరమైన కథనంతో స్ర్కిప్ట్‌ సిద్ధమైంది.’’
కళ్లు బావుంటాయి
‘‘ఇందులో రేవతి ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆమె చేయదగ్గ మంచి పాత్ర ఉంది. రేవతి కళ్లతో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ బావుంటాయి. సైకో కిల్లర్‌గా సూర్య అనే వ్యక్తి నటించారు. ఆ పాత్రకు ఎస్టాబ్లిష్డ్‌ ఆర్టిస్టును ఎంపిక చేస్తే, ప్రేక్షకులు అతను ఎంత బాగా నటించాడు అనే అంశంపై దృష్టి పెడతారు. అదే కొత్త వ్యక్తి అయితే వెరైటీగా ఉంటుందనుకుని ఎంపిక చేశాం. ఇలాంటి క్రైమ్‌ సినిమాలు చూసి అందరూ చెడిపోతారని అనేవాళ్లు ఉంటారు. కానీ ఎప్పుడూ సినిమా సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. అయినా క్రిమినల్స్‌ సినిమాను చూసి నేర్చుకునేటంత మూర్ఖులు కాదని నా అభిప్రాయం.’’
బిడ్డింగ్‌ మంచిదే
‘‘బిడ్డింగ్‌ విధానం చాలా మంచిది. దీని ద్వారా ఫిల్మ్‌మేకర్‌కు, ఆడియన్‌కు ఉన్న దూరం తగ్గుతుంది. సినిమా రంగంలోకి రావాలనుకునేవారికి మంచి అవకాశం దొరికినట్టు అవుతుంది. ఒక షాప్‌కు ఇంతకు ముందు ముగ్గురే వచ్చే వారనుకుందాం. బిడ్డింగ్‌ విధానం వల్ల వెయ్యి మందికి అవకాశం దొరికినట్టు అవుతుంది. అందుకే మేం వేలం గురించి ప్రకటించగానే మంచి స్పందన వచ్చింది.’’
అప్పుడు ఆపుతా
‘‘సినిమాలు తీసి డబ్బు పోగొట్టుకున్నారు అనే మాటను తరచూ వింటూ ఉంటాం. డబ్బులు ఎక్కడికీ పోవు. చేతులు మారుతాయి అంతే. అయితే మేం తెరకెక్కించే ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాల పద్ధతిలో సినిమాలు తీస్తే డబ్బులు ఎక్కడికీ పోవు. థియేటర్‌కు ఒక్క ప్రేక్షకుడు వచ్చినా మాకు లాభమే. ఆ ఒక్క ప్రేక్షకుడు కూడా రాని రోజు ఐస్‌క్రీమ్‌ సీరీస్‌ సినిమాలు తీయడం ఆపుతాను. అప్పటివరకు తీస్తూనే ఉంటాను. తీసిన సినిమా ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? పెట్టిన డబ్బులు వచ్చాయా? రాలేదా? క్రిటిక్స్‌ ఏమన్నారు? అనేది ముఖ్యం. వీటన్నింటిలోకి అత్యంత కీలకమైన వ్యవహారం బడ్జెట్‌ అనేది నా అభిప్రాయం.’’
ఇప్పుడు చెప్పను
‘‘కేసీఆర్‌ మీద సినిమా ఎప్పుడు చేస్తానో ఇప్పుడు చెప్పను. ఇంతకు ముందు నేను సత్యం రామలింగరాజుగారిని కలవడానికి వెళ్తే ఆయనతో సినిమా చేస్తున్నానని రాసేశారు. అందులో నిజం లేదు. త్వరలో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తాను. ‘ఎక్సెస్‌’ను హిందీలోనూ రూపొందిస్తా.’’