Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 22:09PM

ఒక చేత్తో పెన్ను.. మరో చేత్తో గన్ను...

ఒక ఇంట్లో డాక్టర్‌ అయితే మిగిలిన వాళ్లందరు డాక్టర్లు కావాలనుకుంటారు. యాక్టర్‌ అయినా సరే.. సేమ్‌ టు సేమ్‌! కాని టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జా మాత్రం అక్కను పోల్చుకుని టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకోవాలనుకోలేదు. అక్కడే తన ఇండివిడ్జ్యువాలిటీ కనిపిస్తుంది. పతకాలు గెల్చుకున్నప్పుడల్లా సానియా ఇంటికొచ్చి ఇంటర్వ్యూలు చేసే మీడియా ప్రతినిధులను చూసి..తను కూడా జర్నలిస్టు కావాలనుకుందట. అందుకే ఆ పనిలోనే ఉందిప్పుడు. మరోవైపు గన్‌షూటింగ్‌లోను పేల్చేస్తోంది. ఒక చేత్తో పెన్ను.. మరో చేత్తో గన్ను పట్టుకున్న ఆ అమ్మాయి చెప్పిన కబుర్లే ఇవి...
-షూటర్‌ మీర్జా
 
హైదరాబాద్‌ మహిళా షూటర్‌ ఆనంమీర్జా 2004 వ సంవత్సరం నుంచి గన్‌షూటింగ్‌ పోటీల్లో పాల్గొనటం ఆరంభించి రాష్ట్ర స్థాయి షూటర్‌గా నిలిచారు. అనంతరం జాతీయ స్థాయి విమెన్స్‌ గన్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొని జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. 2012వ సంవత్సరంలో పుణెలో జరిగిన గన్‌ ఫర్‌ గ్లోరి షూటింగ్‌ చాంఫియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని సిల్వర్‌ మెడల్‌ సాధించారు. ఆల్‌ఇండియా మోలాంకర్‌ గన్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొని దేశంలో నాల్గవ స్థానాన్ని పొందారు. ఢిల్లీలో జరిగిన ఎన్‌ఎన్‌ఎస్‌ఈ పోటీల్లో ఈమెకు 7వ స్థానం లభించింది. ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన గన్‌షూటింగ్‌ పోటీల్లో ఆనంమీర్జాకు బంగారుపతకం లభించింది.‘‘మా అక్క, టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా అంతర్జాతీయ టెన్నిస్‌లో మెడల్స్‌ సాధించినప్పుడల్లా దేశంలోని వివిధ పత్రికలు, టీవీల విలేకరులు ఎందరో మా ఇంటికి ఇంటర్వ్యూలకు వస్తుండేవారు. నా పన్నెండేళ్ల వయసు నుంచి అలా ఇంటర్వ్యూలు చేస్తున్న ఎందరో జర్నలిస్టులను చూస్తూ వచ్చాను. నేనూ ఒక రోజు జర్నలిస్ట్టుగా మారి కెమెరా ముందు ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను. అప్పుడే నేను జర్నలిస్టు కావాలని ఫిక్స్‌ అయ్యాను. ఫొటోగ్రఫీ, జర్నలిజంలను హాబీగా పెట్టుకున్నాను. నా పాఠశాల విద్య పూర్తయ్యాక జర్నలిజం కోర్సులో చేరా. డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతూనే ఇటీవల నేను ఢిల్లీకి వెళ్లి ప్రముఖ టెలివిజన్‌ మహిళా జర్నలిస్టు బర్ఖాదత్‌ వద్ద రెండునెలల పాటు జర్నలిజంలో ఇంటర్న్‌షిప్‌ చేశాను. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. జర్నలిజంలో మాస్టర్స్‌ చేసి పూర్తిస్థాయి పాత్రికేయురాలిని కావాలన్నదే నా జీవిత లక్ష్యం.
అక్క ఎయిర్‌పిస్టల్‌ గిఫ్టుగా ఇచ్చింది..
వయసులో అక్క సానియాకు, నాకు ఎనిమిదేళ్ల తేడా ఉంది. అయినప్పటికీ ఆమెతో నాకెంతో అనుబంధం ఉంది. చిన్నప్పుడు మేమిద్దరం ఇంట్లోనే చెస్‌ ఆడేవాళ్లం. అక్క ఎప్పుడూ టెన్నిస్‌ కోసం దేశ, విదేశాల్లో పర్యటిస్తుంటుంది. నాక్కూడా ఆమెతో పాటు తిరిగే అవకాశం వచ్చింది. టెన్నిస్‌ ప్రాక్టీసు, టోర్నమెంట్లు అయిపోగానే ఎప్పుడైనా తీరిక దొరికితే చాలు అక్కతో కలిసి షాపింగ్‌ చేయడం, సినిమాలు, స్పాలకు వెళుతుంటాను. అక్క టెన్నిస్‌లో ఆడుతోంది కాబట్టి.. అదే కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా టెన్నిసే ఎందుకు ఆడాలి? అని ప్రశ్నించుకొని, నాకిష్టమైన గన్‌ షూటింగ్‌పై దృష్టి సారించాను. తల్లిదండ్రులిద్దరితో మేం ఫ్రెండ్లీగా ఉంటాం. వాళ్లు కూడా మాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. మా అభిరుచులకు, ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అందుకే అమ్మానాన్నలతో ఏ విషయాన్నయినా హాయిగా చర్చించుకునే సౌలభ్యం మాకుంది. క్రీడలైనా, చదువైనా, కెరీర్‌ అయినా మా ఆసక్తికనుగుణంగానే నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. రైఫిల్‌ షూటింగ్‌లో ఛాంపియన్‌షిప్‌ సాధించినపుడు మా అక్క లండన్‌ నుంచి వస్తూ ఎయిర్‌పిస్టల్‌ కొని గిఫ్ట్‌గా ఇచ్చింది. అక్క ఇచ్చిన గిఫ్ట్‌ చూసి నేనెంతో థ్రిల్‌ అయ్యాను.
అక్క స్ఫూర్తితో..
2004వ సంవత్సరంలో నేను కుటుంబసభ్యులతో కలిసి ముంబయి మేళాకు వెళ్లాను. ఆ మేళాలో ఉన్న గన్‌తో బెలూన్‌లు పగలగొట్టే విభాగం నన్నెంతో ఆకర్షించింది. అంతే... తుపాకీ తీసుకొని గురి చూసి బోర్డుపై ఉన్న పదికి పది బెలూన్‌లను టపటపమని పగలగొట్టేశా! అప్పుడే నేనెందుకు షూటర్‌ను కాకూడదనుకున్నాను. చిన్నప్పుడు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టమున్న నేను నా అభిరుచిని మార్చుకొని షూటింగ్‌పై దృష్టి సారించాను. దీంతో నా జీవితం మలుపు తిరిగింది. పట్టుదల, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు గన్‌ షూటింగ్‌ క్రీడలో రాణించవచ్చనే నిర్ణయానికి వచ్చాను. హైదరాబాద్‌కు తిరిగివచ్చాక గన్‌షూటింగ్‌లో శిక్షణ పొంది పోటీలకు వెళ్లడం ఆరంభించాను. అప్పుడే ఏథెన్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగం మెన్స్‌ డబుల్‌ ట్రాక్‌లో మన దేశానికి చెందిన రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించారు. గన్‌షూటింగ్‌లో మన దేశానికి పేరుప్రఖ్యాతులు సాధించిన ఆయనను ఆదర్శంగా తీసుకొని, గన్‌షూటింగ్‌లో పతకాలు సాధిస్తున్నాను. మా అక్కలో ఉన్న ఆత్మవిశ్వాసంతో పాటు ధృడమైన వ్యక్తిత్వం నాకెంతో నచ్చుతుంది. ఈ విషయంలో నేను ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతుంటాను. మా అక్క టెన్నిస్‌లో పేరుప్రఖ్యాతులు సాధిస్తే, నేను గన్‌షూటింగ్‌లో పతకాలు సాధించి దేశం గర్వపడేలా మహిళా షూటర్‌గా నిలబడాలనుకున్నాను..’’

- నవ్య డెస్క్‌