Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 19:46PM

ఉద్యమాల పేరిట మభ్యపెట్టడం తప్ప ఒరగబెట్టిందేమిలేదు : రాపోలు

చిన్నశంకరంపేట, సెప్టెంబర్‌ 11 : ఉద్యమాల పేరిట ప్రజలను మభ్యపెట్టడమే తప్ప తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ నేత రాపోలు ఆనంద భాస్కర్‌ అన్నారు. గురువారం ఆయన చిన్నశంకరంపేటలో ప్రచారంలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. ఏదో ఒక సంచలనంతో దారి మళ్లీంచాలనే దుష్టబుద్ది టీఆర్‌ఎస్‌దన్నారు. కవ్వింపు దోరణివల్ల అపవాదం జరుగుతుందే తప్ప మరేం జరగదని వ్యాఖ్యానించారు.
 
మంత్రులను అధికారులను నియుక్తి చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిఖార్సైన ప్రజాప్రతినిధిగా ఎంత ఎదిగితే అంత ఒదిగే వ్యక్తి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతారెడ్డి అని పేర్కొన్నారు. ఇరు పార్టీల అభ్యర్థులతో పోల్చితే ఆమెకు ఏమాత్రం సరితూగరన్నారు. మహిళ అని చూడకుండా అమానుషమైన వ్యాఖ్యలను కలతపరిచేవిధంగా మాట్లాడడం టీఆర్‌ఎస్‌కే చెల్లిందని మండిపడ్డారు. చేయగలిగిందే చెప్పి తూచ తప్పకుండా చేసేది ఒక కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ భయాందోళనకు గురిచేసి కండువాలు కప్పుతున్నారన్నారు.
 
తెలంగాణ భవిష్యత్‌ కాపాడే దిశలో సునీతారెడ్డికి ఓటు వేసి చరిత్రాత్మకమైన తీర్పునివ్వాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కామారం అంజిరెడ్డి, శ్రీమాన్‌రెడ్డి, పోతరాజు రమణ, రాధాకిషన్‌, వై.బాబు, నగేశ్‌, ఎర్రి కుమార్‌లతో పాటు రామకిష్టయ్య, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.