Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 17:06PM

సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు మాట్లాట జాతీయ పోటీలు

అమెరికా, సెప్టెంబర్‌ 11 : సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో సాంతాకార్లా హైస్కూల్లో తెలుగు మాట్లాట జాతీయ పోటీలు ఇటీవల ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు అమెరికా నలుమూల నుంచి ప్రాంతీయంగా వెయ్యి మంది పిల్లలు పాల్గొనగా, 42 మంది తేజాలు మాత్రమే జాతీయ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించారు.
 
సీనియర్స్‌ అనగా సిసింద్రీల విభాగంలో నిర్వహించిన పదరంగం, తిరకాటం రెండు ఆటల్లో మాదిరెడ్డి సాహితి విజేతగా నిలిచారు. పదరంగంలో ద్వితీయ స్థానాన్ని కొలచిన హర్ష, తిరకాటంలో ద్వితీయ స్థానాన్ని సోలిపురం మనీష గెలుపొందారు.
 
జూనియర్స్‌ అనగా బుడతల విభాగంలో తిరకాటంలో బొడ్డు భవ్యలక్ష్మి, ద్వితీయస్థానాన్ని ముత్యం మిహిర్‌, పదరంగంలో మొదటి స్థానాన్ని మోహనాద్యుతి, ద్వితీయ స్థానం చిత్త అనీష్‌ విజయం సాధించారు.
 
ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి గంగిశెట్టి లక్ష్మీనారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ విజేతకు 1,116 డాలర్లు, రెండవ విజేతకు 751 డాలర్లతో పాటు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మనబడి ద్వారా ప్రవాస తెలుగు విద్యార్థులకు అందుతున్న భాషా సేవలు మరువలేనివని, అమెరికాతో పాటు మిగిలిన దేశాలలోని సిలికానాంధ్ర మనబడికి మంచి ఆదరణ లభిస్తోందని ప్రశంసించారు. అమెరికాలో సిలికానాంధ్ర చేపట్టిన మనబడి ప్రయోగం తెలుగు జాతికి గర్వకారణమని పేర్కొన్నారు.
 
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ రావి రంగారావ్‌, సిలికానాంధ్ర మనబడి కులపతి చమర్తి రాజు, ప్రధాన నిర్వాహకులు కొండుభట్ల దీనబాబు, తోటపల్లి డాంజి, రాయవరం భాస్కర్‌, యెడిది శర్మ, వేట శరత్‌, కూచిభొట్ల శాంతి, జొన్నవిత్తుల శ్రీనాధ, పాశం భువనేశ్వరరెడ్డి, నిడమర్తి శ్రీనివాస్‌, కస్తూరి గౌతమ్‌, కల్యాణి సిద్ధార్థ, వసంతం మంగళంపల్లి, జయ తెలుకుంట్ల తదితరుల ఆధ్వర్యంలో జాతీయ పోటీలు నిర్వహించారు.
 
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు కస్తూరి వాణి మాధవ్‌ నిర్వహించిన వెంట్రిలాక్విజం ప్రదర్శన పోటీలకు హాజరైన బాలబాలికలను అలరించాయి. తెలుగు మాట్లాట సంధాత తోటపల్లి డాంజి మాట్లాడుతూ ‘‘ తెలుగు మాట్లాట పోటీల నిర్వహణకు ప్రత్యేకంగా తయారుచేయబడిన మాయాదర్వణం సాఫ్ట్‌వేర్‌, సాంకేతికంగా ఇంతకుముందు కంటే మేలైన బజ్జేర్‌ యంత్రం వల్ల ఆటలు శ్రీఘ్రంగా స్థిరంగా అడ్డంకులు లేకుండా కొనసాగడానికి సాధ్యమైంది’’ అని తెలియజేశారు.
 
ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస తెలుగువారికి వారి పిల్లలకు తెలుగు భాష నేర్పించడంలో మనబడి కార్యక్రమం ప్రసిద్ధిగాంచింది. 2014-15 విద్యా సంవత్సరంలోకి నమోదు కార్యక్రమం శరవేగంతో సాగుతుంది. సెప్టెంబర్‌ 6 వారాంతంలో తరగతులు ఆరంభంకానున్నాయి.