Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:31AM

జగన్‌తో బాలినేని భేటీ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఒంగోలు
పలు విషయాలపై అసంతృప్తితో పార్టీ సమావేశానికి కూడా గైర్హాజరైన వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించే చర్యలకు ఆ పార్టీ నాయకత్వం శ్రీకారం పలికింది. అందులో భాగంగా బుధవారం బాలినేనితో జగన్‌ మాట్లాడారు. అందిన సమాచారం మేరకు బాలినేనికి జగన్‌ ఫోన్‌ చేసి పిలిపించుకున్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో జగన్‌ను బాలినేని కలిశారు. ఆ సందర్భంగా బాలినేని తన అసంతృప్తికి కారణమైన పలు అంశాలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లాలో పార్టీ పదవువుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న పలు విషయాలను ఆయనకు వివరించినట్లు సమాచారం. సామాజికవర్గాల సమతూకాన్ని, పార్టీ కోసం తొలి నుంచి కష్టపడి పనిచేస్తున్న వారిని కాదని పదవులు కేటాయిస్తున్న విషయాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. కొన్ని విషయాలపై ఒక అవగాహనకు వచ్చారని చెప్తున్నారు. జగన్‌తో భేటీ అనంతరం బాలినేని సంతృప్తి చెందారని, ఇకపై పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటారని జిల్లా నాయకులు భావిస్తున్నారు. అయితే జగన్‌తో భేటీ అనంతరం బాలినేని ఏం జరిగింది? భవిష్యత్‌ కార్యాచరణపై ఎలాంటి అవగాహనకు వచ్చారు? అన్న విషయాలను తనను కలిసిన జిల్లా నాయకులతో కూడా చర్చించలేదని చెప్తున్నారు. అయితే త్వరలో జిల్లాకు వస్తానని మాత్రం ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో బాలినేని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చన్న ఆ పార్టీ వర్గీయులు భావిస్తున్నారు.