Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:21AM

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎర

విస్సన్నపేట: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువతకు ఆశచూపి రూ.8లక్షలకు పైగా నగదు కాజేసిన ఘరానా మోసం విస్సన్నపేటలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విస్సన్నపేటకు చెందిన దాయక తిరుపతిరావు అనే యువకుడు గతంలో నూజివీడు ఐటీఐ కళాశాలలో విద్యనభ్యసించాడు. ఆ సమయంలో తనతో పాటు చదువుకున్న నూజివీడు శివారు అన్నవరంకు చెందిన బొప్పడపు శంకరదొర అనే యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆశచూపి రూ.1,70,000లు తీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన సేనాపతిసింహాద్రి నుంచి రూ.76 వేలు, చల్లాసంధ్యా నుంచి రూ.40 వేలు, చల్లా నాగలక్ష్మి నుంచి రూ.30 వేలు, బోర్వంచకు చెందిన ఈర్లగడ్డ రాజకుమారి నుంచి రూ.50 వేలు, గూడపాటి రాజేష్‌నుంచి రూ.1,11,000, విజయవాడకు చెందిన దాసరి శ్రీనివాసరావు నుంచి రూ.39,000లు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి తిరుపతిరావు రూ.8 లక్షలకు పైగా నగదు కాజేసినట్లు ఎస్సై సిహెచ్‌కె దుర్గాప్రసాద్‌ తెలిపారు. గత నాలుగు నెలల నుంచి తిరుపతిరావు సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడం, సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు అతని ఇంటికి వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. గొల్లపూడికి చెందిన దాసరి శ్రీనివాసరావు అనే యువకుడి నుంచి రూ.39 వేలు తీసుకొని ఉద్యోగం వచ్చిందంటూ నకిలీ ధ్రువీకరణపత్రాన్ని ఇచ్చాడు. ఇంటర్వ్యూకు వెళ్ళిన శ్రీనివాసరావు అసలు విషయం తెలుసుకొని తిరుపతిరావును నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో బాధితులు మంగళవారం రాత్రి విస్సన్నపేట ఎస్సై దుర్గాప్రసాద్‌ను కలిసి తమగోడు వెలిబుచ్చారు. వివరాలు సేకరించిన ఎస్సై రాత్రి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం బాధితులను మరోసారి పిలిపించి వివరాలు సేకరించారు. అన్నవరంకు చెందిన శంకరదొర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.