Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:21AM

రేషన్‌ కోటాకు నాణ్యమైన బియ్యం దక్కేనా?


మహబూబ్‌నగర్‌: రైస్‌ మిల్లర్ల నుంచి ధాన్యం లెవీ సేకరణలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల లెవీ కోటాను 25 శాతానికి కుదించింది. వారు సేకరించిన ధా న్యం ద్వారా ఉత్పత్తయ్యే బియ్యంలో ఇప్పటి వరకు 75 శాతం బియ్యాన్ని కేంద్రానికి లెవీగా ఇవ్వాల్సి ఉంటోంది. మిల్లర్ల ఒత్తిళ్లు, సబ్సిడీల భారం వదిలించుకోవాలనే కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం మేరకు ఈ లెవీని 25 శాతానికి తగ్గిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకొంది. ఈ లెవీ సంవత్సరం(ఎఫ్‌సీఐ ప్రతియేటా అక్టోబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వర కు లెవీ సంవత్సరంగా పరిగణిస్తుంది.) నుంచి ఈ విధానం ఖచ్చితంగా అమలు చేయాలని సంకల్పించింది.
సివిల్‌ సప్లయిస్‌ అప్రమత్తం కాకుంటే
రేషన్‌ కోటాలో సన్నబియ్యం కష్టమే
కేంద్రం లెవీ కోటాను తగ్గించడం వరిసాగు తక్కువగా ఉండే మన జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుంది. సుమారు పది లక్షల తెల్లరేషన్‌ కార్డులున్న జిల్లాలో యేటా సుమారు 10.86 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయి. జిల్లాకు అవసరమయ్యే కోటా బియ్యంలో దాదాపుగా ఎఫ్‌సీఐ నుంచే సేకరిస్తున్నారు. కేంద్రం లెవీ కోటా తగ్గించడంతో జిల్లాకు ఇచ్చే ఎఫ్‌సీఐ బియ్యంలోనూ కోత పడనుంది. ఈ ప్రమాదాన్ని ఇప్పటికే పసిగట్టిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులు జిల్లాల అవసరాలకు సరిపోయే బియ్యాన్ని సమకూర్చుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేసుకోవాలని జిల్లాల యంత్రాంగాలకు సూచించారు. కరీంనగర్‌, నల్లగొండ వంటి ధాన్యం ఉత్పత్తులు అధికంగా ఉండే జిల్లాలో రెండేళ్ల కిందటి నుంచే ‘మన బియ్యం మనకే’ పథకం ద్వారా సివిల్‌ సప్లయిస్‌ ఖరీఫ్‌ సీజన్‌లో ఉత్పత్తయ్యే సన్న ధాన్యం సేకరించి, రేషన్‌ కోటాకు ఇస్తున్నారు. ఇదే విధానాన్ని మిగిలిన జిల్లాలూ అనుసరించి, స్థానిక అవసరాలకు సర్దుబాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు మహిళా సమాఖ్యల ద్వారా సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ధాన్యం సేకరిస్తున్నా, అందులో సింహభాగం రబీలో ఉత్పత్తయ్యే దొడ్డు రకాల ధాన్యమే ఎక్కువగా ఉంటోంది. ఖరీఫ్‌లోనూ ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నా, సన్నరకం ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధర బహిరంగ మార్కెట్‌లో లభించడం, రైతుల కళ్లాల వద్దే వ్యాపారులు కొనుగోలు చేయడంతో ఆ ధాన్యం సేకరణ కష్టంగా ఉంటోంది. గడచిన రెండు ఖరీఫ్‌, రబీ సీజన్లలో మహిళా సమాఖ్యల ధాన్యం కొనుగోళ్ల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2012-13 ఖరీఫ్‌లో 26 కేంద్రాల ద్వారా 10,234 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా, 2013-14 ఖరీఫ్‌లో 29 కేంద్రాల ద్వారా కేవలం 4,981 క్వింటాళ్లు మాత్రమే సేకరించగలిగారు. సమాఖ్యలు రబీ సీజన్‌లో ఎక్కువ ధాన్యం సేకరిస్తున్నాయి. అవి మొత్తం దొడ్డు రకాలే ఉంటున్నాయి. ఈ రకం బియ్యాన్ని స్థానికంగా వినియోగించరనేది తెలిసిందే. దీంతో జిల్లా రేషన్‌ అవసరాలకు సరిపోను బియ్యం సేకరించాలంటే ఖరీఫ్‌లో ఉత్పత్తయ్యే సన్నరకాల ధాన్యాన్ని సివిల్‌ సప్లయిస్‌ విస్తృతంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే గత్యంతరం లేని స్థితిలో పేదలకు రేషన్‌బియ్యంగా దొడ్డు బియ్యాన్నే సరపరా చేయాల్సి ఉంటుంది. జిల్లా అవసరాలకు రమారమి ప్రతియేటా 10 లక్షల 86 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతుంది. ఎలాంటి లోటు లేకుండా ఈ బియ్యం సరఫరా చేయాలంటే దాదాపుగా 14.35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఖరీఫ్‌లో మహిళా సంఘాలు సేకరిస్తున్న ధాన్యం ఈ అవసరాలకు కనీసమాత్రం కూడా సరిపోని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఖరీఫ్‌ సీజన్‌లో వచ్చే వరి ధాన్యంలో సగం ఉత్పత్తులు రైతులు సొంత అవసరాలకు వినియోగించుకుంటారు. మిగిలిన సగం ఉత్పత్తులు జిల్లా అవసరాలకు సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రేషన్‌ బియ్యం సరఫరా ఆటంకం లేకుండా కొనసాగాలంటే జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణ రూపొందించి, అమలు చేయాల్సి ఉంది. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఈ విషయంలో అప్రమత్తం కాకపోతే భవిష్యత్‌లో రేషన్‌ బియ్యం సరఫరాలో ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వస్తుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.3‘రోఏః÷