Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:20AM

మహిళా జర్నలిస్టులపై దాడి అమానుషం

నందిగామ: ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన మీడియాపై దాడి చేయడం అమానుషమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్‌బాబు అన్నారు. ఏబీఎన్‌, టీవీ9 చానళ్లపై తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నందిగామలో జర్నలిస్టులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న మంత్రి రావెళ్ల మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు తెలియజేస్తూ మంచి పాలన అందించేందుకు దోహదపడుతున్న మీడియాను నియంత్రించాలనుకోవడం హేయమన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ రెండు చానళ్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. చానళ్ల ప్రసారాల కోసం హైదరాబాద్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళా జర్నలిస్టులపై దాడి చేయడం హేయమన్నారు. ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొట్టలిపెట్టు అన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జర్నలిస్టులు తహసీల్దార్‌ ఎంసిహెచ్‌ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, జిల్లా పార్టీ నాయకుడు చలమలశెట్టి రామాంజనేయులు, పత్రికా విలేకరులు కాకాని వెంకటేశ్వరరావు, గంటా విజయ్‌కుమార్‌, సరికొండ జగ్గరాజు, మారం శ్రీనివాసరావు, సోమేశ్వరశర్మ, యేచూరి శ్రీనివాసరావు, గంటా వీరభద్రం, దాసరి పున్నయ్య, సుభాష్‌, కిషోర్‌, వివిధ చానళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళా...!
విజయవాడలో నిరసన ప్రదర్శన
(విజయవాడ ఆంధ్రజ్యోతి)
హైదరాబాద్‌లో మంగళవారం మహిళా జర్నలిస్టులపై పోలీసుల పాశవికదాడి, చానళ్ళ ప్రసారాల నిలిపివేతను సమర్ధించుకుంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. నియంతగా వ్యవహరించిన వారందరూ కాలగర్భంలో కలిసి పోయారని, రేపు కేసీఆర్‌ భవితవ్యం ఏమిటో చూసుకోవాలని విమర్శించారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఇష్ఠాను సారం మాట్టాడి తుగ్లక్‌చేష్ఠలు చేస్తే పరాభవం తప్పదన్నారు. తన మాట వినని వారిని పాతి పెడతానని కేసీఆర్‌ అనడాన్ని ప్రజలకు ఎలాటి సంకేతం ఇచ్చిందో అర్ధం చేసుకోవాలన్నారు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానళ్ళను పునరుద్ధరించాలన్నారు. సిటీ కేబుల్‌ మేనేజర్‌ నాగమణి మాట్లాడుతూ, మహిళా జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టెన్‌ టీవీ రిపోర్టర్‌ దివ్య మాట్లాడుతూ, చానళ్ళు మూసివేయడం వల్ల ఉపాధి పోతుందని, పునరుద్ధరించాలని కోరడం ఎలా తప్పవుతుందో తెలంగాణ పాలకులు చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రాంతీయ సమన్వయ కర్త బి.రామారావు, వివిధ టీవీ చానళ్ళ ప్రతినిధులు ముక్కంటి, నగేష్‌, గాంధీ, జయరాజ్‌, శ్రీనివాస్‌ (వాసు), ఏపీడబ్ల్యూజేయూ ప్రతినిధి దారం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఏవో జయశ్రీకి వినతిపత్రం అందజేశారు.