Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:19AM

నందిగామలో భారీ మెజారిటీతో సౌమ్య విజయం ఖాయం

నందిగామ: నందిగామ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, తెలుగుదేశం పాలనలోనే నందిగామ నియోజకవర్గం గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. అవకాశం ఉన్న ప్రతి గ్రామంలో తాను, స్వర్గీయ దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావులు ఎత్తిపోతల పథకాలు నిర్మించామన్నారు. నిస్వార్థంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలందించిన తంగిరాల ప్రభాకరరావు కుమార్తెకు ప్రజలంతా అండగా ఉండాలన్నారు. పదేళ్ల పాటు దోచుకున్న ప్రజల సొమ్ముతో విర్రవీగుతున్న కాంగ్రెస్‌ సంప్రదాయాలను పక్కన పెట్టి ఉప ఎన్నికలో పోటీ చేస్తోందన్నారు. గత ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలలోనూ డిపాజిట్లు దక్కనీయకుండా బుద్ధి చెప్పాలని కోరారు.
గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ మాట్లాడుతూ, మంచితనానికి మారుపేరైన తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్యను భారీ మెజారిటీతో గెలిపించి ఆయనకు ఘన నివాళి అందించాలన్నారు. విజయవాడను రాజధాని చేసి ఈ ప్రాంత అభివృద్దికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విజయాన్ని కానుకగా ఇవ్వాలన్నారు. పెడన శాసనసభ్యుడు కాగిత వెంకట్రావు మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎంతో దోహదపడిందన్నారు. నందిగామ ఉప ఎన్నికలో తంగిరాల సౌమ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈసమావేశంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, మాజీ జడ్పీచైర్మన్‌ కడియాల రాఘవరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు వేజెండ్ల భానుప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, వడ్డెల్లి శ్రీనివాసరావు, కొండూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.