Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:19AM

పొలం ఎండుతోంది

(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం)
బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాలు పడినా వర్షాలు కురవడం లేదు. సాగునీటి సరఫరాకు తోడు వర్షాలు కురిస్తేనే సాగు ముందుకెళుతుంది. రిజర్వాయర్లు నిండుగా ఉండడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి రోజుకు 16 వేల క్యూసెక్కులకు పైబడి సాగునీరు విడుదలవుతున్నా జిల్లాలో కరువుగానే ఉంది. తీర ప్రాంతాలు, చివరి భూములు సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. గతంలో 11 నుంచి 12 వేల క్యూసెక్కుల నీరు విడుదలైనప్పుడే ఖరీఫ్‌ సాగుకు అంతగా సాగునీటి సమస్య తలెత్తలేదు. వర్షాలు లేక పోవడంతో రైతులు తమ పొలాల కోసం ఇంజన్లు ద్వారా కాలువల్లో నీటిని వినియోగించుకోవాల్సి వస్తోంది. వర్షాలు సరిపడా కురిస్తే ఎగువున ఉన్న రైతులు సాగునీరుపై ఆధారపడరు. వర్షాలు లేక పోవడం వలనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో 2.55 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు కావాల్సి ఉండగా ఇప్పటికే రెండు లక్షల అయిదు వేల హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి. ఇంకా 50 వేల హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో సాగు పూర్తయిన విస్తీర్ణంతో పాటు మిగిలిన విస్తీర్ణంకు నీటి సమస్య తలెత్తుతోంది. బందరు డివిజన్‌తో పాటు గుడివాడ డివిజన్‌లోని తీర ప్రాంత మండలాల్లో ఈ పరిస్థితులు కానవస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ఇప్పటికే ఆలస్యం కాగా ఆ ప్రభావం దిగుబడులపై ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలు లేక పోవడంతో కేవలం సాగునీరు ఆధారంగానే రైతులు వ్యవసాయం చేయాల్సి వస్తుంది. దీంతో సాగునీటి కోసం అన్నదాతలు రేయింబవళ్ళు కష్టపడాల్సి వస్తోంది. గంటల తరబడి కాపలా కాస్తూ పొలాలకు నీరు పెట్టు కోవాల్సి వస్తోంది.
అరకొర వర్షాలు
ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీరు విడుదల ఆలస్యం కాగా వర్షాలు అరకొరగా కురిసాయి. ఎగువ రాష్ట్రాలలో అధిక వర్షాలు కురవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో జల కళను సంతరించుకున్నాయి. దీంతో నెల రోజుల నుంచి పంట కాలువలకు సాగునీరు సరఫరా జరుగుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా జులై నెలలో తప్ప మిగిలిన నెలల్లో అరకొర వర్షాలే కురిశాయి. జులైలో మాత్రమే సాధారణ వర్షపాతానికి మించి జిల్లాలో వర్షపాతం నమోదయింది. జూన్‌, ఆగస్టు నెలల్లో తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. ఈ నెలలో 163.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికి 54 మి.మీ వర్షపాతానికి గాను 16.1 మి.మీ వర్షపాతమే నమోదయింది. గత ఏడాదితో పోల్చితే అతి తక్కువ వర్షపాతాలు ఈ ఏడాది ఖరీఫ్‌లో చోటు చేసుకున్నాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 97.8 మి.మీ కాగా గత ఏడాది 138.4 మి.మీ వర్షపాతం నమోదయింది ఈ ఏడాది కేవలం 28.2 మి.మీ మాత్రమే నమోదయింది. దీంతో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. జులైలో సాధారణ వర్షపాతం 210.6 మి.మీ కాగా గత ఏడాది 263.2 మి.మీ వర్షపాతం నమోదయింది. ఈ ఏడాది 218.3 మి.మీ వర్షం కురిసింది. ఆగస్టులో 212.8 మి.మీ సాధారణ వర్షపాతానికి గాను గత ఏడాది 174.2 మి.మీ నమోదు కాగా ఈ ఏడాది అంతకంటే తక్కువగా 158.3 మి.మీ వర్షపాతం నమోదయింది. గత నెల రోజులుగా ఖరీఫ్‌ సీజన్‌ ఊపందుకోగా 2 లక్షల హెక్టార్లకు పైబడిన విస్తీర్ణంలో వరి నాట్లు పూర్తయ్యాయి.. మిగిలిన 50 వేల హెక్టార్లలో ఆలస్యంగా నైనా సాగు పూర్తయినా సాగునీటితో పాటు వర్షాలు కురిస్తేనే పంటలకు ప్రయోజనం అనే భావంతో అన్నదాతలున్నారు. ఈ సీజన్‌లో ముఖం చాటేసి నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కురిస్తే పంటలకు నష్టదాయకం అంటున్నారు. గత ఏడాది వరుస తుఫాన్లతో కురిసిన అధిక వర్షాల వల్ల పంటలు కోల్పోయిన దుస్థితిని గుర్తు చేసుకుంటున్నారు.