Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:18AM

సొంతూరిపై ఇష్టంతోనే ఈ గాలి...ఈ నేల సీరియల్‌

గుడ్లవల్లేరు: నిత్య జీవితంలో సమాజంలో జరిగే చాలా అంశాలను మనం పరిశీలిస్తుంటాం. కొందరు నిశదంగా పరిశీలించి వాటిలోని మంచి చెడులను వెలికి తీస్తుంటారు. అలా చేసేవాళ్ళు సంఘసంస్కర్తలు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, సినీ నిర్మాత, దర్శకులు కావచ్చు. వారువారు ఎంచుకున్న అంశాలను వారివారి వృత్తుల ద్వారా ప్రపంచానికి చూపెడుతుంటారు. ఈ కోవకు చెందిన వారే ప్రముఖ లఘుచిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడు అయిన చల్లపల్లి అమర్‌ప్రసాద్‌(అమర్‌). సమాజానికి మేలు కలిగించే మార్గాలను ఎంచుకుని లఘు చిత్రాలను నిర్మించారు. సీరియల్‌లో నటించి ఆయన నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రంగాలలో తనదైన శైలిని నిరూపించుకుంటూ ప్రభుత్వం ఇచ్చే అతి విలువైన నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. లఘు చిత్రాల నిర్మాణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమర్‌ ‘అతిథి’గా కౌతవరం వచ్చిన సందర్భంగా ’ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడింది. అమర్‌ కన్నతల్లిని కన్నతండ్రి స్వతంత్ర సమరయోధులు కౌతవరం గ్రామానికి చెందిన తాళ్ళూరి మంగపతిరావు. తండ్రిని కన్నతండ్రి జమిందారి వ్యవస్థను ఽధైర్యంగా ఎదురించి భూపోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిన చల్లపల్లి నారాయణరావు. చిన్ననాటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్దే కౌతవరంలో పెరిగాడు. పదో తరగతి వరకు కౌతవరంలోనే విద్యనభ్యసించారు.
తాతల మార్గంలో మనువడికి నందులు
సమాజం పట్ల భాద్యతతో అమ్మనాన్న, నాన నాన్నలు చేసిన పోరాటాల మార్గం అమర్‌ను సామాజిక స్పృహ కల్గించే పలు లఘు చిత్రాలను రూపొందించేలా చేశాయి. రైల్వేశాఖ ద్వారా రైల్వే దొంగల భారి నుంచి ప్రయాణీకులు బయటపడే విధంగా చిత్రాలను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వంచే బాల కార్మిక నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై వందకు పైగా లఘు చిత్రాలు, ప్రకటనలను ఈయన రూప కల్పన చేశారు.

దర్శకునిగా
నిత్యావసరాలలో పాస్టిక్‌ వినియోగం ఎంత ప్రమాదకరం, వాటిని నియంత్రించడం ఎంత అవసరం, ఎలానిర్మూలించాలనే అంశాలపై తీసిన లఘు చిత్రానికి అమర్‌ దర్శకత్వం వహించారు.
నటుడిగా
నిర్మాణం, దర్శకత్వమేకాదు అమర్‌ మంచి నటుడు కూడా. అపరంజి సీరియల్‌లో ప్రతి నాయకుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలలో చిన్నచిన్న పాత్రలో కనిపించారు.
గుర్తింపు తెచ్చిన లఘుచిత్రాలు
మత్య్సకారుల జీవన శైలిపై రూపొందించిన ఓ చిట్టెమ్మకఽథ చిత్రం అమర్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. అలాగే తాత చల్లపల్లి నారాయణరావు జీవితాన్ని ఆధారంగా నిర్మించిన అమరవీరుడుకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
నాల్గు నందులు ఈయన సొంతం
అమర్‌ నిర్మించిన లఘు చిత్రాలకు నాలుగు నంది అవార్డులను ప్రభుత్వం ఇచ్చింది. ప్లాస్టిక్‌ నియంత్రణ మీద నిర్మించిన చిత్రానికి తనకు చిన్న నాటి నుంచి ఎంతో ఇష్టమైన హీరో అమితాబ్‌ చేతుల మీదుగా నంది పురస్కారం తీసుకోవడం మరువలేనిదని అమర్‌ అన్నారు. 1994, 1997, 2000, 2012సంవత్సరాల్లో ప్రభుత్వం నంది అవార్డులు అందించింది. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రంగరాజన్‌, డికె అరుణల చేతుల మీదుగా నందులు అందుకున్నారు.