Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:17AM

నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో నిరాశ

మచిలీపట్నం-ఈడేపల్లి : ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం మేరకు సెప్టెంబరు మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడక పోవడంతో వేలాది నిరుద్యోగులు నిరాశకుగురయ్యారు. డీఎస్సీ ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం యువత హర్షం వ్యక్తం చేసింది. అయితే ఇంకా ప్రకటన రాకపోవడంతో పాటు పోస్టులు తగ్గిస్తామని మంత్రి పేర్కొనడంతో నిరుద్యోగ యువత డీలా పడ్డారు. జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్‌ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో భర్తీ అయ్యే పోస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పది వేల పోస్టులు ప్రకటిస్తామని చెప్పినప్పటికీ ఏడు వేల పోస్టులకే పరిమితం చేయడంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో ఖాళీ అయిన పోస్టుల లెక్కకు అనుగుణంగా జిల్లాలో 367 పోస్టులు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలున్నాయి. మునిసిపాలిటీ పాఠశాలల్లో కూడా పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొనడంతో 700 పోస్టులు ప్రకటిస్తారని ఆశించిన యువతకు చుక్కెదురైంది. జిల్లాలో వివిధ కేటగిరిలలో 11,474 ఖాళీ పోస్టులు ఉండగా నిబంధనలకు అనుగుణంగా ఖాళీ పోస్టుల్లోని 70 శాతం డీఎస్సీకి 30 శాతం పదోన్నతులు పొందే వారికి కేటాయిస్తారు. పదోన్నతుల ప్రక్రియ ఆగిపోవడంతో ముందుగా డీఎస్సీ నియామకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పదోన్నతులు జరిపి డీఎస్సీ నియామకాలు జరిపితే పదోన్నతులు పొందే వారికి మండల ప్రధాన కేంద్రాల్లోని స్థానాలు దక్కుతాయి. అలా కాకుండా డీఎస్సీ నియామకాలు జరిగితే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి మంచి స్థానాలు లభించే అవకాశాలు ఏర్పడతాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పదోన్నతులు చేపట్టిన తరువాత డీఎస్సీ నియామకాలు చేపట్టాలని ఉపాధ్యా య సంఘాలు అడుగుతున్నాయి.
డీఎస్సీతో పాటు టెట్‌
డీఎస్సీ-2014లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాసిన వారికే అర్హత లభించనుంది. టెట్‌, డీఎస్సీతో పాటు టెట్‌ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతం లో టెట్‌ రాసిన వారికి డీఎస్సీకి నేరుగా హాజరయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. వచ్చే సంవత్సరం నుంచి ఈ లింకుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
నిరుద్యోగ ఉపాధ్యాయులు
20 వేల మంది - పోస్టులు 367
జిల్లాలో నిరుద్యోగ ఉపాధ్యాయులు 20 వేల మంది ఉన్నప్పటికీ పోస్టులు 367 మాత్రమే ఉన్నాయి. స్కూలు అసిస్టెంట్లు తెలుగు 18, ఇంగ్లీషు 7, హిందీ 7, గణితం 13, బయోలాజికల్‌ సైన్సు 13, ఫిజికల్‌ సైన్సు 1, సోషల్‌ 37 పోస్టులు ప్రకటించనున్నారు. తెలుగు భాషా పండితులు 23, హిందీ బాషా పండితులు 17, సంస్కృత భాషా పండితులు 4, ఉర్దూ భాషా పండితులు 1, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 13 ప్రకటించనున్నారు.
ఎస్జీటీ పోస్టులే ఎక్కువ
మొత్తం ప్రకటించన్ను పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులే అధికం. 367 పోస్టుల్లో 213 సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పోస్టులు ఉన్నాయి. సెకండరీ టీచర్ల పోస్టుల పరీక్షలు రాసేందుకు డీఈడీ పాసైన అభ్యర్థులకు మాత్రమే అవకా శం ఉంది. బీయీడీ పాసైన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు లేకుండా పోయింది. బీయీడీ పాసైన నిరుద్యోగులు జిల్లాలో ఏడు వేల మంది ఉన్నప్పటికీ వీరికి ఎస్‌జిటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేదు. ఈ నేపథ్యంలో బీయీడీ అభ్యర్థులు స్కూలు అసిస్టెంట్‌ పోస్టులకే పరిమితమవుతున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు చాలా తక్కువగా ఉండటంతో బీఈడీ పాసైన అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. టెట్‌, డీఎస్సీ సిలబస్‌ను, మాదిరి ప్రశ్నాపత్రాన్ని ప్రకటించాల్సి ఉంది. నోటిఫికేషన్‌ వార్తలతో కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందడం ప్రారంభించారు.