Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:17AM

శుభదర్శి చిట్‌ఫండ్‌ కేసులో....ఎండీ శంకర్రావుకు షరతులతో కూడిన బెయిల్‌

విజయవాడ లీగల్‌: శుభదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ ఎండీ పెద్దు శంకరరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఆర్‌.మురళి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జూలైలో బందరురోడ్డులోని శుభదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ బోర్డు తిప్పేసిందంటూ దాదాపు వంద మంది బాధితులు కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. వీరిలో యనమలకుదురుకు చెందిన శెనగలి వెంకటేశ్వరమ్మకు మూడు చీటీలకు రూ.1.60 లక్షలు, భవానీపురానికి చెందిన టి.భార్గవికి రూ.1.50 లక్షలు ఇవ్వాల్సి వుందని పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
కాగా మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో వెంకటేశ్వరమ్మ కేసుకు సంబంధించి నిందితుడు తన న్యాయవాది ద్వారా బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. సీఆర్‌పీసీ 167 (2) ప్రకారం 60 రోజుల్లోగా పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేయని నేపథ్యంలో నిందితుడికి బెయిల్‌ ఇవ్వవచ్చనే పలు సుప్రీంకోర్టు తీర్పులను న్యాయవాది ఉదహరించారు. పిటీషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఆర్‌.మురళి,న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి రూ.50 వేలు, ఇద్దరు జామీనుదారుల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ప్రతి బుధవారం నిందితుడు కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో సంతకాలు చేయాలని, నిందితుడి పాస్‌ పోర్టును కోర్టులో స్వాధీనం చేయాలని న్యాయమూర్తి తన ఆదేశాలలో స్పష్టం చేశారు.
కాగా టి.భార్గవి (క్రైం నెం.486/2014) పెట్టిన కేసులో గురువారం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో నిందితుడు శంకర్రావు దాఖలు చేసుకొన్న బెయిల్‌ పిటీషన్‌పై వాదనలు జరగనున్నాయి.