Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:12AM

పర్మినెంట్‌.. పరిష్కారం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)
ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయ్‌. ‘మేం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగుల్ని అంచలంచెలుగా పర్మినెంట్‌ చేస్తాం’’ అంటూ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆ హామీ పూర్తి స్థాయిలో అమలైతే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలు, విద్య, వైద్య, పశు సంవర్థక, రెవెన్యూ.. ఇలా మొత్తం 34 శాఖలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న 3,500 మందికి లబ్ధి చేకూరనుంది. కాంట్రాక్టు వ్యవస్థ 2000వ సంవత్సరంలో ప్రారంభమైంది. 2012 వరకు ఆయా శాఖల్లో కాంట్రాక్టు పద్దతిపై ఉద్యోగ నియామకాలు జరిగాయి. చాలా ప్రభుత్వశాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు మూడు, నాలుగు నెలలకుగానీ జీతాలు అందడం లేదు. పనిచేసిన రోజులకే జీతం ఇచ్చే పద్ధతీ కొనసాగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులుగా సీనియార్టీ ఉన్నా జీతభత్యాల విషయంలో వ్యత్యాసం కూడా పెద్దగా ఉండదు. కొన్నాళ్లు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తే పర్మినెంట్‌ అవుతుందన్న ఆశతోనే ఎక్కువగా ఈ కాంట్రాక్టు ఉద్యోగాలలో చేరేవారు. ఉద్యోగ భద్రత లేకపోయినా జీతం విషయంలో కాస్త మెరుగ్గానే ఉండటంతో లెక్చరర్‌, ఇతర కాంట్రాక్టు ఉద్యోగాలకు మంచి గిరాకీ ఏర్పడింది. జిల్లాలో జూనియర్‌ కాలేజీలలో 450 మంది, డిగ్రీ కాలేజీలలో 110 మంది కాట్రాక్టు లెక్చరర్లు మిగవున్నారు. నాలుగేళ్ల నుంచీ తమను పర్మినెంట్‌ చేయాలంటూ వీరు పెద్దఎత్తున ఉద్యమం చేశారు. రాజమండ్రిలో ఆరు జిల్లాల స్థాయిలో వేలాది మంది కాంట్రాక్టు లెక్చరర్లు రెండేళ్ల క్రితం పెద్దస్థాయిలో చేసిన ఉద్యమానికి అప్పటి ప్రభుత్వం స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.
పాదయాత్రలోనే వాగ్ధానం : టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో వస్తున్నా మీ కోసం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మినెంట్‌ చేస్తామంటూ హామీ ఇచ్చారు. పలుచోట్ల కాంట్రాక్టు లెక్చరర్లు, ఉద్యోగుల నుంచి వినతి పత్రాలూ స్వీకరించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల కోసం మంత్రి మండలి ఉపసంఘాన్ని నియమించడంపై ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీనియార్టీ ప్రాతిపదికన : కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేసే ప్రక్రియలో సీనియార్టీకి ప్రాధాన్యం కల్పిస్తారని తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్‌ ప్రక్రియ మూడు, నాలుగు దశలలో చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తొలిదశలో ఆరేళ్లు ఆపై సీనియార్టీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని, రెండో దశలో ఐదేళ్లు, ఆపై పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందన్న సూచనలూ వచ్చాయి. వీటిపైనా మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది.
యనమల అధ్యక్షతన కమిటీ : రాష్ట్ర ఆర్ధిక, వాణిజ్య శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఇందులో మానవ వనరులు, సమాచార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ కాంట్రాక్టు ఉద్యోగులపై అధ్యయనం చేసి నెల రోజులలో నివేదిక సమర్పిస్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకకాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామంటూ యనమల ఇప్పటికే హామీ ఇచ్చారు.ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ఇపుడు ఆయనకే మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం విశేషం.