Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:11AM

ఇంకా నీటిలోనే..

(అమలాపురం/ధవళేశ్వరం)
గోదారమ్మ తగ్గుముఖం పట్టింది. వరద ముంపునీరు శరవేగంగా సముద్రానికి చేరుతోంది. అయినా గోదావరి వరద తీవ్రతతో కోనసీమలోని లంక గ్రామాలెన్నో ఇంకా జలదిగ్బంధంలో ఉన్నాయి. వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 50 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు వరద ముంపు బారిన పడినట్టు ప్రాథమిక అంచనా. వరద ముంపు ప్రాంతాల్లో బుధవారం ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్‌ నీతూకుమారి ప్రసాద్‌, జడ్పీచైర్మన్‌ నామన రాంబాబు పర్యటించారు.ముమ్మిడివరం మండలం అయినాపురం డ్రెయిన్‌పై శిథిలావస్థలోవున్న అవుట్‌పాల్‌ స్లూయిస్‌ను వారు పరిశీలించారు. శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టేందుకు రూ.1.50 కోట్లతో ప్రతిసిద్ధం చేసినట్టు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. ఇదే విషయంపై ఇరిగేషన్‌ శాఖమంత్రితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లిలో వరద ఉధృతిలో కొట్టుకుపోయిన చింతా కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప పరామర్శించారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు 25కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం అప్పనపల్లిలో వరద ముంపు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అమలాపురం రూరల్‌ మండలం బండారులంకలో అప్పర్‌కౌశిక డ్రెయిన్‌ గట్టుకు గండ్లు పడడంతో హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. కలెక్టర్‌ నీతూకుమారి ప్రసాద్‌తో కలిసి అక్కడే మకాం వేసి రక్షణ చర్యలను శరవేగంగా చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, పులపర్తి నారాయణ మూర్తి, డ్రెయిన్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌.హరిబాబు, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఎస్‌.సుగుణాకరరావు, ఈఈ పీవీఎస్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
50వేల ఎకరాల్లో వాణిజ్య పంటలకు నష్టం
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక ప్రాంతాల్లోని 50 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు. రెండు రోజులు మాత్రమే వరద ముంపు ఎక్కువగా ఉండడం వల్ల అంతగా నష్టం వాటిల్లే పరిస్థితులు ఉండవని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. అమలాపురం డివిజన్‌ పరిధిలోని అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, సఖినేటిపల్లి, రావులపాలెం తదితర మండలాల్లో వాణిజ్య పంటలైన అరటి, కంద, తమలపాకు, మునగ, కాయగూరల పంటలు వరదముంపునకు గురయ్యాయి. వీటిలో కొన్ని పంటలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెం-గురజాపులంక రోడ్డు వరద నీటిలో ఉంది. లంకాఫ్‌ఠాణేలంక మత్స్యకార కాలనీ, కూనాలంక, లంకాఫ్‌ఠాణేలంక, చింతపల్లిలంక, కర్రివానిరేవు, సలాదివారిపాలెం, వలసలతిప్ప తదితర గ్రామాల్లో లోతట్టు గ్రామాల్లో వరద నీరు చేరింది. 750 ఇళ్లు ముంపుబారిన పడినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
సఖినేటిపల్లి మండలంలో లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అప్పనరామునిలంక గ్రామానికి పూర్తిస్థాయిలో వరద నీరు చేరింది. సుమారు 130 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం వంతెన మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సఖినేటిపల్లి-నర్సాపురం రేవులో గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు.
పి.గన్నవరం మండలం బూరుగులంక, శివాయిలంక, కె.ఏనుగుపల్లి, లంకల గన్నవరం, కాట్రగడ్డ, గుడ్డాయిలంక తదితర లంక గ్రామాల్లోని ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. లంక గ్రామాల్లోని వరి, అంతరపంటలైన, అరటి, తమలపాకు, కూరగాయల తోటలు జలమయమయ్యాయి.
రావులపాలెం మండలం ఊబలంక, తోకలంక, కొమరాజులంక, పొడగట్లపల్లి, లక్ష్మిపోలవరం, ముమ్మిడివరప్పాడు గ్రామాల్లో లంక పొలాల్లో సాగు చేస్తున్న అరటి, కోకో, తమలపాకు, మునగ, కూరగాయలు, చిక్కుడు, దొండ పాదులు సైతం వరద నీటిలో నానుతున్నాయి.
ఆలమూరు మండలం బడుగువానిలంక జలదిగ్బంధం నుంచి తేరుకున్నప్పటికీ పంట పొలాలు వరదనీటిలోనే ఉన్నాయి. వరదనీరు రెండు రోజుల మాత్రం ఉన్నప్పటికీ వందలాది ఎకరాలలోని పంటలు మాత్రం ఎందుకు పనికిరాకుండా పోయ్యాయి.
కె.గంగవరం మండలంలోని కోటిపల్లి ఫెర్రీరేవు, రేవులోని బస్‌స్టాండు, రేవులో దుకాణ సముదాయం వరదనీటిలో చిక్కుకున్నాయి. మంగళవారం నాటికంటే బుధవారం వరద కొంచెం తగ్గింది. స్థానిక మత్స్యకార కాలనీలో లోతట్టు ప్రాంతాలను ముంపులోనే ఉన్నాయి.
వరద ఉధృతికి ఇద్దరు మృతి.. మరొకరు గల్లంతు
గోదావరి వరదల ఉధృతికి బుధవారం ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామానికి చెందిన బూల వెర్రియ్య(55) పొలంలోని కొబ్బరికాయలను తెచ్చుకునేందుకు తోటలోకి వెళ్లాడు. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో వెర్రియ్య కొట్టుకుపోయాడు. అతని మృతదేహం లంకల్లోని డొంకలకు తగులుకుని స్థానికులకు లభ్యమైంది. సుమారు 40 ఏళ్లు కలిగిన గుర్తుతెలియని మృతదేహం ఒకటి అంతర్వేది సముద్రంలోకి కొట్టుకువచ్చింది. మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియలేదు. మామిడికుదురు మండలం పాశర్లపూడిలో దేవస్థానం అటెండర్‌గా పనిచేస్తున్న కాండ్రేగుల శ్రీనివాసశాసి్త్ర వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. గల్లంతైన శ్రీనివాస శాసి్త్ర ఆచూకీ లభ్యం కాలేదు.
ధవళేశ్వరం వద్ద బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 14.20 అడుగులుగా వుండగా 13 లక్షల 56 వేల క్యూసెక్కుల ప్రవాహం సముద్రంలో కలుస్తోంది. ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రికి ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించేస్థాయికి నీటిమట్టం తగ్గవచ్చుని అధికారులు అంచనావేస్తున్నారు. నీటిమట్టం వేగంగా తగ్గుతూ వుండడంతో బలహీనంగావున్న గట్లు జారిపడే ప్రమాదం వుండడంతో అధికారులు అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పడుతూ బుధవారం రాత్రికి 41.70 అడుగులకు చేరుకుంది.