Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:48AM

విద్యాశాఖకు అంగన్‌వాడీల అనుసంధానం


ప్రతి రోజు ప్రభుత్వ స్కూళ్లలో పర్యవేక్షణ: మంత్రి జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను విద్యాశాఖకు అనుసంధానం చేయాలని తెలంగాణ విద్యాశాఖ సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం స్ర్తీ, శిశు సంక్షేమశాఖ పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిని అనుసంధానం చేసుకోవటం ద్వారా అంగన్‌ వాడీ కేంద్రాల్లోనే ఎల్‌కేజీ, యూకేజీ (ప్రీ ప్రైమరీ) విద్యను అందించాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంగ్లీషుపై మోజు కారణంగానే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశపెట్టాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ను పరిశీలిస్తున్నామన్నారు. మూడేళ్ల వయస్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్కూళ్లలో ప్రవేశం కల్పించే విధంగా నిబంధనల్లో మార్పు తెచ్చేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలిన పాఠశాల విద్యా కమిషనర్‌ను ఆదేశించామని చెప్పారు. దసరా సెలవుల్లోగా ఏకీకృత సర్వీసు రూల్స్‌పై నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి రోజు తనిఖీలు నిర్వహించే విధంగా ప్రతి జిల్లాకు ఇద్దరు రాష్ట్ర స్థాయి అధికారులతో కమిటీలను నియమించనున్నట్లు చెప్పారు. డైట్‌సెట్‌ 2014 ప్రవేశ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని, తెలంగాణ రాష్ట్రం సొంతంగా నోటిఫికేషన్‌ జారీ, కౌన్సెలింగ్‌ నిర్వహణకు డైట్‌ సెట్‌ కన్వీనర్‌ను నియమించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పాఠశాల విద్యా కమిషనర్‌ను ఆదేశించారు. కాగాప్రభుత్వ పాఠశాలల పనితీరుపై నిరంత ర తనిఖీలను తెలంగాణ పీఆర్‌టీయూ అధ్యక్షులు జి హర్షవర్థన్‌రెడ్డి స్వాగతించారు.