desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:47AM

మాటలే గానీ.. చేతల్లేవు రుణమాఫీపై ఎందుకు కాలయాపన?: కిషన్‌రెడ్డి


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ వంద రోజుల పాలనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ వందరోజుల పాలనపై సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. ‘‘సీఎం కేసీఆర్‌కు అభద్రతాభావం ఏర్పడినట్లుంది. అందరూ తన ప్రభుత్వాన్ని కూలుస్తున్నట్లు పీడకలలు వస్తున్నట్లుంది. అందుకే ఇళ్లు కూడా మారుస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. బయటి రాష్ట్రాల వారిని పిలిచి పెట్టుబడులు పెట్టండి. భూములిస్తాం. వసతులు సమకూరుస్తాం. విద్యుత్తును ఇస్తాం. సింగిల్‌ విండోలో క్లియర్‌ చేస్తాం అంటారు. మళ్లీ ఇక్కడుండాలంటే తనకు శాల్యూట్‌ చేయాలంటారు. ఇది దేనికి సంకేతం?’’ అని ప్రశ్నించారు. ఇంతవరకు కేసీఆర్‌ ప్రభుత్వం మాటలతో నడుస్తుందేగానీ.. చేతల్లో ముందుకు పోవట్లేదన్నారు. రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉన్నా రుణమాఫీ అమలుకు కాలయాపన ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక సెప్టెంబర్‌ 17ను బ్రహ్మాండంగా జరుపుకుంటామన్నారని, తీరా రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ దీనిపై మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.