desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:47AM

భాగ్యనగరిలో మరో పరేడ్‌ గ్రౌండ్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా)
రాష్ట్ర స్థాయి ఉత్సవాలతోపాటు పలు కార్యక్రమాల నిర్వహణకు శాశ్వత వేదిక ఏర్పాటు చేసేందుకు సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా గచ్చిబౌలి ప్రాంతంలో అన్ని సదుపాయాలతో మరో పరేడ్‌ గ్రౌండ్‌ నిర్మించేందుకు అనువైన 50 ఎకరాల స్థలాన్ని చూడాలని సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ను ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి రాష్ట్ర స్వాతంత్య్ర వేడుకులను గోల్కొండ కోటలో నిర్వహించారు. ఈ వేడుకల నిర్వాహణకు సంబంధించి ఆది నుంచి అవాంతరాలు ఎదురయ్యాయి. రక్షణశాఖ, పురావాస్తు శాఖలు అభ్యంతరాలు, ఆంక్షలు పెట్టడంతో కార్యక్రమం నిర్వహణపై చివరి వరకు సస్పెన్స్‌ కొనసాగింది. పైగా గోల్కొండ కోటలో విశాలమైన మైదానం లేకపోవడంతో వేడుకలకు పరిమితంగానే జనాన్ని అనుమతించారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌, గోల్కొండ కోటల్లో వేడుకలు నిర్వహించేందుకు ప్రతిసారీ కేంద్ర రక్షణ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వమే శాశ్వత వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గచ్చిబౌలిలో 50 ఎకరాల స్థలాన్ని చూడాలని జిల్లా అధికారయంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
సీనియర్‌ ఐఏఎస్‌లకు విల్లా తరహా క్వార్టర్లు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు ప్రత్యేక క్వార్టర్లను నిర్మించాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈమేరకు గచ్చిబౌలిలో సీనియర్‌ ఐఏఎస్‌ల క్వార్టర్ల నిర్మాణానికి 25 ఎకరాల భూమిని గుర్తించి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ క్యాంపు కార్యాలయాల కోసం పలు స్థలాలను పరిశీలిస్తున్నారు. 15 ఎకరాల సువిశాల స్థలంలో సీఎస్‌, డీజీపీ క్యాంపు కార్యాలయాలు నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే సీనియర్‌ ఐఏఎస్‌లకు అన్ని సౌకర్యాలతో 75 క్వార్టర్లను నిర్మించనున్నారు. వీటిని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించాలని నిర్ణయించారు. స్పెషల్‌ కమిషనర్లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు వీటిని కేటాయించనున్నారు. విల్లా తరహాలో వీటిని నిర్మించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. గచ్చిబౌలిలోని పాత ముంబాయి హైవేకి ఆనుకుని ఉన్న ఏపీఐఐసీ స్థలంలో ఈ క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
ఎయిమ్స్‌ కోసం నాలుగు స్థలాల పరిశీలన
ఎయిమ్స్‌ను రంగారెడ్డిజిల్లాలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ం యోచిస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ర్ట్రంలో ఎయిమ్స్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. దీనికోసం 200 ఎకరాలను కేటాయించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సుమారు రూ.1200 కోట్లతో అత్యాధునిక సదుపాయలతో నిర్మించే ఎయిమ్స్‌ కోసం జిల్లాలో అనువైన భూములను వెంటనే చూడాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు నాలుగు ప్రాంతాల్లో భూములను పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గచ్చిబౌలితోపాటు కందుకూరు మండలం ముచ్చెర్ల, నవాబుపేట, శంకరపల్లి ప్రాంతాలకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపారు.