Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:47AM

ఉస్మానియా వర్సిటీలో ఉద్రిక్తత


రెండు విద్యార్ధి సంఘాల మధ్య గొడవ
గదులను తగులపెట్టుకున్న విద్యార్థులు
భారీగా మోహరించిన పోలీసులు

తార్నాక/ ఓయూ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు విద్యార్ధి సంఘాల మధ్య నెలకొన్న గొడవ బుదవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకునే క్రమంలో గదులను తగులపెట్టుకున్నారు. ఈ దాడుల్లో ఓ విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి చేజారిపోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా బుధవారం జరిగిన ఆందోళనలో భాగంగా విద్యార్థుల మధ్య చిన్న వివాదం నెలకొంది. కాంట్రాక్టు కార్మికుల క్రబద్దీకరణకు వ్యతిరేకంగా బుధవారం వర్సిటీలో ర్యాలీ జరిగింది. ర్యాలీ లైబ్రరీ వద్దకు చేరుకొగానే రెండు వర్గాల మధ్య స్వల్పంగా గొడవ జరిగింది. తరువాత సద్దుమణిగింది. సాయంత్రం దాకా సైలెంట్‌గానే ఉన్న విద్యార్థి వర్గాలు రాత్రి కాగానే రెచ్చిపోయాయి.
ఓల్డ్‌ బిల్డింగ్‌ ఏ బ్లాక్‌ హాస్టల్‌లో రెండు వర్గాల విద్యార్థులు వీరంగం సృష్టించారు. ఏబీవీపీ నేత కళ్యాణ్‌ గదికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న కళ్యాణ్‌ వర్గానికి చెందిన విద్యార్థులు తెలుగు స్కాలర్‌ శరత్‌ గదిని నిప్పంటించారు. ఈ మంటలు మిగతా గదులకు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఇదే భవనంలో 62 నెంబరు గదిలో ఉంటున్న డాన్‌ అనే విద్యార్ధి పై దాడి జరిగింది. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. హాస్టల్‌ గదుల నుంచి భయటకు రావోద్దంటూ విద్యార్ధులకు హెచ్చరికలు జారీ చేశారు.
కేసీఆర్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర
ఇదిలా ఉంటే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తున్న ఓయూ విద్యార్థులు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఓయూ పోలీసుస్టేషన్‌ వరకు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఓయూ పీఎస్‌ వద్దే కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థులు మండిపడ్డారు.