desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:47AM

అన్యాక్రాంతంలో ఆలయ భూములు


చిత్తూరు సిటీ: జిల్లాలో వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ముఖ్యం గా తిరుపతి, చిత్తూరు నగరాల్లో అత్యంత ఖరీదైన ఆలయ మాన్యం భూ ములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో 2766 ఆలయాలు, 33 మఠాలు, 273 సత్రాలు కలసి మొత్తంమీద 3072 హిందూ ధార్మిక సంస్థలు నడుస్తున్నాయి.వీటికి సంబంధించిన మాన్యం భూములు 19,720 ఎకరాల మేరకు వున్నాయి. ఇందులో 3188 ఎకరాలు మాగాణి కాగా 10,083 ఎకరాలు మెట్ట. మిగిలినది వ్యవసాయ యోగ్యం కాని ఇతరత్రా భూమి. అధికారిక లెక్కల ప్రకారమే 4001 ఎకరాల భూము లు ఆక్రమణల్లో వున్నాయి.
మిగిలిన 15 వేల ఎకరాల భూములను లీజుకు ఇవ్వగా దానిద్వారా ఏటా కేవలం రూ. 15 లక్షల లోపే ఆదాయం సమకూరుతోంది. ఈ స్వల్ప మొ త్తం ఆలయాల నిర్వహణకు సరిపోయే పరిస్థితి లేదు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆల యాలకు ఈ భూములతో పాటు జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భవనాలు, ఇళ్ళు, స్థలా లు కూడా వున్నాయి. భూములతో పాటు ఇవి కూడా అధికశాతం ఆక్రమణలకు గురయ్యా యి. ఈ ఆక్రమణలకు సంబంధించి హైకోర్టులో 73 కేసులు, జిల్లా కోర్టులో 118 కేసులు పెండింగ్‌లో వున్నాయి.
తిరుపతి, చిత్తూరుల్లో
ఖరీదైన భూముల కబ్జా
తిరుపతి, చిత్తూరు నగరాల్లో పలు ఆలయాలు, మఠాలు, సత్రాలకు చెందిన అత్యంత ఖరీదైన భూములు, ఇతర ఆస్తులు కబ్జాకు గురయ్యాయి. ముఖ్యంగా తిరుపతిలో బుగ్గమఠం, హథిరాంజీ మఠం, పంగుళూరి సీతమ్మ ఆలయాలకు చెందిన వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఆక్రమణలకు గురయ్యాయి. పంగుళూరి సీతమ్మ ఆలయానికి చెందిన 3.8 ఎకరాలు, బుగ్గమఠా నికి చెందిన 21 ఎకరాలు, హథిరాంజీ మఠానికి చెందిన 1437 ఎకరాలు, గాలిగోపురం మఠానికి చెందిన 22 ఎకరాలు చొప్పున మాన్యం భూములు పరాధీనమయ్యాయి. తిరుపతి అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేం ద్రంగా ఎదుగుతున్న నేపధ్యంలో ఇక్కడ భూముల ఽవిలువ విపరీతంగా పెరుగుతోంది. దీంతో సరైన ఆజమాయిషీ, నియంత్రణ లేని దేవాదాయ భూములపై పలువురి కన్ను పడుతోంది. ఇప్పటికే పెద్దఎత్తున దేవాదాయ శాఖ భూములు పరాధీనమయ్యాయి.
పలు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో వున్నాయి. రాజకీయ నేతల అండదండలు కలిగిన ఆక్రమణదారుల పట్ల దేవాదాయ శాఖ గానీ, ప్రభుత్వ యం త్రాంగం గానీ కఠినంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొని వుంది. ఇక జిల్లా కేంద్రమైన చిత్తూరులోనూ పరిస్థితేమీ భిన్నంగా లేదు. నగరంలోని పొన్నియమ్మ గుడివీధిలో వున్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయానికి నగర నడిబొడ్డున రూ. కోట్లు విలువ చేసే 1.50 ఎకరాల స్థలం ఉంది. కేవలం రికార్డులకు మాత్రమే పరిమితమైన ఆ భూమి ఇపుడు ఎక్కడా కనిపించదు. ఎందుకంటే దశాబ్దాల కిందటే ఈ భూమి ఆక్రమణలకు గురై అందులో భారీ భవనాలు, కమర్షియల్‌ కాంప్లెక్సులు వెలిశాయి.
బజారువీధిలో శ్రీ శివ షణ్ముగస్వామి ఆలయానికి పూల మార్కెట్‌ వీధిలో రూ.కోట్లు విలువ చేసే భవనం ఉంది. ఆ భవనం ఎవరిదనే విషయమై ప్రస్తుతం కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. కట్టమంచిలోని శ్రీకుళందేశ్వరాలయానికి కట్టమంచిలోనే సర్వే నెంబర్లు 246, 247, 253లలో సుమారు 7 ఎక రాల భూము లున్నాయి. రెండు దశాబ్దాలుగా ఆ భూముల నుంచి ఆలయానికి ఆదాయం రావడం లేదు. పదేళ్ళ కిందటి వరకూ ఆ భూములు సాగు లో వుండేవి. దానిపై వచ్చే ఆదాయం స్థానికంగా ఓ నేత పొందేవారు. ఇపుడా భూమి కబ్జాదారుల కోరల్లో వుంది. నగరంలోని చెంగల్రాయకొండపై వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయానికి యాదమరి మండలం జంగాలపల్లె లో 4 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం ఏమైం దో ఆ దేవుడికే తెలియాలి.
జిల్లావ్యాప్తంగా ఇవే దృశ్యాలు!
బంగారుపాళ్యం మండలం మొగిలిలోని సుప్రసిద్ధ శ్రీ మొగిలీశ్వరాలయానికి 70 ఎకరాల భూములున్నాయి. వీటిలో చాలావరకు అన్యాక్రాంతమయ్యాయి. తవణంపల్లెలోని శ్రీకోదండరామాలయానికి దాదాపు 10 ఎకరాల భూములున్నాయి. వాటినుంచి ఆలయానికి వస్తున్న ఆదాయం అంతంత మాత్రమే. పుత్తూరు ఆర్టీసీ బస్టాండు వద్ద శివాలయానికి రూ. కోట్లు విలువచేసే 4 ఎకరాల స్థలం ఉంది. దీనిపై లీజుదారులకు, దేవాదాయశాఖకు నడుమ కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. ఐరాల మండలం పుల్లూరులో శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి చెందిన 10 ఎకరాల మాన్యం అన్యాక్రాంతం అయ్యింది. అందులో కొంత భూమిని ఓ మాజీ ప్రజాప్రతినిధి దురాక్రమణ చేశారని అభియోగాలున్నాయి. అధికార పార్టీనేత కావడంతో ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గంగాధరనెల్లూరు మండలం పెద్దకొండేపల్లెలోని శ్రీ కనుకొండరామస్వామి దేవస్థానానికి 1.60 ఎకరాల పొలం వుంది. అది కూడా కబ్జాకు గురైంది. పాకాల మండలం కె.వడ్డిపల్లెలో శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి అదేగ్రామంలో ఉన్న 20 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయ్యింది.సత్యవేడు వినాయకస్వామి ఆలయానికి చెందిన 3.82 ఎకరాలు, చౌడేపల్లెలో అభీష్ట మృత్యుంజయస్వామి ఆలయానికి చెందిన 72.72 ఎకరాలు, పలమనేరులో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ భూములు 1.60 ఎకరాలు, చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ భూములు 4.24 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.
ఆక్రమణలపై దేవాదాయ శాఖలో
కనిపించని కదలిక
ఎందరో దాతలు తమ ఇష్టదైవాలపై భక్తి విశ్వాసాలతో అందజేసిన మాన్యం భూములు దురాక్రమణలకు గురవుతుంటే దేవాదాయ శాఖ యంత్రాంగంలో మాత్రం ఎలాంటి కదలికా కనిపించడం లేదు.
జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల మాన్యం భూములను రక్షించలేకపోవడానికి ఆ శాఖలో సిబ్బంది నామమాత్రంగా వుండడం ఓ కారణమైతే కావచ్చు కానీ ప్రధానంగా సిబ్బంది, అధికారుల సహకారంతోనే ఆక్రమణదారులు మాన్యం భూములను సొంతం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అందుబాటులో వున్న చట్టాలను, నిబంధనలను పక్కాగా వినియోగిస్తే దేవాదాయ శాఖ మాన్యం భూములు పరాధీనమయ్యే పరిస్థితే ఉత్పన్నం కాదు. అయితే పలువురు సిబ్బంది, అధికారులు ప్రలోభాలకు లోనవుతున్నందున మాన్యం భూములు పరాధీనమవుతూండగా ఆలయాలు ఆదాయం లేక చీకట్లలో మగ్గుతున్నాయి. ఆలయాలకు మాన్యం భూముల నుంచీ ఆదాయం రాకపోగా పైపెచ్చు కోర్టు వివాదాల పేరిట ప్రజాధనం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సివస్తోంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు పలువురు సైతం మాన్యం భూముల ఆక్రమణదారులకు మద్దతిస్తున్న ఉదాహరణలు కోకొల్లలు. మరికొందరు మరో అడుగు ముందుకేసి తామే ఆక్రమణలకు పాల్పడుతున్నారు.