Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:47AM

క్రీడా నైపుణ్యం పెరిగితేనే రాణింపు


పంజాగుట్ట: ఎంకే సూపర్‌ సెవెన్‌ యూత్‌ నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ పోటీలకు నగరం వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర సూపర్‌-7 క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే పోటీల్లో పలు రాష్ర్టాలకు చెందిన 32 జట్లు పాల్గొననున్నాయి. సోమాజిగూడలో బుధవారం జరిగిన సమావేశంలో క్రికెట్‌ లీగ్‌ పోస్టర్‌ను, ట్రోఫీలను తెలంగాణ ప్రభుత్వ క్రీడలు, సాంస్కృతిక విభాగం సలహాదారు కేవీ రమణాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో టెస్ట్‌లు, వన్డేలు, టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లు జరగ్గా ప్రస్తుతం 7 ఓవర్ల టోర్నమెంట్‌లు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 28 వరకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. టీ20మ్యాచ్‌కు భిన్నంగా దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా 7 ఓవర్ల మ్యాచ్‌ నిర్వహిస్తున్నామన్నారు. 2006లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇటువంటి టోర్నీలతో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఆయా జట్ల మధ్య నాకౌట్‌, రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో 52 మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. 7 ఓవర్లు, ఏడుగురు క్రీడాకారులు మాత్రమే ఇందులో పాల్గొంటారని వివరించారు. మొత్తం 84 వేల రూపాయలు నగదు బహుమతిగా అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, లింగమూర్తి, భీంసేన్‌మూర్తి, వై.కార్తీక్‌, ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి రాజమౌళిచారి తదితరులు పాల్గొన్నారు.