Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:41AM

ఆసియాడ్‌కు సానియా, జ్వాల దూరం

పేస్‌, బోపన్న కూడా... టాప్‌ ఆటగాళ్లకు మినహాయింపు
బెంగళూరు: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు తెలుగు తేజాలు సానియా మీర్జా, గుత్తా జ్వాల దూరమయ్యారు. మోకాలి గాయం కారణంగా డబుల్స్‌ టాప్‌ షట్లర్‌ జ్వాల టోర్నీ నుంచి తప్పుకోగా, డబ్ల్యూటీఏ, ఏటీపీ టూర్‌లో పాల్గొనేందుకు గాను టెన్నిస్‌ ఏస్‌ ప్లేయర్లు సానియా, లియాండర్‌పేస్‌, రోహన్‌ బోపన్న ఆసియాడ్‌ నుంచి నిష్క్రమించారు. ఆసియాడ్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో జ్వాల కుడి మోకాలికి గాయమైంది. వైద్యుల సూచన మేరకు వచ్చే రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. దీంతో ఈనెల 19న దక్షిణ కొరియాలో మొదలయ్యే ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు జ్వాల ప్రకటించింది. ఇక యూరోపియన్‌ సర్క్యూట్‌ లో తప్పకుండా బరిలోకి దిగుతానని ఆమె తెలిపింది. టీమ్‌ చాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషిస్తోన్న జ్వాల గైర్హాజరీతో ఈ టోర్నీలో భారత మహిళా షట్లర్ల పదర్శనపై తీవ్ర ప్రభావం చూపే ఆస్కారముంది.
ర్యాంకింగ్సే ముఖ్యం...: ఏటీపీ, డబ్ల్యూటీఏ ఈవెంట్లలో పాల్గొనే స్టార్‌ ఆటగాళ్లకు ఆసియా క్రీడల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్య (ఐటా) ప్రకటించింది. ర్యాంకింగ్స్‌ మెరుగుపరుచుకోవడం సానియా, పేస్‌, బోపన్నకు చాలా ముఖ్యమని అందుకే వారికి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. ఇక సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ ముందుగానే తప్పుకున్న సంగతి తెలిసిందే.
జీవనోపాధి కోసమే..: జీవనోపాధి కోసమే తాను ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆడుతున్నట్టు పేస్‌ పేర్కొన్నాడు. ‘నేనిప్పుడు 35వ ర్యాంకుకు పడిపోయా. వచ్చే ఏడాదికి నా ఉద్యోగ భద్రతను చూసుకోవాలి. అందుకు సుదీర్ఘ సీజన్‌లో పోటీపడాల్సి ఉంది. కౌలాలంపూర్‌, టోక్యో టూర్‌ల సమయంలోనే ఆసియా క్రీడలూ ఉన్నాయ’ని పేస్‌ చెప్పాడు. ఇక దేశానికి తాను చేసిన సేవలను, తన నిబద్ధతను ప్రశ్నించడానికి వీళ్లేదని పేస్‌ స్పష్టం చేశాడు.