Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:32AM

నేను రాజీనామా చేస్తే వచ్చిన ఎన్నిక ఇది... బీజేపీకి ఎందుకు ఓటేయాలి?


మెజారిటీ తగ్గితే టీఆర్‌ఎస్‌ పని అయిపోయిందంటరు
నవ్వేటోని ముందు జారి పడ్డట్టు చెయ్యొద్దు: సీఎం కేసీఆర్‌
కేసీఆర్‌ హామీలు తీర్చితే రాజకీయ సన్యాసం తీసుకుంటా: డీఎస్‌
ఆయన అబద్ధాలు ఆడను అనడం తొమ్మిదో వింత: పొన్నాల
ప్రభుత్వాన్ని కూలుస్తున్నట్లు కేసీఆర్‌కు పీడకలలొస్తున్నాయేమో
అందుకే ఇళ్లు కూడా మారుస్తున్నారు: బీజేపీ నేత కిషన్‌రెడ్డి

సంగారెడ్డి, ఆంధ్రజ్యోతి : మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నిక..తాను రాజీనామా చేస్తే వచ్చిందని, ఇంతకు ముందు తనకు వచ్చిన 3.97 లక్షల మెజారిటీ ఏ మాత్రం తగ్గినా టీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని అంటారని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిని నాలుగు లక్షలు దాటి అయిదు లక్షలు మెజారిటీ వచ్చేలా గెలిపించాలని కోరారు. మెజారిటీ తగ్గించి నవ్వేటోని ముందు జారి పడ్డట్టు చేయకండని విజ్ఞప్తి చేశారు. మీరిచ్చే బలాన్ని మీకోసమే వినియోగిస్తానని కేసీఆర్‌ అన్నారు. ‘‘బీజేపీకి ఎందుకు ఓట్లేయాలి?.. ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకా? ఏపీకి ఎక్కువ కరెంట్‌ కేటాయించినందుకా? ద్రోహి జగ్గారెడ్డిని నిలబెట్టినందుకా?’’ అని ప్రశ్నించారు. మెడ పై తలకాయ ఉన్న వారెవరూ జగ్గారెడ్డికి ఓటేయరన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించలేదని, అప్పుడు చెల్లని రూపాయి పార్లమెంటు ఎన్నికలో ఎలా చెల్లుబాటవుతుందని ప్రశ్నించా రు. అన్ని సర్వేలు ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయం చేస్తున్నాయన్నారు.
రైతు ఆత్మహత్యల పాపం కాంగ్రెస్‌దే
‘‘టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 146 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతున్నారు..ఈ పాపం గత పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ది కా దా?’’ అని ప్రశ్నించారు. అయినా సిగ్గు లేకుండా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతున్నారన్నారు. గ్రామాలకు వచ్చే కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించాలని ఆయన రైతులను కోరారు. ‘‘మూడు నెలల్లో ఏమీ కాలేదని పొన్నాల మాట్లాడుతున్నారు. మూడు నెలల్లో ఏమీ కాలేదు, కాదు. అదే కాంగ్రెస్‌ అధికారంలో ఉండి ఉంటే మూడు నెలల్లో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు మింగేవార’’న్నారు.
దసరా తర్వాత నుంచి కొన్ని కార్యక్రమాలను అమలు చేయనున్నామని తెలిపారు. రైతు రుణాలను బంగారంతో సహా లక్ష వరకు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. తాను రైతు బిడ్డనని, వ్యవసాయం చేస్తున్నానన్నారు. ‘‘పేదల గురించి పొన్నాల లక్ష్మయ్యకు ఏమి తెలుసు? ఒక్క రూపాయి మాఫీ ఎప్పుడైనా చేశారా? ఆ మొఖం, ఆ సోయి పొన్నాలకు ఉన్నదా?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. మాఫీలో కొన్ని ఇబ్బందులున్నాయని, అయినా మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో మాఫీకి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిందని, మిగతా జిల్లాల్లో కూడా అనుమతి కోరేందుకు అధికారులు ముంబై వెళ్లారని తెలిపారు.
బడ్జెట్‌ భేటీ తర్వాత అమలు
బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత కార్యక్రమాలన్నీ అమలుచేస్తామని కేసీ ఆర్‌ స్పష్టం చేశారు. ఇంకా కొందరు అధికారులు రావాల్సిఉందని, దసరా తర్వాత ముస్లిం, గిరిజనులు, దళితుల బిడ్డలకు జరిగే పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.51 వేలు అందజేస్తామన్నారు. వికలాంగులకు రూ.1500 చొప్పున, వితంతువులు, వృద్ధులకు రూ.1000 చొప్పున పింఛన్లు చెల్లిస్తామన్నారు.
దొంగల భరతం పట్టాకే కొత్త ఇళ్లు
ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలకు పాల్పడిన దొంగల భరతం పట్టిన తర్వాతే కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఒక్కో ఊరిలో ఒక్కో నాయకుడు 10 ఇళ్ల డబ్బులు స్వాహా చేశారంటూ... నిజమా అని ప్రజలను అడిగారు. నిజమేనని ప్రజలు చేతులు ఊపారు. అందుకే దొంగతనం చేసిన వారిని పట్టుకుని సంగతి చూడాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చామని అన్నారు. మూడేళ్లయ్యాక 24 గంటల కరెంట్‌ సరఫరా చేస్తామని సభలో కేసీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్‌ అలీ, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నాయిని నర్సింహరెడ్డి, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, కడియం శ్రీహరి, బీబీ పాటిల్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.సత్యనారాయణ, పార్టీకి చెందిన జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.