Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:31AM

సీఎం నోట హంతక భాషా?

ధ్వజమెత్తిన జాతీయ మీడియా
పాతరేస్తారా? మెడలు విరిచేస్తారా?
‘హిట్లర్‌ సీఎం’ అంటూ టైమ్స్‌ నౌ ఫైర్‌
ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?
సీ్ట్రట్‌ గ్యాంగ్‌ను నడుపుతున్నారా?
మీడియా మీకు భజన చేయాలా?
‘టైమ్స్‌ నౌ’ అర్ణబ్‌ సూటి ప్రశ్నలు
కేసీఆర్‌ తీరు ఆందోళనకరం: ఎన్డీటీవీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ‘పది కిలోమీటర్ల లోతున పాతరేస్తాం. మెడలు విరిచేస్తాం. తెలంగాణలో బతకదలచుకుంటే మాకు శాల్యూట్‌ కొట్టాల్సిందే’ అంటూ మీడియాకు హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరును జాతీయ మీడియా ముక్తకంఠంతో ఖండించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి దాకా చర్చలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలతో ముప్పేట దాడి చేసింది. ‘ఇవేం మాటలు? ఇదేం పద్ధతి? ఒక ముఖ్యమంత్రి ఇలాగా మాట్లాడాల్సింది?’ అంటూ విరుచుకుపడింది. ఆయనది హంతక భాషగా నిరసించింది. ఆయా చర్చల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నేతలకు సూటి ప్రశ్నలు సంధించింది. తెలంగాణలో మూడు నెలలుగా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను నిలిపివేయగా... మంగళవారం వరంగల్‌లో జరిగిన సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో విషయం జాతీయ స్థాయిలో రచ్చకెక్కింది.
చర్చలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నేతలు చీటికి మాటికి టీవీ9 ప్రసారం చేసిన కార్యక్రమంలోని వ్యాఖ్యలను ప్రస్తావించారే తప్ప... ఏబీఎన్‌ చేసిన తప్పేమిటో చెప్పలేకపోయారు. ఇదేవిషయాన్ని సూటిగా అడిగేసరికి నీళ్లు నమిలారు. ‘ప్రసారాల నిలిపివేతతో మాకు సంబంధంలేదు. ఎంఎస్‌వోలను అడగండి’ అంటూ పాతపాటే పాడారు. ఆయా చానళ్లలో చర్చలో పాల్గొన్న పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు కేసీఆర్‌ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. కేసీఆర్‌ తక్షణం క్షమాపణ చెప్పాలని, ఆయనపై చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.
హిట్లర్‌ కేసీఆర్‌...
‘హిట్లర్‌ను... హిట్లర్‌ తాతను’ అంటూ గతంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ‘టైమ్స్‌ నౌ’ ఇప్పుడు గుర్తు చేసింది. మంగళవారం కేసీఆర్‌ చేసిన హెచ్చరికలను ప్రస్తావిస్తూ... ‘ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? వీధి ముఠాను నడుపుతున్నారా?’ అని ప్రశ్నించింది. ‘21వ శతాబ్దపు హిట్లర్‌ ముఖ్యమంత్రి’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ‘టైమ్స్‌ నౌ’ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ఆర్ణబ్‌ గోస్వామి కేసీఆర్‌ వ్యాఖ్యలను దునుమాడారు. ఈ చర్చల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ను ఉద్దేశించి.. ‘చంపేస్తారా? పది కిలోమీటర్ల లోతున పాతేస్తారా? మెడలు విరిచేస్తారా?’ అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ది ‘హంతక భాష’ అని స్పష్టం చేశారు. ఆయనపై కేసు పెట్టాలన్నారు. ఇంతచేసినప్పటికీ కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమని ఈ చర్చల్లో పాల్గొన్న ఇతర ప్రముఖులు విస్తుపోయారు. కేసీఆర్‌ వైఖరి చాలా ఆందోళనకరమని, ఆయన మీడియాతో ఘర్ష్షణ వైఖరిని అవలంబిస్తున్నారని ఎన్డీటీవీ విమర్శించింది. ఈ చానల్‌ నిర్వహించిన చర్చలో ఏబీఎన్‌-ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత పాల్గొన్నారు. ‘తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని మేం ఎప్పుడు అవమానించాం?’ అని రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. టీవీ9 ప్రసారాల గురించే పదేపదే ప్రస్తావించారు.
సీనియర్‌ జర్నలిస్టుల హితవు: పాత్రికేయ వృత్తిలో తలపండిన కులదీప్‌ నయ్యర్‌, ఎస్‌.వెంకట్‌నారాయణ వంటి సీనియర్‌ జర్నలిస్టులు కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. 13 ఏళ్లు కష్టపడి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌, మీడియాతో శత్రుత్వం పెంచుకోవడం సరికాదని కరీంనగర్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌.వెంకట్‌ నారాయణ హితవు పలికారు. తాను ముఖ్యమంత్రినన్న విషయం మరిచిపోయి ఉద్యమకారుడిలా హద్దుమీరి మాట్లాడడం సరైంది కాదన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలు పత్రికా స్వేచ్ఛకేగాక, ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ విమర్శించారు. ‘కేసీఆర్‌కు ఏమైంది..’’ అంటూ ఆయన విస్మయం వ్యక్తంచేశారు. చానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని పిల్లచేష్టగా అభివర్ణించారు. అధికారంలోకి వస్తూనే మీడియాపై దాడి చేయడం కేసీఆర్‌ అసహనానికి నిదర్శనమని మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మండిపడ్డారు. తన 40 ఏళ్ల జర్నలిస్టు జీవితంలో ఇంత దారుణంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని ‘ఔట్‌లుక్‌’ ఎడిటోరియల్‌ చీఫ్‌ వినోద్‌ మెహతా పేర్కొన్నారు.
పిల్లచేష్టలు: కుల్దీప్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి):కేసీఆర్‌ వ్యాఖ్యలు పత్రికా స్వేచ్ఛకేగాక, ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ విమర్శించారు. ఆ వ్యాఖ్యలను దురదృష్టకరమైనవిగా అభివర్ణించారు. ‘‘ కేసీఆర్‌కు ఏమైంది..’’ అంటూ ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ఆయనకు పరిపక్వత లేదని, విశాల హృదయం ఉన్న ప్రజాస్వామికవాది కాదని ఈ వ్యాఖ్యలతో తేలిపోయిందంటూ మండిపడ్డారు. ‘‘తెలంగాణ అనేది ఏర్పడింది. జరిగింద ంతా చరిత్ర. అవన్నీ మరిచిపోయి, విమర్శకులందర్నీ కలుపుకొని పోవాలి. అందరూ చేతులు కలిపితేనే తెలంగాణ అభివృద్ది జరుగుతుంది’’ అంటూ ఆయన హితవు పలికారు. తెలంగాణ ఏర్పాడటంలో మీడియా పాత్రకూడా ఉందన్నారు. చానెళ్ల నిలిపివేతకు మద్దతునీయడం, తెలంగాణలో ఉండాలంటే శాల్యూట్‌ కొట్టాలనడం ముఖ్యమంత్రివి పిల్ల చేష్టలని నిరూపిస్తోందన్నారు. కేసీఆర్‌ ఇకనైనా చానళ్లు పునఃప్రసారమయ్యేలా చూసి, ప్రజాస్వామి కంగా పాలనపై దృష్టి కేంద్రీకరించాలని, అభివృద్దికి పాటుపడాలని ఆయన హితవు పలికారు.
హద్దు మీరడం సరికాదు: వెంకట్‌నారాయణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): మీడియా సంస్థలపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరిని కరీంనగర్‌కు చెందిన జాతీయ జర్నలిస్టు ఎస్‌.వెంకట్‌నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే మీడియాతో ఘర్షణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. 13 ఏళ్లు కష్టపడి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌, మీడియాతో శత్రుత్వం పెంచుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల జాతీయ స్థాయిలో అప్రతిష్ఠపాలవుతారని, నియంత, నిరంకుశుడన్న పేరు వస్తుందని హెచ్చరించారు. మీడియాలో ఏమైనా తప్పుడు వార్తలు వస్తే వాటిపై చర్య తీసుకోవడానికి న్యాయస్థానాలు, ప్రెస్‌ కౌన్సిల్‌తో సహా అనేక వేదికలున ్నాయని, మీడియా యాజమాన్యంతో కూడా మాట్లాడవచ్చునని సూచించారు.
అలా కాకుండా ముఖ్యమంత్రినన్న విషయం మరిచిపోయి ఉద్యమకారుడిలా హద్దు మీరి మాట్లాడడం సరైంది కాదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఢిల్లీలో ఉండి, ప్రపంచాన్ని చూసిన జర్నలిస్టుగా తాను కేసీఆర్‌కు హితవు పలుకుతున్నానని ఆయన పేర్కొన్నారు. కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా మీడియాను నియంత్రించడం సరైంది కాదని, ప్రజలే ఏది చూడాలో ఏది చూడకూడదో నిర్ణయించుకుంటారని ఆయన చెప్పారు. చట్టం, న్యాయస్థానాలు ప్రజాస్వామిక వ్యవస్థలపై గౌరవం పెంచాల్సిన ముఖ్యమంత్రి, అరాచకాన్ని ప్రోత్సహించరాదని స్పష్టంచేశారు. దీనివల్ల జాతీయ స్థాయిలో కూడా భ్రష్టుపడతారని, ఎన్ని మంచి పనులు చేసినా ఎవరి దృష్టికీ రాదని పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలు వదిలేసి తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయాలా అన్న విషయంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. తెలంగాణలో ఉండాలంటే శాల్యూట్‌ కొట్టాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన హోదాకు తగవని వెంకటనారాయణ హితవు చెప్పారు. ‘‘దయచేసి అలా మాట్లాడకండి.. మీ వైఖరి మార్చుకోండి.. సంయమనం పాటించండి.. వెంటనే ఆ రెండు చానళ్లనూ ప్రసారం చేయండి’’ అని ఆయన అభ్యర్థించారు. ఒకవైపు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని ప్రచారం జరుగుతుంటే కేసీఆర్‌ మీడియాను నరికేస్తా.. పాతిపెడతా అన్న రీతిలో ప్రవర్తించడం సరైన సంకేతాలు పంపదన్నారు.
కేసీఆర్‌ అసహనానికి నిదర్శనం: రాజ్‌దీప్‌
కేసీఆర్‌ తాను అప్రజాస్వా మికవాదినని నిరూపించారని మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మండిపడ్డారు. అధికారంలోకి వస్తూనే మీడియాపై దాడి చేయడం ఆయన అసహనానికి నిదర్శనమని విమర్శించారు.