Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:28AM

కేసీఆర్‌ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన

మహిళా జర్నలిస్టులపై లాఠీచార్జిపై ఏపీలో ప్రదర్శనలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనం
పలుచోట్ల మానవహారాలు, ర్యాలీలు, రాస్తారోకోలు

(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌): హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై మంగళవారం జరిగిన లాఠీచార్జిని ఆంధ్రప్రదేశ్‌లోని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు బుధవారం తీవ్రంగా ఖండిం చాయి. అలాగే వరంగల్‌ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. మహిళా జర్నలిస్టులపై దాడులు సిగ్గు... సిగ్గు అంటూ... విజయవాడలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తెలంగాణాలో ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేయడం కేసీఆర్‌ ప్రభుత్వ పాశవిక చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధులతోపాటు ఏపీయూడబ్ల్యూజే నేతలు పాల్గొన్నారు. తెలంగాణాలో ఎబిఎన్‌ చానల్‌ ప్రసారాలు పున: ప్రసారం చేయాలని కోరుతూ గుంటూరులో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రం అందించారు. నర్సరావుపేటలో ర్యాలీ, సత్తెనపల్లిలో రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ లో జర్నలిస్టులపై జరిగిన దాడిని నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆందోళన నిర్వహించారు. తెలంగాణలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ ప్రసారాలను నిలుపుదల చేయడం పత్రికాస్వేచ్చను హరించడమేనని నినదించారు. అనంతరం గడియారస్తంభం సెంటర్‌లో కేసీఆర్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులు కదం తొక్కారు.
హైదరాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా జర్నలిస్టులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఒంగోలులో మానవహారం, ధర్నా నిర్వహించగా, ప్రధాన పట్టణాల్లో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు, గజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, రచయిత్రు ల సంఘం, న్యూ డెమోక్రసీ, గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు మద్దతు ప్రకటించారు. విజయనగరం జిల్లాలో జర్నలిస్టులు ఆందోళనలు, నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్‌ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై లాఠీచార్జిని ఖండిస్తూ, మీడియాపై కేసీఆర్‌ తీరుపై కన్యకాపరమేశ్వరీ కూడలిలో వున్న మహాత్మాగాంధీ విగ్రహానికి జర్నలిస్టులు వినతిపత్రం అందించారు. కేసీఆర్‌ వైఖరిలో మార్పు రావాలని కోరుతూ కొద్దిసేపు మౌనం పాటించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుని నిరసిస్తూ నెల్లూరులో పాత్రికేయులు, మీడియా సిబ్బంది ఆందోళనలు చేశారు. వీఆర్సీ, గాంధీ బొమ్మసెంటర్లలో జర్నలిస్టులు, విద్యార్థులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని రాస్తారోకో చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి చానల్‌ ప్రసారాలను నిలిపివేయడాన్ని అనంతపురం జిల్లాలో సీపీఐ, సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘాలు, ఇండియన్‌ ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్‌లు తీవ్రంగా ఆక్షేపించాయి.
అనంతపురం, గుంతకల్లులో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుంతకల్లులో సీపీఎం, సీపీఐ అనుబంధ విదార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేపట్టారు. హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై పోలీసుల లాఠీచార్జ్‌ను నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తక్షణమే తెలంగాణలో ఏబీఎన్‌ ప్రసారాలను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు.0