Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:26AM

అందరూ దోషులే!

ఏ గ నుల్లోనైనా ఎంత డిపాజిట్‌ ఉంటుందో గనులశాఖ సాంకేతికంగా చెప్పగలదు అనే విషయం తెలియని మన్మోహన్‌ సింగ్‌ను ‘మంచి ఆర్థికవేత్త’ అని అమెరికా ఎలా పొగిండిందో దానికే తెలియాలి. ‘బొగ్గు కుంభకోణంలో దోషిగా నిరూపిస్తే పదవి నుంచి వైదొలుగుతానని’ ప్రకటించిన మన్మోహన్‌ తానుగా తొలగక పొయినప్పటికీ ప్రజలే ఆయన్ను తొలగించారు.
 
బొగ్గు కుంభకోణంలో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టు తన ఆక్షేపణలను మాత్రమే తెలియజేసింది. కేటాయింపులను ఇంకా రద్దు చేయలేదు. ‘మరికొంత విచారణ’ జరిపి ఆ తర్వాత తన నిర్ణయాన్ని చెబుతాననింది. ‘అలా్ట్ర మెగా పవర్‌ ప్రాజెక్టులకు కేటాయించిన బొగ్గు క్షేత్రాలను వాటికి మాత్రమే వినియోగించాల్సి ఉండగా, వాణిజ్య అవసరాలకు ఎలా వినియోగిస్తారు? దానికి మేము అనుమతించబోము.’ అని స్పష్టంగా ప్రకటించిన ధర్మాసనం ఇప్పటికే కేటాయించిన వాటిని రద్దు చేయడంలో ఉన్న సాంకేతిక సమస్యను ఎదుర్కోబోతుంది. బీజేపీ ఎంపీలు ప్రకాష్‌ జవదేకర్‌, హంసరాజ్‌ అహిర్‌లు బొగ్గు కుంభకోణం మీద కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయడానికి కీలకం కాగ్‌ నివేదికే. ఫిర్యాదు ఇవ్వగానే విజిలెన్స్‌ కమిషన్‌ కదల్లేదు. పార్లమెంటులో దీని మీద కొంత గొడవ జరిగిన తరువాతే సీబీఐని రంగంలోకి దించారు. సీబీఐ మీద కూడా నమ్మకం లేకనే ‘కామన్‌ కాజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఇక అక్కణ్ణించి ‘తన పర్యవేక్షణలో పనిచేయమని’ సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక దశలో ‘దర్యాప్తు విషయాలను ప్రభుత్వంతో పంచుకోవద్దని’ కూడా సుప్రీం కోర్టు సీరియస్‌గా చెప్పింది. వేలంపాట పెట్టకుండా ‘వడపోత’ ప్రక్రియ ద్వారా 1993 నుంచి 2010 దాకా అంటే ఎనిమిదేళ్ళలో 218 క్షేత్రాలలో జరిగిన కేటాయింపులన్నింటిలో అవకతవకలూ, అక్రమాలూ జరిగాయంటూ ‘కామన్‌ కాజ్‌’ కోర్టును కోరింది.
‘కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుచుకొనే ఈ సంస్థ రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థే కావచ్చు. కొన్ని సందర్భాలలో నిజాయితీగానే పనిచేయవచ్చు. కొన్ని సందర్భాలలో రాజకీయ వొత్తిడులవల్ల నిజాయితీని కోల్పోవచ్చు. బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రధానమంత్రి మీద కూడా అభియోగం వచ్చింది కాబట్టి, ‘కాగ్‌’ అధికారిని రికమెండ్‌ చేసే నైతిక అర్హత ప్రధాన మంత్రులకు ఎలా ఉంటుంది? అందుకని ఆ సంప్రదాయాన్నించీ ‘ప్రధాన మంత్రి’ని తొలగించాలని ఆ సంస్థ అడగవల్సింది. దోషి స్థానంలో ఉండగలిగే అవకాశం ఉన్న వ్యక్తులు రికమెండ్‌ చేసే (ప్రధాన మంత్రుల) స్థానంలో ఎలా ఉండగలుగుతారు?
‘భారత దేశం ఎలాంటి విదేశీ అధికారుల ప్రమేయం లేకుండా భారతీయులు రూపొందించిన రాజ్యాంగాన్ని మాత్రమే తయారు చేసుకుంటుంది’ అని 1937లో జరిగిన ప్రొవిన్షియల్‌ శాసన సమావేశాల్లోనూ, ఫైజ్‌పూర్‌, హరిపుర, త్రిపురిలలో జరిగిన సదస్సులలో కాంగ్రెస్‌ చెప్పుకుంది. అయితే ‘మీ రాజ్యాంగాన్ని మీరే నిర్మించుకోవటానికి బ్రిటన్‌ అనుమతిని తెలియజేసింది’ అని, 1942లో ఇండియాకొచ్చిన స్టాఫోర్డ్‌ క్రిప్స్‌ తెలియజేసినప్పటికీ మన రాజ్యాంగంలోని అనేక అధికరణల్లో విదేశీయతే ఎక్కువ. చాలా విషయాల్లో ‘సెనేట్‌’ ద్వారా నియామకాలు జరిపే అమెరికా ఈ విషయంలో మాత్రం -‘గవర్నమెంటు అకౌంటబిలిటీ ఆఫీస్‌’కి చెందిన అధికారిని నియమించే పనిని ఒక్క ప్రెసిడెంటుకి మాత్రమే అప్పజెప్పింది. పాకిస్తాన్‌, శ్రీలంకల్లో కూడా ప్రెసిడెంట్లే చూస్తారు. కెనడాలో సెనేట్‌, బ్రిటన్‌లో పార్లమెంటు, ఇండియాలో మాత్రం ప్రధానమంత్రి రికమెండ్‌ చేస్తే ప్రెసిడెంట్‌ నియమిస్తారు. ఇండియాలో ఇప్పటి శశికాంత్‌ నించీ అప్పటి నరహరి వరకూ అంటే మొత్తం 12 మంది కాగ్‌ అధికారుల్నీ రికమెండ్‌ చేసింది ప్రధానమంత్రులే. బొగ్గు కుంభకోణంలో ప్రధాన మంత్రి మీద కూడా అభియోగాలు వచ్చినప్పుడు - ఆ అధికారుల్ని రికమెండ్‌ చేసే స్థానంలో ప్రధాన మంత్రులు ఎలా ఉండగలుగుతారు? అందుకే రాజ్యాంగంలో ఆ ‘సవరణ’ జరగాలి. నిజానికి ఈ ‘బొగ్గు కుంభకోణం’ వరకూ ‘కాగ్‌’ తన నివేదికను సరిగానే ఇచ్చినప్పటికీ - ఈ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయటంలో కొంత తప్పు జరిగింది. 2012 మార్చిలో ‘పది లక్షల ఆరు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది’ అని చెప్పిన ఆరు నెలల వ్యవధిలో ఆ నష్టాన్ని ‘లక్షా ఎనభైవేల కోట్ల’కు కుదించింది. ఈ రెండు నివేదికల్లో వ్యత్యాసం ఎనిమిది లక్షల కోట్లు. దాంతో ‘కాగ్‌ లె క్కలన్నీ ఊహాజనితాలే’ అని మన్మోహన్‌ అనగలిగారు. ‘గనులు తవ్వకుండానే ఇన్ని లక్షల కోట్ల నష్టం అని కాగ్‌ ఎలా చెప్పగలదు??’ అంటూ ప్రధాని హోదాలో ఉన్న మన్మోహన్‌సింగ్‌ అనడం కొంచెం సిగ్గుపడాల్సిన విషయం.
ఏ గనుల్లోనైనా నిక్షేపాలు ఏ పరిమాణంలో ఉంటాయో గనుల శాఖ సాంకేతికంగా చెప్పగలదు అనే విషయం కూడా తెలియని మన్మోహన్‌ను ‘మంచి ఆర్థికవేత్త’ అని అమెరికా వారు ఎలా పొగిడారో వారికే తెలియాలి. ‘బొగ్గు కుంభకోణంలో దోషిగా నిరూపిస్తే ప్రజా జీవితం నుంచి వైదొలుగుతానని’ ప్రకటించిన మన్మోహన్‌ తానుగా తొలగక పొయినప్పటికీ ప్రజలే ఆయన్ను తొలగించారు. ఈ అపకీర్తి అంతా యూపీఏకే చుట్టుకుంటుందనే ఉత్సాహంలో - ‘తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్నామనీ, సుప్రీంకోర్టు వేగంగా ఆ పనిని పూర్తి చేయాలనీ’ ప్రస్తుత బొగ్గు మంత్రి గోయల్‌ ప్రకటించారు. కానీ ఇందులో గోయల్‌ సిగ్గు పడాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. ‘ప్రైవేటు కంపెనీలకు ప్రఽభుత్వ కంపెనీలో భాగస్వామ్య ఒప్పందం ఉన్నట్లు చూపించి, ప్రభుత్వ కంపెనీకి కేటాయిస్తున్న ముసుగులో చివరకు ప్రైవేటు కంపెనీలకే అనేక గనులు కేటాయించారని’ బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆ సందర్భంలోనే సదరు ‘లబ్ధిదారుల్లో బీజేపీ నేత గడ్కరీ కూడా ఉన్నార’నే అభియోగం కూడా వచ్చింది. దీనికి గోయల్‌ ఏమంటారు? కొన్ని అభియోగాలకు ఆధారాలు అంత సుళువుగా దొరకకపోవచ్చు. ఆధారాలు దొరకనంత మాత్రాన అభియోగాలన్నీ అబద్ధాలు కాకపోవచ్చు. పరువునష్టం కేసు వేసి కేజ్రీవాల్‌ను జైలుకు పంపినంత మాత్రాన గడ్కరీ బుద్ధిమంతుడనో, ‘బొగ్గు గనుల్లో అక్రమాలు జరిగాయంటూ’ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన రోజునే - ‘పార్లమెంటు బోర్డులోకి’ గడ్కరీని మోదీ తీసుకున్నంత మాత్రాన గడ్కరీ పవిత్రుడనో అనుకోనక్కర్లేదు.
నన్నూరి వేణుగోపాల్‌
మానవ హక్కుల వేదిక