Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:26AM

నిర్లక్ష్యం ఖరీదు... ఓ నిండు ప్రాణం




కలెక్టరేట్‌: కష్ట కాలంలో ఉంటే ప్రజలు దేవున్ని ప్రార్థిస్తారు. అనారోగ్యంతో ఉంటే వైద్యున్ని దేవునిగా కొలుస్తారు. కాని అటు వంటి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళ్తే... ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని దస్నాపూర్‌ కాలనికి చెందిన రుక్మిణి(40)అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం 7.30గంటలకు రిమ్స్‌ ఆసుపత్రిలో చేరింది. వైద్యం అందించాల్సిన డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం 4గంటల వరకు అనారోగ్యంతో బాధపడుతూ నరకయాతన అనుభవించింది. ఇది చూసి అందుబాటులో ఉన్న మెడికోలు తమకు తెలిసిన చిన్నపాటి వైద్యాన్ని అందించారు. కాని ఆమెపడుతున్న బాధను తగ్గించ లేకపోయారు. చేసేది ఏమి లేక అందులో ప్రధానంగా వైద్యం అందించే ఓ ప్రముఖ వైద్యుడికి ఫోన్‌ చేసి వివరాలు వెళ్లడించారు. ఈ వివరాలు తెలుసుకున్న వైద్యుడు ఆసుపత్రికి రావా ల్సి ఉండగా రాలేదు. అనంతరం కొద్ది సేపటికి రుక్మిణి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సందర్భంలోనైనా వచ్చి చికిత్స అందించాల్సిన ఆ వైద్యుడు రిమ్స్‌కు రాక పోవడమే కాకుండా స్థానికంగా ఉన్న వైద్యులకు ఫోన్‌ద్వారా వైద్యం ఏ విధంగా అందించాలో చెప్పినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. తీరా సరైన సమయంలో వైద్యం అందక మహిళ రాత్రి 8గంటల ప్రాంతంలో మృతి చెందింది. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని నిర్మించిన రిమ్స్‌ ఆసుపత్రిలో వైద్యం కరువైందని ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చే రోగులకు చికిత్స అందించడం ఏమో కానీ బ్రతికి బయట పడితే చాలనే అనుమానం కలిగే విధంగా వైద్యుల తీరు ఉందని మండిపడ్డారు.
ఈ రోజు వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుక్మిణికి సకాలంలో వైద్యం అందించకుండా ఆమె మృతికి కారణమైన వైద్యుడిపై, భవిష్యత్తులో ఇలాంటి మరణాలు పునరావృతం కాకుండా పై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని, మృతిరాలికుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్థానిక టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో మృతురాలి బంధువులు స్టాఫ్‌ నర్స్‌, డైరెక్టర్‌, సీఎంవో, డ్యూటీ డాక్టర్‌పై హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. డాక్టర్‌ ఆసుపత్రికి రాకుండా ఫోన్‌లో పేషంట్‌కు ఎలా ట్రీట్‌మెంట్‌ చేయాలో చెప్పడం కొసమెరుపు.