Sep 11 2014 @ 02:22AM

చంద్రశేఖర ‘శతకం

తెలంగాణ తొలి ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పరిపాలన శత దినం సంపూర్తి చేసుకున్న సంతోషకర సందర్భం. ఇది పరిపరివిధాల చర్చలకూ సందర్భమవడం కూడా సహజమే. అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని మూడున్నర మాసాలైనా గడవకముందే అంచనా కట్టడంలో చాలా సమస్యలుంటాయి. అయితే ఆరంభంలో ఏర్పడే అభిప్రాయాలకు అత్యధిక ప్రాధాన్యతా వుంటుంది. ఈ వంద రోజులలో మెరుగూ తరుగూ పరిశీలించుకోవడం అధికారంలో వున్నవారికి చాలా అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ అవసరం గుర్తించబట్టే తన పాలన సంతృప్తిగా లేదని ప్రకటించుకున్నారు. ప్రణాళికల రూపకల్పన పూర్తి కావాలన్నారు. ఈ స్వల్ప కాలంలో అద్భుతాలు ఆశించడానికి లేదన్న ఆయన మాటలను బలపర్చవలసిందే. అయితే వంద రోజులకు తగిన సంతృప్తి కూడా లేదేమిటని ప్రశ్నించవలసి వస్తుంది. నన్ను నేనే పొగుడుకోగలిగినప్పుడు ఇతరులను శ్రమ పెట్టడం ఎందుకు అన్నాడో ఆంగ్ల రచయిత. అదే సూత్రాన్ని తిరగేస్తే గనక నిన్ను నీవే విమర్శించుకోవడం మరో వ్యూహం. కేసీఆర్‌ మాటల్లో ఆ వుద్దేశం వుందో లేదో గానీ ఆయన వెలిబుచ్చిన అసంతృప్తి తెలంగాణ సమాజంలోనూ పరిశీలకుల్లోనూ వున్న అభిప్రాయాన్నే ప్రతిబింబించింది. మొదట చాలా దూకుడుగా మొదలై ప్రకటన పరంపరతో హామీలు వాగ్దానాల వరద ఉప్పొంగిన పరిస్థితి. దాంతో పోలిస్తే ఫలితాలు పరిమితంగానూ సందేహాస్పదంగానూ వున్నాయనేది కళ్లముందు కనిపిస్తున్న నిజం.
తెలంగాణ కొత్త రాష్ట్రం గనక దిశా నిర్దేశం సమయం పట్టే పని. అదే సమయంలో రాజధాని కొనసాగింపు, మిగులు బడ్జెట్‌తో సహా కొన్ని అనుకూలాంశాలూ వున్నాయి. నిన్నటిదాకా కదంతొక్కిన ఉద్యమ శ్రేణులు అంకిత భావంతో వచ్చిన అధికారులు, మద్దతుగా వుంటాయనే ఉద్యోగులు ఉన్నారు. విద్యుచ్ఛక్తి కొరత వంటి గడ్డు సమస్యలు వున్నా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగానే వున్నారు. అధికార పీఠం అధిష్టించిన టీఆర్‌ఎస్‌ అధినేతపై సుహృద్భావం రీత్యా ప్రతిపక్షాలు కూడా పెద్దగా విమర్శలు చేయడానికి తటపటాయించాయి. వామపక్షాలు కూడా సముచిత వ్యవధి ఇవ్వాలనే భావించాయి. కేబినెట్‌ మంత్రులు పార్టీ నాయకులు సర్వాధికారం అధినేతకే అప్పగించి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇన్ని అనుకూలాంశాల మధ్య తనకు స్పష్టమైన దార్శనిక విధానాలున్నాయని ఒకటికి రెండు సార్లు ప్రకటించిన అధినేత బడ్జెట్‌ కసరత్తు కూడా వాయిదా వేసుకోవడం దేనికి నిదర్శనం? ఉమ్మడి అంశాల్లోనూ కొన్ని విడివిడి విషయాల్లోనూ కూడా న్యాయస్థానంలో అక్షింతలు వేయించుకోవడం నిర్ణయాలు వెనక్కు పోవడం ఏం సూచిస్తుంది?
కాంగ్రెస్‌ తెలుగుదేశం వంటి పార్టీలు గతంలో సుదీర్ఘ కాలం పాలించాయి. ఇప్పుడు అవి పాలిస్తున్న చోట్ల కూడా పెద్ద ఒరగబెట్టింది లేదు. కనుక అవి ఈ మూడు నెలల్లోనే ఏదో మునిగిపోయినట్టు మాట్లాడితే పెద్ద విలువుండదు. విభజనకు ఆధ్వర్యం వహించింది కూడా కాంగ్రెసే గనక అనంతర సమస్యలలో వారికీ చాలా పాత్ర వుంటుంది. తెలుగుదేశం కూడా తమ వల్లే జరిగిందని ఇప్పుడున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తమకు అనుకూలమైందనీ చెబుతున్నందున వారి వ్యాఖ్యలను కూడా యథాతథంగా తీసుకోలేము. బీజేపీ నాయకులు కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్రంగానే దాడిచేస్తున్నారు గానీ కేంద్రంలో వారి ప్రభుత్వం ఇరు రాష్ర్టాలకూ చేసిందేమీ లేదన్నది నిజం. కనుక వీరి విమర్శలు పక్కనపెట్టి ముఖ్యమంత్రి స్వీయ అసంతృప్తినే మనం పరిశీలించవచ్చు. కేసీఆర్‌ వాగ్దానాలు ఘనంగా వున్నా ఆచరణ స్వల్పంగా వుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నమాటతో విభేదించే వారెవరూ వుం డరు. కర్త కర్మ క్రియ అన్నీ ఒకరే అయినప్పుడు పోరాడి తెచ్చుకున్న నవతెలంగాణ తొలిఅడుగులు ఇంత మందకొడిగా వుండటానికి కారణమేమిటి? విధానాల్లో అస్పష్టతకు కారకులెవ్వరు?
సింగపూర్‌ కబుర్లు, కరీంనగర్‌ను లండన్‌గా మార్చడం వంటి మాటలు అతిశయోక్తులని వదిలేయొచ్చు. ప్రజల తక్షణ సమస్యలపై చొరవతో స్పందించకపోవడాన్ని ఏమనాలి? రైతులు రుణమాఫీపై అయోమయాన్ని ఎలా వివరించాలి? ఫీజుల సమస్యపై కోర్టులో ఎదురైన సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి? దళితులకు మూడెకరాల భూమి పంపకం మొక్కుబడిగా ముగించడం దేనికి సంకేతం?పారిశ్రామిక వేత్తలకు లక్షల ఎకరాల భూ నిల్వ వుందంటున్న ప్రభుత్వం దళితుల కోసం మాత్రం భూమి కొని ఇస్తాననడం దళారుల దందాకు అవకాశమిస్తున్న మాట నిజం కాదా?
సర్వే పూర్తి కాకుండా వివరాలు విశ్లేషించుకోకుండా అసలు జరపడమే ఘనమైనట్టు అమితంగా చెప్పుకుని ఆనందించడంలో ఔచిత్యమెంత? కేజీ టు పీజీ విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన, నిధుల విడుదల వంటి అనేకానేక తక్షణ సమస్యలు కూడా తర్వాతకు వాయిదా వేయడంలో ఔచిత్యం ఏమిటి? రోజుకో కార్పొరేట్‌ కరోడ్‌పతిని కలుసుకునే వారు కార్మిక ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కాలం కేటాయించకపోవడం వెనక కారణాలేమిటి? విద్యార్థులు, రైతులు ఆఖరుకు మహిళా జర్నలిస్టులపైన కూడా లాఠీచార్జీలు చేయించాల్సినంత అగత్యం ఏమొచ్చింది? ప్రభుత్వాధినేతలకు కష్టం కలిగించినా అనివార్యంగా ముందుకొచ్చే ప్రశ్నలివి. అసలు అన్నిచోట్లా సమస్యలకు మూలమైన సరళీకరణ నమూనాకు భిన్నంగా చెప్పినమాట ఒకటైనా వుందా?
ఇతర పార్టీల వారిని టోకున తెచ్చుకుని శాసనసభ్యుల సంఖ్యను 63 నుంచి 75కు పెంచుకోవడానికి ఈ సమయం సరిపోయింది. గద్దెక్కిన మరురోజే మజ్లిస్‌తో దోస్తీకి ఆతృత వ్యక్తమైంది. పదవీ సంతర్పణలు రాజకీయ పునరావాసాలు షరా మామూలుగానే నడిచాయి. మెదక్‌లో సర్వశక్తులూ మొహరించడానికీ ఆటంకం లేకపోయింది. (అక్కడా వామపక్షాలు టీఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నాయనేది నిజం) ఈ రాజకీయ క్రియాశీలతకు తగినట్టు సమస్యల పరిష్కారంలో చొరవ చూపించడానికి నిధులు మంజూరు చేసి రంగంలోకి దిగడానికి మాత్రం సమయం చాలలేదు. కేబినెట్‌ సమిష్టి సూత్రం వెనక్కుపోయి సర్వం ముఖ్యమంత్రి ప్రవచితమేనన్న విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఆఖరుకు ఒక ఉప ముఖ్యమంత్రిని తప్పిస్తారన్న కథనాల నేపథ్యంలో బహిరంగంగా అభిశంసించినంత పని జరిగిపోయింది. రుణమాఫీ విషయంలో తొలి వారంలోనే ఆర్థిక మంత్రికి అక్షింతలు వేసిన అధినేత బడ్జెట్‌ వాయిదాను కూడా తానే ప్రకటించే పరిస్థితి ఏర్పడింది.
ఇవన్నీ ఒకటైతే రెండు చానళ్ల ప్రసారాలు నిలిచిపోవడం నవ తెలంగాణ తొలి ఘట్టంలో ఒక మచ్చగా మారింది. దీనిపై గతంలో కూడా ఈ శీర్షికన చర్చించాము. టీవీ9 క్షమాపణలు పదే పదే చెప్పిన తర్వాత కూడా ప్రసారాలు పునరుద్ధరించబడలేదు. ఇక ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌పై ఎందుకు ‘శిక్ష’ వేశారో కూడా చెప్పలేదు. కథనాలు పొరబాటని ఖండించవచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రసారాలు నిలిపివేత నిరవధికంగా సాగించడం ప్రజాస్వామిక వాదులెవరూ హర్షించగలిగింది కాదు. కక్ష కట్టేంత అసహనపూరితమైందీ కాదు. ఇది మా ప్రమేయం లేకుండా ఎంఎస్‌వోలు చేశారని తప్పుకోవడం వారి భుజంపై తుపాకీ పెట్టి కాల్చిన చందమే. అలా అయితే పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదు? సంబంధం లేదని చేతులు దులుపుకోవడం, ఆ చేత్తోనే ప్రసారాలు నిలిపేసిన వారికి సెల్యూట్‌ చేయడం అత్యున్నత పదవీ పరివేష్టితులకు వన్నె తెచ్చేవి కావు. ‘ఈ గడ్డపై వుండదల్చుకుంటే మాకు సెల్యూట్‌ చెయాలి’ అని చెప్పడంలో ముఖ్యమంత్రి ఆంతర్యం ఏమైనా ప్రణమిల్లాలని శాసించే హక్కు రాజ్యాంగంలో లేదు. బానిసోన్నిదొరా కాల్మొక్కతా అనే పరిస్థితికి సమాధి కట్టి ప్రజా చైతన్య ప్రతీకగా నిల్చిన తెలంగాణ సమాజం అలాంటి ఆధిపత్య కాంక్షలకు ఎన్నడూ పాల్పడదు. ఈ నిలిపివేత వల్ల అభద్రత పాలైన ఆ సంస్థల తెలంగాణ జర్నలిస్టులు మహిళలు ఆందోళన చేస్తే లాఠీచార్జి కూడా దారుణమే. సమరశీలతతో పాటు సహనశీలత కూడా కలిగిన తెలంగాణ సమాజం పత్రికా స్వేచ్ఛ కోరుకునే వారు ఈ ఆంక్షలు ఆటంకాలను ఎంతమాత్రం ఆమోదించలేరు. పైగా ఈ ధోరణి రేపు ఇతరులకూ విస్తరిస్తే కలిగే అనర్థం చాలా వుంటుంది.

కేసీఆర్‌ ప్రభుత్వానికి శతదినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఆకాంక్షలు నిజంగా శుభం కలిగించాలని, ఆంక్షలు తొలగిపోవాలని కోరుకుందాం.
తెలకపల్లి రవి