Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:18AM

ఎజెండా లేని కేసీఆర్‌ పాలన!

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు మీకు మీ ప్రభుత్వానికి అభినందనలు. ఏ ప్రభుత్వం పనితీరైనా వంద రోజుల్లో అంచనా వేసి తీర్పు చెప్పడం న్యాయం కాకపోవచ్చు. కానీ ఐదేళ్ళ పాలనకు సంబంధించి ఒక క్రియాశీల ప్రణాళికను తయారు చేసేందుకు ఆశలతో ఎన్నుకొన్న ప్రజానీకానికి ఒక సానుకూల సంకేతాన్ని ఇవ్వటానికి ఈ సమయం ఖచ్చితంగా సరిపోతుంది. కానీ గడచిన జూన్‌ 2న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీరు ఈ దిశలో ఎటువంటి ప్రయత్నాలు చేయకపోగా ఒక ఎజెండా అంటూ లేకుండా మాటలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తుండటం దురదృష్టకరం. మీరు ప్రకటించిన వందల పథకాలలో ఒక్కటి కూడా మొదలు కాలేదు. సింగపూర్‌ వెళ్ళివచ్చారు. అక్కడి అభివృద్ధిని ‘కాపీ-పేస్ట్‌’ చేస్తామన్నంత ఉద్వేగభరితమైన ఆశలు కల్పించారు. కరీంనగర్‌ను లండన్‌ నగరంలా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తెలంగాణ ఉద్య మంలో చురుకైన పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ కూడా మీ ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని భావించింది. దురదృష్టవశాత్తు మాటలే తప్ప చేతలు కనిపించని పరిస్థితి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
లక్ష రూపాయలలోపు రైతులకు రుణ మాఫీ చేస్తామని మీరు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో దీని అమలుకు వాస్తవానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఖరీఫ్‌ సీజన్‌ పూర్తికావస్తున్నా ఇంకా రుణ మాఫీ అర్హుల జాబితా రూపొందిస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారు. క్రాప్‌లోన్స్‌ దొరకక రైతులు వడ్డీ వ్యాపారుల రుణ చక్రంలో ఇరుక్కుంటున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేసి ‘ఫాస్ట్‌’ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్టే ప్రకటించారు. ఫాస్ట్‌ పథకం కింద ఫీజు మాఫీకి స్థానికత ప్రామాణికం, 1956 సంవత్సరానికి ముందే తెలంగాణలో స్థిరపడిన వారే అర్హులంటూ ఒక గందర గోళానికి తెర తీశారు. దీని వల్ల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆలస్య మవ్వటం, గతంలోలా సీటు దొరికిన సమయంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుచేసే విధానం లేకపోవటంతో దాదాపు లక్షన్నర మంది పేద విద్యార్థులు కౌన్సెలింగ్‌ నుంచి వైదొలిగారు. ఇది మీ ప్రభుత్వానికి గౌరవప్రదమనిపిస్తుందా? కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులు రద్దుచేయటం వల్ల అందులో చదువుకుంటున్న ద్వితీయ, తృతీయ, ఫైనల్‌ సంవత్సరాల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. మెడికల్‌ విద్యార్థులకు ఫీజులను భారీగా పెంచుకునేలా కాలేజీలను అనుమతించడాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఈ స్థాయి ఫీజులు దేఽశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేవన్న విషయం వాస్తవం కాదా? రైతులకు ఎనిమిది గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామని మీ హామీ పత్రంలో గొప్పగా చెప్పారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే రక్తాలు చిందేటట్టు లాఠీచార్జి చేయించారు. మీ సొంత గజ్వేల్‌ నియోజకవర్గ రైతులకు సైతం లాఠీల గాయాలు తప్పలేదు. ఎన్నికలప్పుడు ‘మీ కాలిలో ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా’ అని తేనెలాంటి తియ్యటి మాటలు చెప్పిన మీరు.... లాఠీ దెబ్బలు తిన్న రైతులను కనీసం పరామర్శించారా? గతంలో రైతుల రక్తం కళ్ళ చూసిన ప్రభుత్వాలు, వరుసగా సాగిన ఆత్మహత్యలను అడ్డుకోలేకపోయిన ప్రభుత్వాలు పతనమై ప్రజలకు దూరమైన వాస్తవం మీకు తెలియదా?
మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 200 మంది రైతులు అప్పుల బాధతో ప్రాణత్యాగం చేస్తే మీకు చీమకుట్టినట్లయినా అనిపించలేదా? రుణమాఫీపై స్పష్టమైన ఆదేశాలిచ్చి ఆ ప్రక్రియను మొదలుపెట్టి ఉంటే వీరి ఆత్మహత్యలు ఆగి ఉండేవి కాదా? చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించటానికి వెళ్ళే తీరిక మీకైతే ఎట్లాగూ ఉండదు. మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా లేదా?
ఆ మధ్య మీ సొంత జిల్లా మాసాయిపేట రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 24 మంది పాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే... ఆ కుటుంబాలను ఓదార్చే తీరిక మీకు దొరకలేదా? దేశమంతా కన్నీరుపెట్టిన ఈ దుర్ఘటన బహుశా మీకు చాలా చిన్న ఉదంతంగా అనిపించి ఉండవచ్చు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగమన్నారు. మీ మాటలు నమ్మి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది యువకులు, విద్యార్థులే కదా? ఇప్పుడు ఉద్యోగాల విషయంలో స్పష్టత కావాలని ఆందోళన చేస్తున్న ఉస్మానియా విద్యార్థులను అరెస్టులు చేయించటం చూస్తే వారి పట్ల మీ వైఖరి ఇలాగే ఉంటుందని అనుకోవచ్చా? తిన్నది అరగక ఉద్యోగాల పేరుతో దీక్షలు చేస్తున్నారని ముఖ్యమంత్రిగా వారిని అవమానించేలా వ్యాఖ్యానించటం సబబేనా? ఆంధ్ర విడిపోతే 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయని అనలేదా? ఇక మీ విద్యామంత్రి ఇప్పట్లో డీఎస్పీ నియామకాలు ఉండవని తేల్చి చెప్పారు. పొరుగు రాష్ట్రంలో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని అక్కడి విద్యామంత్రి ప్రకటించటం మీ దృష్టికి వచ్చే ఉంటుంది.
సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించే విషయమై ఎందుకు మౌనం వహిస్తున్నారు. మీతో అంటకాగుతున్న ఎమ్‌ఐఎమ్‌ ఈ ఉత్సవాల విషయంలో అయి ష్టంగా ఉన్నందుకేనా? ఇళ్ళు లేనివారికి పిల్లర్లతో డబుల్‌ బెడ్‌రూమ్‌ నివాసం 125 గజాల్లో మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇస్తానని మీరిచ్చిన హామీ ప్రకారం ఎప్పటికి అమలు చేయటం సాధ్యమౌతుందని మీరనుకుంటున్నారు? ఎన్ని లక్షల మందికి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనుకుంటున్నారో అంచనాలేవైనా మీ దగ్గర ఉన్నాయా?
భూమిలేని దళితులకు మూడెకరాల సాగుభూమిని పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పారు. రాష్ట్రంలోని లక్షల కుటుంబాలకు గజం భూమి కూడా లేదు. వీరందరికీ భూ పంపిణి చేయటానికి మీరు చేస్తున్న కార్యాచరణ ఏమిటి? ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద యేటా పదివేల కోట్ల చొప్పున ఐదేళ్ళలో యాభై వేల కోట్లు ఖర్చుపెడతామన్నారు. మరి మొదటి ఏడాదిలో నాల్గవ నెల మొదలైనా నాలుగు లక్షల రూపాయలైనా విదల్చలేదెందుకు?
ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ మిగులు విద్యుత్తు వెయ్యి మెగావాట్లను రాషా్ట్రనికి రప్పిస్తామన్నారు. ఇప్పటిదాకా ఒప్పంద ప్రతిపాదనలేవీ అందలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తెలిపారు. ట్రాన్స్‌మిషన్‌ లైన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టడానికి జాప్యం ఎందుకు జరుగుతోంది?
ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా ‘సమగ్ర కుటుంబ సర్వే’ జరిపించారు. ఈ సర్వేలో పాల్గొనకపోతే జనాభా లెక్కల్లో లేనట్లేనని మీరు చేసిన హెచ్చరికకు భయపడి ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఒంటికాలిపై ప్రయాణం చేసి ఇళ్ళకి చేరుకున్నారు. సర్వేలో ఇల్లులేదని చెపితే ఇల్లు ఇస్తారేమోనని, రేషన్‌కార్డు లేకపోతే కార్డులిస్తారని, చదువుకొనే పిల్లలుంటే ఫీజులు కడతారేమోనని, అప్పులేమైనా ఉంటే మాఫీ చేయిస్తారేమోనని పాపం ప్రజలు ఎన్నో ఆశలతో ఆ రోజు ఎన్యుమరేటర్ల కోసం గడప దాటకుండా లోపలే ఉండిపోయారు. సర్వే పూర్తయింది. పదిహేను రోజులు కూడా దాటింది. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమౌతున్నది ఏమిటంటే రేషను కార్డులు తొలగించడానికి, ఆరోగ్య్రశీ కార్డులు తీసివేయటానికి, వృద్ధాప్య -వితంతు పింఛన్లును అర్హతలేదనే పేరుతోలాక్కోవడానికని.
మీ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన వరంగల్‌లో మీడియా సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించడం, అన్యాయంగా అరెస్టు చేయించడం చూస్తే మున్ముందు కూడా మీ పాలనలో మీడియాకు వేధింపులు తప్పవని అనుకోవచ్చా? హైదరాబాదులో మీ అధికార నివాసం వద్ద మహిళా టీవీ జర్నలిస్టుల పైకి మగ పోలీసులతో దాడి చేయించటం, కెమెరాలు లాక్కోవటం, ఓబీ వ్యాన్ల లైవ్‌వైర్లను తెంచేయటం మీ ప్రభుత్వానికి వన్నెతెచ్చే అంశం కాదు. తలలు నరుకుతాం.. తరిమికొడతాం.. పది కిలోమీటర్ల లోతున బొందపెడతాం.. లాంటి మాటలు మీరు అనాల్సినవి కావు. మీ ప్రతిష్ఠను పెంచేవి కావు.
ప్రజలు మీకు సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టినా ఎందువల్లనో మీరు అభద్రతా భావంతో ఉన్నట్టు కనబడుతున్నది. మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేలలో చీలిక తెస్తారని నిరంతరం మీరు పీడకలలు కంటున్నట్టు కనిపిస్తున్నది. ఈ కారణం వల్లనే ఇతర పార్టీలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను పార్టీలోకి తీసుకున్నారు. పదివేలకు పైగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ దరాఖాస్తులు మీ ఆఫీసులో పెండింగులో ఉన్న విషయం వాస్తవం కాదా? చావు బతుకుల్లో ఉన్న రోగులు శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తుంటే రిలీఫ్‌ఫండ్‌ నిధులు విడుదల చేసే తీరిక మీకు దొరకటం లేదా? మనసొప్పటం లేదా?
సుమారు 2,500 ముఖ్యమైన ఫైళ్ళు మీ సంతకం కోసం ఎదురుచూస్తున్న విషయం నిజం కాదా? హైదరాబాదు సిటీలో 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విద్యుత్‌ బకాయిలు చెల్లించని కారణంగా సరఫరాను నిలిపివేసిన విషయం మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. ఎస్సీ, బీసీ హాస్టళ్ళు, పాఠశాలల్లో కరెంటు డిస్‌కనెక్ట్‌ చేసిన విషయం కూడా మీ దృష్టికి రాలేదా?
సమైక్యాంధ్ర అనుకూల పార్టీ అయిన సీపీఎం మద్దతును మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎందుకు తీసుకుంటున్నారు? ఇది అవకాశవాదం కాదా? సమైక్యాంధ్రకు నిలువెత్తు సాక్షి అయిన తెలుగుదేశం నేత తుమ్మల నాగేశ్వరరావును ఆ పార్టీనుంచి మీవద్దకు ఫిరాయించేలా ఉరుకులాడటం ఏ విధమైన తెలంగాణ వాదం?
 జి. కిషన్‌రెడ్డి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు


ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ

రైతులకు ఎనిమిది గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామని మీ హామీ పత్రంలో గొప్పగా చెప్పారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే రక్తాలు చిందేటట్టు లాఠీచార్జి చేయించారు.... మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 200 మంది రైతులు అప్పుల బాధతో ప్రాణత్యాగం చేస్తే మీకు చీమకుట్టినట్లయినా అనిపించలేదా? రుణమాఫీపై స్పష్టమైన ఆదేశాలిచ్చి ఆ ప్రక్రియను మొదలుపెట్టి ఉంటే వీరి ఆత్మహత్యలు ఆగి ఉండేవి కాదా?