Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:17AM

దమ్ము కొడితే... దుమ్మురేగుద్ది




గుంటూరు(నల్లచెరువు): పక్కన ఎవరు ఉన్నారు.. వారు ఏవిధంగా ఇబ్బంది పడుతున్నారు.. ఏ ప్రదేశంలో ఉన్నాము.. అని కూడా చూడకుండా పొగరాయుళ్లు గుప్పుగుప్పుమంటూ సిగరెట్‌ మీద సిగరెట్‌ ఊదిపారేస్తుంటారు. ఇక ఇలాంటి చర్యలకు కేంద్రం ఫుల్‌స్టాప్‌ పెట్టే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. బహిరంగ ధూమపానాన్ని నియంత్రించాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ధూమపానం చేస్తే ఇప్పటి వరకు ఉన్న రూ.200 జరిమానాను రూ.20 వేలకు పెంచాలని తీర్మానించింది. పొగాకు వినియోగంపై నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింది. ఈ బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్‌ అన్న గిరీశం వారసులమంటూ రింగురింగులుగా పొగ ఊదేస్తున్నారు. ఈ పొగతాగే వారి సంగతేమో గానీ పక్కన ఉన్న వారికి త్వరగా క్యాన్సర్‌ సోకే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొగరాయుళ్ల పని పట్టాలని కేంద్రం గట్టిగా నిర్ణయించిది. ఈ మేరకు కఠిన నిర్ణయాలతో కూడిన బిల్లును ఆమోదింపజేయాలని తీర్మానించింది.
చట్టంలో అంశాలు ఇవే...?
పొగాకు వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పొగాకు ఉత్పత్తులతో వచ్చే గుట్కాలను, పాన్‌ పరాగ్‌లను పలు చోట్ల నిషేధించారు. అయితే ఇది ఆయా రాషా్ట్రల పరిధిలో రాషా్ట్రలే తీసుకున్న నిర్ణయం. ఈ దఫా మాత్రం కేంద్రం రంగంలోకి దిగింది. పొగాకు వినియోగంపై నిబంధనలు కఠినతరం చేయనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు సిగరెట్‌ పెట్టలపై పుర్రె చిహ్నం లేకుంటే ఆ కంపెనీకి విధించే జరిమానాను రూ.5 వేల నుంచి రూ.50 వేలకు పెంచనున్నారు. అదే విధంగా సిగరెట్‌ లూజ్‌ విక్రయాలు నిషేధించనున్నారు. దీంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే విధించే జరిమానాను రూ. 200 నుంచి రూ.20 వేలకు పెంచనున్నారు.
గతంలో గుంటూరులో..
గతంలో గుంటూరులో అర్బన్‌ ఎస్పీ రవికృష్ణ ఉన్న సమయంలో ‘చెల్లెళ్ల కోసం’ అనే కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం కట్టడికి పలు చర్యలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిని మొదటి విడతలో కౌన్సెలింగ్‌ ఇవ్వడం.. ఆ తర్వాత జరిమానా వేయడం లాంటి చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో పోలీస్‌ చర్యలతో బహిరంగ ధూమపానం కొంత కట్టడి అయ్యింది. గతంలో ఉన్న నిబంధనలను ఎస్పీ అమలు చేయడంతో పొగరాయుళ్లు ఎక్కడంటే అక్కడ సిగిరెట్‌ ముట్టించడానికి భయపడ్డారు. రవికృష్ణ చర్యలతో పలు వర్గాల నుంచి అభినందనలు కూడా అందుకున్నారు. ఆయన బదిలీ అయిన తర్వాత దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు.