Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:16AM

కాశ్మీర్‌ విలయం!

అందాల కాశ్మీరం అల్లాడిపోయింది. వారం రోజులుగా ఈ భూలోక స్వర్గంలో ప్రజలు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. వందేళ్ళలో కనీవినీ ఎరుగని రీతిన వచ్చిపడిన వరదలతో కూడగట్టుకున్నదంతా కొట్టుకుపోయింది. కాపాడటానికి వచ్చిన సైనికుల మీద వారు ప్రదర్శించిన ఆగ్రహం నీటి కోసం తిండి కోసం ఎంతగా వాచిపోయారో తెలియచెబుతోంది. చుక్కనీరులేక విలవిల్లాడి పోవడమూ, నాలుగు చుక్కలు కురవగానే అల్లాడిపోవడమూ ఇటీవలి కాలంలో మనం దేశవ్యాప్తంగా చూస్తున్న విషాదం. అతివృష్టి, అనావృష్టి మధ్య బితుకుబితుకు మంటున్న మన బతుకులను ఈ సంఘటన మరోమారు కళ్ళకు కట్టింది.
విపత్తు ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదన్న మాట వాస్తవం. ఇప్పటివరకూ సైన్యం కాపాడింది వేలల్లో ఉంటే, కాపాడాల్సిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. మరణించినవారి సంఖ్య ప్రస్తుతానికి వందల్లోనే ఉండవచ్చు కానీ, ఉధృతి ఉపశమించిన తరువాత కానీ నిజం నిగ్గుతేలదు. వరుసగా వారం పాటు కుండపోతగా వర్షాలు కురిసినందువల్ల నదులు, సరస్సులు ఉప్పొంగి పల్లెలూ, పట్టణాలూ అన్న తేడాలేకుండా సర్వమూ నేలమట్టమయ్యాయి. ఒకవైపు కొండచెరియలు విరిగిపడటమూ, మరోవైపు దారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో ఇంకా ఆరులక్షలమంది దిక్కుతోచని స్థితిలో ఆకాశంవైపు వెర్రిచూపులు చూస్తున్నారు. వానలు పెద్దగా కురవని నెలలో ఇంతటి బీభత్సం జరుగుతుందని ప్రజలే కాదు, పాలకులు కూడా ఊహించలేదు. ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా దీనిని మానవతా సంక్షోభంగా అభివర్ణిస్తూనే, ప్రజలను తప్పుపట్టే విధంగా, హెచ్చరిక వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయన్నట్టు వ్యాఖ్యానించడం సముచితంగా లేదు. కాశ్మీర్‌లో ఆ వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. ఇటువంటి సందర్భాల్లో సాధారణ స్థాయి హెచ్చరికలు చేసి చేతులు దులుపేసుకుని, చివరకు బాధితులనే తప్పుపట్టడం మానవత్వం కాదు. ప్రధానమంత్రి ప్రకటించినట్టు ఇది జాతీయ విపత్తు. తదనుగుణంగానే కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలు ఇతోధికంగా చేయూతనివ్వడానికి సిద్ధపడ్డాయి. ఆఖరి మనిషిని ఆదుకునేవరకూ తరలివెళ్ళేది లేదని సైన్యం చేసిన ప్రకటన ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఈ దురావస్థలో ఇంతకుమించిన ఆశ్వాసన ఆశించలేం. ఇంతకాలం శాంతిభద్రతల నిర్వహణపేరుతో విస్తృతాధికారాలు ప్రయోగించిన సైన్యం ఇప్పుడు మానవీయముఖంతో సహాయం చేయడం అక్కడి ప్రజల్లో వారిపై విశ్వాసం కలిగిస్తుందని ఆశిద్దాం.
సునామీ సంభవించిన తరువాత మిగతా దేశాల ఒత్తిడి కారణంగానో, వాటి ప్రాణభయం వల్లనో మనం కూడా కొన్ని వ్యవస్థల రూపకల్పనలో భాగస్వాములమయ్యాం. కానీ, ఉత్తరాఖండ్‌ జలప్రళయం మనకు ఏ పాఠాలు నేర్పలేదని అర్థమవుతోంది. హిమాలయాలు ఆవరించిన ఒక పర్వత ప్రాంతం ఎటువంటి విపత్తులకు ఆలవాలమో ఇప్పటికీ అంచనా లేదన్నమాట. ఈ విషయంలో ముఖ్యభూమిక పోషించవలసిన జాతీయ విపత్తుల నివారణ ప్రాఽథికార సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ) ఉత్తరాఖండ్‌ అనుభవం తరువాత ఈ ప్రాంతంపై ఎంతటి శ్రద్ధ పెట్టిందో తెలియదు. కేంద్ర జలసంఘం వరద హెచ్చరికల విషయంలో ఎటువంటి పాత్ర పోషించిందో తెలియదు. ఉత్తరాఖండ్‌ ఘటన అనంతరం సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ ఇటువంటి విపత్తులకు ముందు, తరువాత హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలు తీసుకోవలసిన చర్యలపై ఒక నివేదికను సమర్పించింది. కానీ దానిని ఉత్తరాఖండ్‌ సహా ఏ రాష్ట్రమూ ఖాతరు చేయలేదు. అనేక అనుభవాల తరువాత కూడా ఇటువంటి ప్రకృతివైపరీత్యాల విషయంలో ఆయా ప్రాంతాల భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా విధానాలను రూపొందించుకోవడమూ, పాటించడమూ జరగడం లేదు. కాశ్మీర్‌కు ఈ స్థాయిలో కాకపోయినా అకస్మాత్తుగా వరదలు పొంగుకురావడం కొత్తకాదు. గత యాభైయేళ్ళలో మూడుసార్లు పెనువిపత్తులను కూడా అది చవిచూసింది. కానీ, అందాల కాశ్మీర్‌ను కాపాడుకోవాలన్న నిబద్ధత మన ప్రభుత్వాలకు లేకపోయింది.
సంక్షోభకాలంలో ప్రధానమంత్రి మోదీ స్పందించిన తీరు మెచ్చుకోదగినది. అన్ని వ్యవస్థలూ నీటమునిగి ముఖ్యమంత్రి సహా అందరూ అచేతనంగా ఉన్నప్పుడు మోదీ చెప్పినట్టుగా యావత్‌ భారతమూ కాశ్మీర్‌కు వెన్నుదన్నుగా ఉండటం సంతోషించవలసిన విషయం. మోదీ స్పందించిన తీరుకూ అక్కడ జరగబోతున్న ఎన్నికలకూ ఈ సంక్షోభ కాలంలో సంబంధం పెట్టడం సముచితం కాదు. ఈ సందర్భంలో ఇంతటి అమోఘంగా స్పందించిన కేంద్రం పునర్నిర్మాణంలో కూడా సహాయకారిగా ఉండటం అవసరం. అంతకుమించి, కళ్ళముందు కనిపించిన ఈ ఘోరం కొన్ని పాఠాలు కూడా నేర్పాలి. ప్రకృతిని తనంతట తానుగా సరిదిద్దుకొనే విధంగా భగవంతుడు రూపకల్పన చేశాడన్న విశ్వాసం మోదీకి ఉండవచ్చునేమో కానీ, మానవ విధ్వంసం ఆ సరిదిద్దుకొనే స్థాయిని దాటిపోతోందని గుర్తించాలి. చేస్తున్న పాపాలు, పర్యావరణవేత్తల హెచ్చరికలు ఇప్పటికైనా చెవినెక్కించుకోకపోతే వనరులను నాశనం చేసి మనం నిర్మించుకుంటున్న సౌధాలు ఇలా ప్రకృతి శాపానికి కుప్పకూలుతూనే ఉంటాయి.