Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:41AM

‘కళా’వాసం



ఇంట్లో ఫర్నిచర్‌ తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎక్కువ ఉపయోగపడాలి అనుకుంటారు ఎక్కువమంది. బుజ్జిబుజ్జి ఫర్నిచర్‌తో ఇల్లు పొదరిల్లులా కనిపించాలంటే ఈ ఫోటోల్లో కనిపిస్తున్నలాంటి ఫర్నిచర్‌ అయితే బాగుంటుంది. మార్కెట్లో లభిస్తే రెడీమేడ్‌వి కొనొచ్చు లేదంటే తయారు చేయించుకోవచ్చు.
ఠి హాల్లో గోడకి చక్రంలా అమర్చిన టీవీ యూనిట్‌ చూస్తుంటే ముచ్చటగా ఉంది అనిపించకపోదు. ఈ డిజైన్‌లో ఉన్న సౌలభ్యం ఏమిటంటే టీవీ కింద భాగంలో స్టీరియో అమర్చుకునేందుకు వీలు ఉండడం. టీవీ యూనిట్‌లలో సాధారణంగా ఉండేదే కదా అంటున్నారా. దీని ప్రత్యేకత ఏమిటంటే చూసేందుకు స్టయిల్‌గా బయటికి కనిపించకుండా ఉండడం. ఇరువైపులా రెండు స్పీకర్లతో ఉన్న ఈ డిజైన్‌ స్టయిల్‌గా, క్రియేటివ్‌గా ఉంది కదూ.
ఠి ఈ డిజైన్‌ చూడగానే మీకేమనిపిస్తుంది. ఆఫీసు రిసెప్షన్‌ అనిపిస్తుంది. కాని ఇది వంటగది అంటే నమ్ముతారా. నమ్మడంలేదా కాస్త జాగ్రత్తగా గమనించండి. స్టవ్‌, ప్లేట్లు వంటి వంటసామాగ్రి కనిపిస్తుంది. రుచికరమైన వంటల్ని వండి వడ్డించే అందమైన కిచెన్‌ అన్నమాట. చూస్తుంటే బోల్డెన్ని డిష్‌లు వండుకు తినేయాలనిపించడం ఖాయం.
ఠి గడియారాన్ని గోడకు అమర్చి పక్కగా చెక్క స్టాండ్‌ పెట్టారన్నట్టు ఉంటుంది ఈ ఫోటో చూస్తే. కాని గోడకి బదులుగా చెక్క స్టాండ్‌కే గడియారాన్ని అమర్చారు. అంటే చెక్క కొమ్మకు పూసిన గడియారపు పువ్వన్నమాట. లవ్లీ ఐడియా.
ఠి గుండ్రంగా దొర్లుకుంటూ పోతుందా అన్నట్టు కనిపిస్తున్న ఇది బెడ్‌. రొటీన్‌గా కనిపించే నలుచదరపు బెడ్‌తో పోలిస్తే ఇది వెరైటీగా ఉంటుంది. చూసేందుకే కాదు నిద్రపోయేందుకూ సౌకర్యవంతంగా ఉంటుంది అంటున్నారు డిజైనర్లు.
ఠి సినిమా రీల్‌లా కనిపిస్తుంది కాని ఇది పుస్తకాలు పెట్టుకునే ర్యాక్‌. ఈ ర్యాక్‌ను లివింగ్‌రూమ్‌లో పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నచ్చిన పుస్తకాన్ని వెంటనే తీసుకుని చదివేయాలనిపిస్తుంది కూడా. మొత్తంమీద అందమైన ఆలోచన .