Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:41AM

ఇల్లంతా కనుసన్నల్లోనే...ఇంటిని సమీపిస్తుండగానే గీజర్‌ అన్‌ అవుతుంది. గదిలో ఏసీ పనిచేయడం ప్రారంభిస్తుంది. కారు దిగి ఇంట్లోకి అడుగుపెడుతుండగానే లైట్లన్నీ వెలుగుతాయి. జేమ్స్‌బాండ్‌ సినిమాలో మాదిరిగా మీరు ఇంట్లో ఉండగానే గేట్‌ లాక్‌ అయిపోతుంది. సినిమాల్లో కనిపించే ఈ అద్భుతం నిజజీవితంలోనూ సాధ్యమవుతోంది. హోమ్‌ అటోమేషన్‌ చేస్తున్న అద్భుతాలను మీరూ చదవండి.


ఇంట్లో ఫ్యాన్‌ ఆఫ్‌ చేయడం మరచిపోయారు. గీజర్‌ ఆఫ్‌ చేశారో లేదో గుర్తులేదు. లైట్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ అవి వెలుగుతూనే ఉంటాయి. పెరిగిన పని ఒత్తిడి, బిజీ జీవనం, సమయానికి ఆఫీసుకు చేరుకోవాలని తొందరలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మరచిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆ ఇబ్బందులన్నీ దూరమయ్యాయి. ఒక్క టచ్‌తో ఇంట్లో ఆన్‌లో ఉన్న పరికరాలన్నింటిని ఆఫ్‌ చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. హోమ్‌ అటోమేషన్‌ చేయించుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతోంది.
సమస్తం నియంత్రణలో..
స్మార్ట్‌ఫోన్‌ లేదా ఐ ప్యాడ్‌లోని టచ్‌ స్ర్కీన్‌పై ఓ బటన్‌తో ఇంట్లోని విద్యుత్తు పరికరాలను నియంత్రించవచ్చు. ఇంట్లోని ఎయిర్‌కండీషనర్‌ను ఆన్‌ చేయాలన్నా, ఆఫ్‌ చేయాలన్నా ఆటోమేటిక్‌గా చేయవచ్చు. బాత్‌రూమ్‌లో వెంటిలేషన్‌ను సైతం ఆన్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు. ఆఫీసు నుంచి లేదా సినిమాకు వెళ్లి ఆలస్యంగా అర్దరాత్రి ఇంటికి వెళితే కారులో నుంచి కాలు కింద పెట్టకముందే ఇంట్లోని లైట్లను ఆన్‌ చేసుకోవచ్చు. ఏ గదిలోకి వెళితే ఆ గదిలో లైట్లు వెలిగేలా ఈ హోమ్‌ ఆటోమేషన్‌ ద్వారా ఏర్పాట్లు చేసుకోవచ్చు. గదిలో పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే వారి గది వోల్టేజీ ఫ్రీ ఉండేలా రీమోట్‌ కంట్రోల్‌తో నియంత్రించుకోవచ్చు.
కర్టెన్లు కంట్రోల్‌లోనే...
కర్టెన్‌ వేయాలన్నా, తీయాలన్నా సోఫాలో నుంచి లేవనక్కర్లేదు. మొబైల్‌లో నుంచే కర్టెన్లు వేయవచ్చు. అవసరమైనపుడు తీయవచ్చు. గది వెలుతురుకు అనుగుణంగా కర్టెన్లను అడ్జస్ట్‌ చేసుకోవచ్చు.
పూర్తి భద్రత
హోమ్‌ అటోమేషన్‌ ఉన్న ఇంట్లోకి అపరిచితుడు ప్రవేశించడం అసాధ్యమే. ఎలకా్ట్రనిక్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇంట్లోకి ఎవరైనా రావాలంటే వారి వేలిముద్రలు స్కానర్‌లో ఎంటర్‌ చేయల్సి ఉంటుంది. ఫేస్‌ రికగ్నిషన్‌, కీ ప్యాడ్‌ యాక్సెస్‌ ద్వారా కూడా ఇంట్లోకి వచ్చే వారిని గమనించవచ్చు. ఇంటి నుంచి ఆఫీసుకు లేదా బయటకు వెళ్లాక, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా పీసీ ద్వారా ఇంట్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారో రీమోట్‌ సర్వ్‌లెన్స్‌ ద్వారా 24 గంటలపాటు నియంత్రించవచ్చు. అవుట్‌డోర్‌ ఏరియాలో సెన్సార్‌ల సాయంతో మీ ఇంట్లోకి ఎవరైనా దొంగలు వస్తే సైరన్‌ మోగటంతోపాటు ఫ్లాష్‌లైటు వెలిగి మీ మొబైల్‌కు మెసేజ్‌ వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల దొంగతనాలను అరికట్టవచ్చు. ఇంటికి సోలార్‌ ఫెన్సింగ్‌ సౌకర్యం లేకున్నా, ఎవరైనా గోడ దూకితే ఐఆర్‌ టెక్నాలజీ సిస్టమ్‌ సాయంతో ఆటోమేటిక్‌గా అలారం మోగేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఫైర్‌ ప్రొటెక్షన్‌
ఒకవేళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినా, పొగ అలముకున్నా, గ్యాస్‌ లీక్‌ అయినా సెన్సర్స్‌ ట్రిప్‌ అయి అలారం మోగుతుంది. దీంతోపాటు హోమ్‌ ఆటోమేషన్‌ సిస్టమ్‌లో ముందుగా ప్రోగ్రామ్‌ చేసిన ఫోన్‌ నెంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు వెళతాయి.. వంట గదిలో గ్యాస్‌ లీకైందని గుర్తించిన వెంటనే వంటగదిలోని కిటికీ తలుపులు తెరచుకునేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆడియో, వీడియో కంట్రోల్‌
ఇంట్లో ఉన్న ఆడియో, వీడియో కంట్రోల్‌ను సింగిల్‌ టచ్‌ ప్యానల్‌తో కంట్రోల్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంట్లోని లైట్లు, కర్టెన్‌లను మూడ్‌ను బట్టి సాఫ్ట్‌గా, డిమ్‌ లైటింగ్‌తో అడ్డస్ట్‌ చేసుకోవచ్చు. ఇంట్లోని ఏ గదిలో ఏ సంగీతం వినాలో దాన్ని ఐపాడ్‌ ద్వారా నియంత్రించవచ్చు.


ఇంటి నియంత్రణ అంతా మీ చేతుల్లోనే...
కారులో ఇంట్లోకి వెళుతున్నపుడు వాచ్‌మెన్‌ వచ్చి గేటు తలుపు తీయాల్సిన పని లేదు. హోమ్‌ ఆటోమేషన్‌ ఉంటే గ్యారేజ్‌ గేటు ఒన్‌ టచ్‌తో ఆటోమేటిక్‌గా తెరచుకుంటుంది. అలాగేు ఇంటికి ఎవరైనా అతిధి వస్తే మీరు తలుపు వద్దకు వెళ్లకుండానే ఒన్‌ టచ్‌తో గేటు తెరవవచ్చు. గార్డెన్‌లో లైట్లు వేయాలన్నా, స్విమ్మింగ్‌పూల్‌ లైట్లు ఆర్పాలన్నా అరచేతిలో ఉన్న ఐపాడ్‌ను టచ్‌ చేస్తే చాలు.

మన దగ్గర కూడా..
ఇంజనీరింగ్‌ విద్యార్థి రఘు అలేక్‌కు విదేశాల్లో ఉన్న రీమోట్‌, ఆటోమేటిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఎంతో నచ్చింది. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశంలోనూ అందుబాటులోకి తీసుకురావాలనుకున్నాడు. తన తోటి స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ కేంద్రంగా ఉబేర్‌ లైట్‌ కంట్రోల్‌ సౌండ్‌ పేరిట ఓ కంపెనీని ఆరంభించారు. విదేశాల్లో తయారైన వివిధ ఎలకా్ట్రనిక్‌ ఆటోమేషన్‌ పరికరాలను తెప్పించి, వాటితో హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నయ్‌, కొచ్చిన్‌లలో 400కు పైగా ఇళ్లలో అత్యంత అధునాతనమైన హోమ్‌ ఆటోమేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేశారు.