Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 00:14AM

చైనా, అమెరికాలతో విస్తృత వాణిజ్య బంధం


 నెలాఖరులో ఒబామాతో మోదీ భేటీ
 17 నుంచి చైనా అధ్యక్షుని భారత పర్యటన

న్యూఢిల్లీ: చైనా ప్రెసిడెంట్‌ జీ జిన్‌పింగ్‌ భారత పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త రూపు సంతరించుకుంటాయని నిర్మలా సీతారామన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పర్యటనల వల్ల వాణిజ్యపరమైన సంబంధాలు, పెట్టుబడులు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు. చైనా మన దేశంలో ప్రారంభించ తలపెట్టిన ఇండసి్ట్రయల్‌ పార్కుల అధికారిక ప్రకటన కూడా ఈ పర్యటనలో వెలువడే అవకాశం ఉందని సీతారామన్‌ చెప్పారు. గుజరాత్‌, మహారాష్ట్రల్లో చైనా 500 కోట్ల డాలర్ల పెట్టుబడులతో రెండు ఇండసి్ట్రయల్‌ పార్కులు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి చైనా ప్రెసిడెంట్‌ భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఈ నెలాఖరున ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారని, ఈ సందర్భంగా వీసా నిబంధనలు, నిపుణుల వలస, దేశీ ఫార్మా కంపెనీలకు మార్కెట్‌ అవకాశాలు, టోటలైజేషన్‌ ఒప్పందం గురించి ప్రముఖంగా చర్చిస్తారని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఎన్డీఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టి 100 రోజులు ముగిసిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 29-30 తేదీల్లో అమెరికా ప్రెసిడెంట్‌ ఒబామాతో మోదీ సమావేశమవుతారని సీతారామన్‌ చెప్పారు. అమెరికాతో టోటలైజేషన్‌ ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని సత్వరం ఓ కొలిక్కి తెచ్చేందుకు దేశం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. టోటలైజేషన్‌ ఒప్పందం కింద ఇరు దేశాల్లో నివాసం ఉంటున్న వలస వ్యక్తులు తమకు ఆతిథ్యం ఇస్తున్న దేశాల సామాజిక రక్షణ పథకాల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉండదు. కఠినంగా ఉన్న వీసా నిబంధనలు, యుఎస్‌ ఇమిగ్రేషన్‌ బిల్లుకు సంబంధించిన ఆందోళనలు ఈ పర్యటన సందర్భంగా చర్చకు రానున్నాయని సీతారామన్‌ తెలిపారు. అలాగే వాణిజ్యం, పెట్టుబడులు, తదితర అంశాల గురించి చర్చిస్తామని చెప్పారు.
త్వరలో విదేశీ వాణిజ్య విధానం
రాబోయే ఐదేళ్ల కాలానికి సంబంధించి విదేశీ వాణిజ్య విధానాన్ని(ఎఫ్‌టిపి) త్వరలో ప్రకటిస్తామని సీతారామన్‌ తెలిపారు. మునుపటి పాలసీల కంటే ఇది చాలా ‘భిన్నం’గా ఉంటుందని చెప్పారు. రాబోయే ఐదేళ్ల కాలానికి(2014-19) తాము సిద్ధం చేస్తున్న ఎఫ్‌టిపిలో ఉత్పాదక రంగం, ఎగుమతుల వృద్ధికి పెద్ద పీట వే శామని వెల్లడించారు. సేవారంగం ఎగుమతులు, ప్రమాణాలు, ఉత్పత్తుల బ్రాండింగ్‌ తదితర అంశాలపై కొత్త పాలసీలో ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
ఇయుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం
యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టిఎ) ఖరారు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీతారామన్‌ తెలిపారు. కానీ, దేశం ప్రస్తావించిన సమస్యలకు యూరోపియన్‌ యూనియన్‌ పరిష్కారాలు అన్వేషించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇయు దృష్టంతా ట్రాన్స్‌అట్లాంటిక్‌ ట్రేడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌పై (టిటిఐపి) ఉందని అన్నారు. ఇయు అంబాసిడర్‌ ఇటీవల తనతో సమావేశమయ్యారని, ఈ సందర్భంగా వాణిజ్య ఒప్పందం చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఎఫ్‌టిఎ చర్చలు తుది దశకు చేరుకున్నాయని వాణిజ్య కార్యదర్శి రాజీవ్‌ ఖేర్‌ తెలిపారు.
బంగారం దిగుమతులపై సుంకం యథాతథం
బంగారం దిగుమతులపై ప్రస్తుతం అమలవుతున్న సుంకాన్ని తక్షణమే తగ్గించే యోచన లేదని సీతారామన్‌ స్పష్టం చేశారు. కరెంట్‌ ఖాతా లోటు(క్యాడ్‌) నియంత్రించేందుకు గత ఏడాది ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దిగుమతుల సుంకం పెంపు వల్లే బంగారం అక్రమ రవాణా పెరుగుతున్నట్లు కచ్చితంగా చెప్పలేమని సీతారామన్‌ అన్నారు. క్యాడ్‌ తగ్గింది కానీ, దిగుమతుల సుంకాన్ని తగ్గించే యోచనైతే ప్రస్తుతానికి లేదని తెలిపారు. ప్రస్తుతం గత కొద్ది వారాల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ధరలు తగ్గితే డిమాండ్‌ పెరిగి, దిగుమతులు అధికమవుతాయి. ఈ సమయంలో ప్రభుత్వం సుంకం తగ్గిస్తే, దిగుమతులు అనేక రెట్లు పెరుగుతాయి. దీంతో క్యాడ్‌ మళ్లీ హెచ్చుస్థాయిలకి పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఇప్పుడప్పుడే దిగుమతుల సుంకం, దిగుమతులపై ఉన్న ఇతర ఆంక్షలను సడలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు