Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 14:41PM

జమ్మూ కశ్మీర్‌లో వరద సహాయక చర్యలు ముమ్మరం

జమ్మూ కశ్మీర్‌, సెప్టెంబర్‌ 10 : జమ్మూ కశ్మీర్‌లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 50 వేల మందిని రక్షించారు. మరో 6 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
 
వరద బారిన పడి కల్లోలంగా మారిన కశ్మీరంలో సహాయక చర్యలు ముమ్మరమాయ్యయి. త్రివిధ దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 61 హెలికాఫ్టర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. 250 బోట్లను వినియోగిస్తున్నారు.

ఉత్తరాఖండ్ తర్వాత అంతటి ప్రకృతి విలయం చవిచూసిన జమ్మూకశ్మీర్ లో సహాయ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో జనాన్ని తరలించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. అయితే కశ్మీర్ ప్రభుత్వ ఉదాసీన  వైఖరిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీఐపీలకు ఇచ్చిన ప్రాధాన్యం మామూలు జనానికి ఇవ్వడం లేదంటూ ఆగ్రహం చెందుతున్నారు.

జమ్మూకశ్మీర్ చరిత్రలో కనీ వినీ ఎరుగని విలయం ఇది. లక్షల మంది నిరాశ్రయులైన ప్రకృతి విలయం నుంచి జనాన్ని కాపాడేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తున్నాయి. రాజధాని  శ్రీనగర్లో ఇంకా వరద నీరు నిలిచి ఉంచడంతో సహా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఎటు చూసిన జలమే కనిపిస్తూ.. జనం నిలబడేందుకు చోటు దొరకడం లేదు. వారం క్రితం వచ్చిన పర్యాటకులు కూడా స్వంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితిలో  ఆకలితో అలమటిస్తున్నారు. వారిని తొలుత తాత్కాలిక హెలిప్యాడ్ దగ్గరకు తీసుకొచ్చి తర్వాత విమానాశ్రయానికి తీసుకెళ్ళే ఏర్పాటు జరుగుతున్నాయి.


ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ సీఎం
"ఆరు నుంచి ఎనిమిది గంటల ముందే హెచ్చరించాం. పోలీసు వాహనాల ద్వారా.. మసీదులోనూ ప్రకటన చేశాం. అదృష్టవశాత్తు కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. దురదృష్టవశాత్తు చాలా మంది అక్కడే ఉండిపోయారు. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే పని జరుగుతోంది. పడవలు, హెలికాప్టర్ల సాయంతో జనాన్ని కాపాడే పని జరుగుతోంది. జనాన్ని తరలించలేని ప్రదేశాల్లో ఆహార పదార్థాలు జారవిడుస్తున్నాం. తాత్కాలిక శిబిరాల ఏర్పాటుకు టెంట్లు వచ్చాయి" అని ఒమర్‌ తెలిపారు.