Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:29AM

విశ్వమానవుడు, విశ్వకవి.. కాళోజీ


ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వ పాలన
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు
కాళోజీ కళాకేంద్రానికి శంకుస్థాపన
ఘనంగా శత జయంతి ముగింపు వేడుకలు
హన్మకొండ, ఆంధ్రజ్యోతి : ప్రజాకవి కాళోజీ విశ్వమానవుడు..ఆయన కవిత్వం విశ్వజనీనం.. అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు.కాళోజీవ్యక్తిత్వాన్ని, అన్యాయాలు, ఆక్రమాలపై ఆయన ధర్మాగ్రహాన్ని శ్లాఘించారు.కాళోజీ శతజయంతి ఉత్సవాలముగింపును పురస్కరించుకొని హన్మకొండ బాలసముద్రంలో రూ.12కో ట్ల వ్యయంతో నిర్మించనున్న కాళోజీ కళాక్షేత్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నక్కలగుట్ట జంక్షన్‌లోని కాళోజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం కాజీపేటలోని నిట్‌ కళాశాల ఆడిటోరియంలో ఏర్పా టు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాళోజీ కవిత్వాన్ని ఎంత పాడుకున్నా, ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. ‘ఆయన ఏదో ఒక ప్రాంతానికి చెంది న వ్యక్తి కాదు. ఆయన గొడవ ప్రజల గొడవ. ఆయన బాధ,వేదన, ఆలోచనలు సార్వజనీనం. అందుకే కాళోజీ విశ్వమానవుడు. విశ్వకవి’ అని శ్లాఘించారు. కాళోజీది ఎవరికి తలవంచని వ్యక్తిత్వం. రాజీపడనితత్వం అని ప్రశంసించారు. కాళోజీ వంటి విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారని, అందులో ఒకరు తెలంగాణ రాష్ట్రసాధన కోసం నిరంతరం తపించిన ఆచార్య జయశంకర్‌ అని గుర్తు చేశారు. ఆచార్య జయశంకర్‌కు లక్ష్యశుద్ధి, మొండితనం కాళోజీ సాహచర్యం వల్ల వచ్చినేనన్నారు. శిఖరాయమానమైన కాళోజీ తన నిప్పుకణాలాంటి కవిత్వంతో సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత కాళోజీ ఇంటికి వెళ్ళిన తనను కాళోజీ ‘మంచిగనే మొదలు పెట్టినవు బిడ్డ.. కొసెల్లదాక కొట్లాడు’ అంటూ ఆశ్వీరదించారని కేసీఆర్‌ గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయన స్ఫూ ర్తితోనే ఉద్యమం ఉధృతంగా ముందుకు సాగి, తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందన్నారు. ఈ తరుణంలో కాళోజీ, ఆచార్య జయశంకర్‌ బతికుంటే వారు ఎంత సంతోషించేవారో అన్నారు.
చంద్రునికోనూలు పోగు
కాళోజీ స్మృత్యర్థం ఆయన పేర కళాక్షేత్రం నిర్మాణం చేపట్టడం చంద్రునికో నూలుపోగువంటిదన్నారు. మూడున్నర ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్న ఈ క్షేత్రం ఆయనకు నివాళిగా ప్రభుత్వం అందించే ఓ గొప్ప కట్టడంగా ఉండ బోతుందన్నారు. అర్కిటెక్ట్‌ కాకపోయినా ఈ కళా క్షేత్రానికి తానే స్వయంగా డిజైన్‌ చేయనున్నట్టు తెలిపారు. కళాక్షేత్రంలో కాళోజీ నిలువెత్తు విగ్రహంతో పాటు 1500 మంది కూర్చునేందుకు వీలుగా పెద్ద హాలు ఉంటుందన్నారు. ఇందులోనే కాళోజీ రచనలపై ఆధ్యయన కేంద్రాన్ని, ఆయన స్మృతి చిహ్నాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని తలదన్నేరీతిలో నిర్మాణం అయ్యే ఈ క్షేత్రానికి రూ.12 కోట్లను మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.ఈ కళాప్రాంగణంలోనే అర ఎకరాన్ని కాళోజీ ఫౌండేషన్‌ పేర రిజిసే్ట్రషన్‌ చేయించడమేకాకుండా, ఇందులో రూ.60లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. తెలంగాణలోని ఏదైనా ఒక విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెడతామని ప్రకటించారు. ఆరు నెలల్లో కాళోజీ కళా క్షేత్ర భవన నిర్మా ణం పూర్తవుతుందని ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కాళోజీ పేర ఒక తపాలా బిల్ల జారీకి కృషి చేస్తానని కూడా కేసీఆర్‌ వాగ్దానం చేశారు.
కాళోజీ కుటుంబానికి సాయం
కాళోజీ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నం దువల్ల రూ. 10లక్షలను డిపాజిట్‌ చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై వచ్చే వడ్డీని కాళోజీ పౌండేషన్‌ ద్వారా నెలనెలా ఆ మహానీయుడి కుటుంబానికి అందేలా ఏర్పాటు చేస్తానని తెలిపారు.ఈ మేరకు చర్యలు తీసుకోవలసిందిగా వేదిక మీద ఉన్న కలెక్టర్‌ జి. కిషన్‌ను అక్కడికక్కడే ఆదేశించారు.
ఇతర భాషల్లోకి..
మానవీయ విలువలతో, సామాన్య ప్రజల వేదనలతో కూడిన కాళోజీ సార్వజనీన కవితలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి వాటిని ఇతర బాషల్లో అనువదించేందుకు చర్య లు తీసుకుంటానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. నిష్కర్ష, నిర్మొహమాటం, ఉన్నదున్నట్టు చెప్పే ఆయన రచనలు సమాజంపై చక్కని ప్రభావాన్ని చూపాయనీ, అందుకే వాటిని అందరికి అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి
తెలంగాణ భాష, యాస, సంస్కృతి గురించి నిరంతరం తపించిన కాళోజీపేర ఏటా ఆయన జయంతి రోజు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపనున్నట్టు కూడా చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు జీవో జారీ చేయవలసిందిగా అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
చెప్పింది చేస్తాం..
నిక్కచ్చికి, నిజాయితీకి నిలువుటద్దం అయిన కాళోజీ చెప్పిందే చేసేవారు, తాను నమ్మింది ఆచరించేవారు. తమ ప్రభుత్వం ఆయన మార్గంలో, ఆదే స్ఫూర్తితో పని చేస్తుందని సీఎం అన్నారు. గత పాలకుల్లాగా అబద్దాలు ఆడం, ఆర్భాటాలకు పోం. చేతనయిందే చెప్తాం. చేప్పింది చేస్తాం అన్నారు. మూడేళ్ళలో కరెంట్‌ బాధలు తప్పుతాయి. అప్పుడు 24 గంటల పాటు కరెంట్‌ ఇస్తామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు పరిశుభ్రమైన మంచీనీరు అందిస్తామని, ప్రతీ ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్‌ ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. భూమి లేని నిరుపేద దళితులకు భూమి కేటాయించడం మొదలైందనీ, ఈ దసరా నాటికి అన్ని పథకాలను ప్రారంభిస్తామన్నారు. దళితవాడల్లో దారిద్ర్యాన్ని పారద్రోలడం, ముస్లిం మైనారిటీలను అభి వృద్ధిచేయడం తమ లక్ష్యం అని సీఎం చెప్పారు.