Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:28AM

వయసును తగ్గించే రిమోట్‌!



టీవీలో ఏ చానెల్‌ కావాలంటే ఆ చానెల్‌ను మార్చుకునేందుకు రిమోట్‌ను వాడతాం! ఏసీని ఆన్‌ ఆఫ్‌ చేసేందుకు వాడతాం! బొమ్మకార్లను అటూ ఇటూ ఉరుకులు పెట్టించేందుకు వాడతాం! కానీ అదే రిమోట్‌తో మన వయసును తగ్గించుకోవచ్చట! అమెరికాలోని కాలిఫోర్నియా, లాస్‌ఏంజిలిస్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్న మాట ఇది.! శరీరంలో ఓ జన్యువును రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా యాక్టివేట్‌ చేసి వయసు మళ్లడాన్ని నిదానం చేయొచ్చని చెబుతున్నారు. ఫ్రూట్‌ ఫ్లై అనే ఒక జాతి ఈగల్లో ఉండే ఏఎంపీకే అనే జన్యువును ఉత్తేజపరిస్తే వాటి జీవన కాలం 30 శాతం పెరిగిందని, అవి ఆరోగ్యంగా ఉన్నాయని యూసీఎల్‌ఏ ప్రొఫెసర్‌ డేవిడ్‌ వాకర్‌ తెలిపారు. తద్వారా ఏదోఒక రోజు మానవ జీవన కాలాన్ని పెంచొచ్చని ధీమాగా చెబుతున్నారాయన. లక్షిత అవయవాలు, అవయవ వ్యవస్థలోని జన్యువులను నిరోధించగలిగితే వ్యాధులను నివారించొచ్చని చెప్పారు. నరాల వ్యవస్థ కణాల్లోని ఏఎంపీకేను పెంచడం ద్వారా వయసును తగ్గించగలిగామన్నారు. అయితే ఇక్కడ ఏఎంపీకేను ఉత్తేజపరచడానికి వాడే రిమోట్‌ కంట్రోల్‌ ఏదో తెలుసా..? మధుమేహానికి వాడే ఓ ఔషధమే!