desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:17AM

షరతులు లేకుండా రుణ మాఫీ చేయాలి

-రైతు సంఘాల నాయకుల డిమాండ్‌
నంద్యాల: టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతుల రుణ మాఫీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని వివిధ రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏపీ రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి, ఏపీ రైతు సంఘం డివిజన్‌ కార్యదర్శి పుల్లా నరసింహులు, భారతీయ కిసాన్‌సంఘ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ మహేశ్వరరెడ్డి, నంది రైతు సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, వరి ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్‌ వైఎన్‌రెడ్డి, టీడీపీ రైతు విభాగం నాయకుడు జిల్లెల్ల శ్రీరాములు, వైసీపీ రైతు విభాగం నాయకుడు బంగార్‌రెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన కమిటి కోకన్వీనర్‌ రామచంద్రారెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా మాజీ అధ్యక్షుడు తూముశివారెడ్డి, కుందూ ప్రాంత పరిరక్షణ సమితి కన్వీనర్‌ రామచంద్రారెడ్డి కలిసి ఆర్డీవో సుధాకర్‌రెడ్డికి డిమాండ్ల వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ 2014 మార్చి చివరి వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీకి వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యానవన పంటలకు మాఫీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక కుటుంబంలో రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీని వర్తింపజేయాలన్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పడాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. దేవాలయాల భూములు, బంజరు భూములకు కూడా రుణ మాఫీ వర్తింపజేయాలన్నారు. గొర్రెలు, బర్రెలు, రైతు అనుబంధ శాఖల ద్వారా తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని, జీవో నంబర్‌ 174లో 16 సీ లో బంగారు రుణాలను పంటరుణాలుగా మార్చాలని, కటాఫ్‌ డేట్లు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ఆర్డీవో మాట్లాడుతూ డిమాండ్ల వినతిపత్రాన్ని జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.