Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:17AM

కేసీఆర్‌ది కక్ష సాధింపు పాలన
- 100 రోజుల్లో 87 రోజులు..
చానెళ్ల ప్రసారాలు నిలిపివేశారు
- ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చారు
- వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే..
పత్రికలు, ప్రతిపక్షాలపై ఎదురుదాడి
- మహిళా జర్నలిస్టులపై దాడిని ఖండిస్తున్నాం
- ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లిస్తుంది
- బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్‌
- కేసీఆర్‌వి నియంత వ్యాఖ్యలు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో కాళోజీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలు నియంతలు మాట్లాడినట్లుగా ఉన్నాయని విమర్శించారు. మీడియా రెచ్చిపోతే తలలు తీసేస్తా, 10 కిలో మీటర్ల లోపల పాతరేస్తా అనే మాటలు రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడాల్సినవి కావన్నారు. మీడియా మెడలు తెంచుతా, అవతల పడేస్తాలాంటి బెదిరింపులు చూస్తుంటే రాచరిక వ్యవస్థలో ఉన్నామా? లేక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ గడ్డ మీద ఉండాలంటే తమకు సెల్యూట్‌ చేయాలనడం ఏ నాగరికత? అని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. కాగా కేసీఆర్‌ పాలనం తా కక్ష సాధింపులతోనే గడిచిపోతోందని బీజేపీ శాసన సభాపక్ష నేత కె.లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. వందరోజుల పాలనలో 87 రోజుల పాటు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల ప్రసారాలను నిలిపివేసి ప్రజాస్యామ్యానికి చేటు తెచ్చేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ వంద రోజులపాలనలో మాటలు కోటలు దాటాయే తప్ప చేతలు గడప దాటలేదని ఆరోపించారు. కేసీఆర్‌కు పార్టీపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వంపై లేదన్నారు. ఆయన ఇంకా ఉద్యమ పార్టీకి అధ్యక్షుడిగానే భావిస్తున్నారు తప్ప పాలనాదక్షుడిగా ఆలోచన చేయడం లేదని విమర్శించారు. అభద్రతాభావంతో ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు, పత్రికలపై ఎదురుదాడి చేస్తున్నారని, నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను అణచివేసేలా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగితే ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారో అందరికీ తెలుసన్నారు. ఎమ్మెస్వోలు కుట్రలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. మంగళవారం మహిళా జర్నలిస్టులు వినతిపత్రం ఇద్దామని సీఎం ఇంటికి వెళితే అరెస్టు చేస్తారా ? కనీస విచక్షణ లేకుండా వ్యవహరిస్తారా ? బీజేపీ దీనిని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. జర్నలిస్టులకు బీజేపీ అండగా ఉంటుందని, ప్రజాస్వామ్యయుతంగా చేసే ఏ ఉద్యమానికైనా బీజేపీ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
పంచ్‌ డైలాగులతో పాలన సాగదు
విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు... ఇలా సకల జనులు కలిసి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ సెంటిమెంటుపైనే ఐదేళ్లు కాలం గడపాలనుకుంటున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. పంచ్‌ డైలాగ్‌లతో పాలన సాగదన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి తప్ప విభేదాలు, వివాదాలతో బంగారు తెలంగాణ నిర్మాణం కాదన్నారు. ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంఐఎం అజెడాను అమలు చేస్తుంది తప్ప ప్రజల అజెండాను అమలు చేయడం లేదని ఆరోపించారు. పాలనంతా కేసీఆర్‌ చుట్టూ తిరుగుతోందని, మంత్రులకు ప్రాధాన్యం లేకుండాపోయిందని దుయ్యబట్టారు. కేసీఆర్‌ 100 రోజుల పాలనలో 2,500 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఒక పత్రిక బయటపెట్టిందంటే పాలన ఎలా ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు.