desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:17AM

బయోమెట్రిక్‌తో బోగస్‌కు చెక్‌

చాగలమర్రి: సంక్షేమ వసతి గృహాల్లో ప్రభుత్వం సంస్కరణలకు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటంతో పాటు హాస్టళ్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ప్రతి వసతి గృహంలో బయోమెట్రిక్‌ యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటి ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేసి ప్రతి రోజు ఆన్‌లైన్‌లో పొందుపరిచే బాధ్యతను వార్డెన్‌లకు అప్పగించింది. ఇందుకు సంబంధించి అవసరమైన ల్యాప్‌టాప్‌లు కూడా జిల్లా కేంద్రానికి తరలించారు. వాటిని వార్డెన్‌లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. వసతి గృహాల్లో అక్రమాలను అరికట్టి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ప్రధానంగా బోగస్‌ హాజరుకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టనుంది. ఇప్పటి వరకు హాజరు నమోదు చేస్తున్న విధానాన్ని మార్చి ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రతి హాస్టల్‌లో బయోమెట్రిక్‌ యంత్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల హాజరు నమోదుకు సిద్ధమైంది. దీనిని ఆన్‌లైన్‌లో పొందుపరిచే బాధ్యతను వార్డెన్‌లకు అప్పగించి వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల వివరాలను ఉన్నతాధికారులు తెలుసుకునే సౌలభ్యం కలగనుంది. ఆ ప్రకారం బోగస్‌లతో పాటు వార్డెన్‌ల అవినీతి చర్యలకు కూడా చెక్‌పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు వార్డెన్‌లు హాస్టళ్లలో ఉన్న వారికంటే ఎక్కువ మందిని చూపి నెలకు సంబంధించిన నిధులను నొక్కేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఇలాంటి అవినీతి చర్యలకు ముగింపు పెట్టనుంది. ఆన్‌లైన్‌లో కూడా బోగస్‌ హాజరు నమోదు చేయకుండా ఉండేందుకు ప్రతి వసతి గృహానికి బయోబెట్రిక్‌ యంత్రాన్ని అందజేస్తున్నారు. దీని ద్వారా ప్రతి రోజు వసతిగృహంలో ఉన్న విద్యార్థులు వేలి ముద్రలు తీసుకొని ల్యాప్‌టాప్‌ ద్వారా ప్రతిరోజూ ఉదయం అప్‌లోడ్‌ చేయనున్నారు. ఈ విధానం వల్ల వసతి గృహంలో లేని విద్యార్థులకు హాజరు వేసే అవకాశాన్ని వార్డెన్‌ల నుంచి దూరం చేయనున్నారు.
ప్రతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌
వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి ప్రతి సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, సంబంధిత ప్రిన్సిపాల్‌ కార్యదర్శి, కమిషనర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి హాస్టళ్లల్లో పరిస్థితులు, విద్యార్థుల సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విధానం అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. మొత్తం మీద సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని శాఖలు సక్రమంగా ఉపయోగించుకున్నట్లైతే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు.