Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:16AM

పేదల ఇంట్లో మళ్లీ ‘దీపం’


- ఈ ఏడాది 5 లక్షల కనెక్షన్లకు కసరత్తు..తొలిదశలో నియోజకవర్గానికి వెయ్యి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ హయాంలో కొండెక్కిన ‘దీపం’ పేదల ఇళ్లల్లో మళ్లీ వెలుగులు విరజిమ్మనుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలకు వంటింటి కష్టాలు తొలగిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలతో పాటు దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు దీపం పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పేదలకు నామమాత్రపు ధరకు గ్యాస్‌ కనెక్షన్‌ (సిలిండర్‌, స్టవ్‌) పంపిణీ చేయాలనే ఉద్దేశంతో 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించి అమలు చేశారు. అయితే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఈ పథకం మరుగున పడింది. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఈ పథకం కింద కేవలం 4.5లక్షల గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశారు. గ్రామాల్లో గ్యాస్‌ కనెక్షన్లు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటుగా కొనుగోలు చేయాలంటే ఒక్కో గ్యాస్‌ కనెక్షన్‌కు సుమారు అయిదువేల పైగా చెల్లించాల్సి వస్తోంది. తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే దీపం పథకాన్ని పునరుద్దరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఒక్కో ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఐదు వేల కనెక్షన్లు అడిగారని, అయితే మొదటి విడతగా ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కనెక్షన్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఈ ఏడాదిలోనే పేదలకు దాదాపు అయిదు లక్షలకు పైగా కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకూ దీపం పథకంలో రెగ్యులేటర్‌, సిలిండర్‌ మాత్రమే లబ్దిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. వీటితో పాటు పేదలకు గ్యాస్‌ స్టవ్‌ ఉచితంగా అందజేస్తే బాగుంటుందని మంత్రి సునీత సీఎంను కోరారు. రెగ్యులేటర్‌, సిలిండర్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్‌ ఏజెన్సీలకు దాదాపు రూ.1600 దాకా చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది దాదాపు 5 లక్షల కనెక్షన్లకు రూ.90 కోట్లు, గ్యాస్‌స్టవ్‌లకు రూ.50 కోట్లు వెరసి దాదాపు రూ.140 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనుంది. అయితే గ్యాస్‌స్టవ్‌ అంశంపై అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొని నవంబర్‌లో పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. దీపం పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి. ఆధార్‌ కార్డు లేనివారు ఈలోగా తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఎండీ రవిబాబు తెలిపారు.