Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:12AM

ఇందిర జల‘భ్రమ’


(ఆంధ్రజ్యోతి, నల్లగొండ)
ఎస్సీ, ఎస్టీ రైతులకు అండగా ఉంటాం... వారి బీళ్లల్లో సిరులు పండిస్తాం... అంటూ గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఘనంగా ప్రారంభించిన ‘ఇందిర జలప్రభ’ నిరుపేద రైతులకు భ్రమ గానే మిగిలింది. కోట్ల రూపాయల నిధులున్నా పూర్తి చేయాలన్న సంకల్పం, సమన్వయం అఽధికారుల్లో లేకపోవటంతో నిరుపేద రైతులు నెత్తీ నోరూ బాదుకోవాల్సిన పరిస్థితి. ఇదిగో... అదిగో అంటూ వివిధ శాఖల అధికారులు చుక్కలు చూపిస్తుండటంతో రైతులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. పథకం కాలం పూర్తవుతుండటంతో నిధులు వెనక్కు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
పథకం ఇలా...
నిరుపేద ఎస్సీ, ఎస్టీ రైతుల భూముల్లో బోర్లు వేసి నీటి సదుపాయం కల్పించి రైతులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో 2011-12లో ‘ఇందిర జలప్రభ’ పేరుతో ప్రభుత్వం వినూత్న పథకాన్ని ప్రకటించింది. అందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులను గుర్తించి ఇద్దరు, ముగ్గురిని ఒక గ్రూపుగా చేసి బోర్లు వేసి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 6,681 బ్లాకులు ఏర్పాటు చేశారు. వాటిలో ఒక్కో బోరుకు రూ.1.50 లక్షల వరకు వెచ్చించి 4,114 పాయింట్లలో బోర్లు వేయవచ్చని ధ్రువీకరించారు. గుర్తించిన పాయింట్లలో 4,015 పాయింట్లు బోర్ల తవ్వకానికి అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు. ఆ తర్వాత 3,650 ప్రాంతాల్లో బోర్లు వేసేందుకు అంచనాలు సిద్ధం చేశారు. చివరకు 2,999 ప్రాంతాల్లో బోర్లు వేశారు. కాగా 2,620 ప్రాంతాల్లో వేసిన బోర్లు సక్సెస్‌ అయినట్లు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. మరో 15 చోట్ల పాక్షికంగా ఫలితం సాధించామని చెప్పారు. 364 చోట్ల బోర్లు వేసినా లాభం లేకపోయిందని పేర్కొన్నారు. వేసిన బోర్లలో 2,944 యూనిట్లకు చెల్లింపులు పూర్తైనట్లు తెలిపారు. 1,921 బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు విద్యుత్‌ శాఖకు డ్వామా అధికారులు నిధులు చెల్లించారు. అయితే నేటి వరకు కేవలం 554 బోర్లకు మాత్రమే అధికారికంగా విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరైంది. నిధులు చెల్లించినా విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకపోవటంతో 1,167 ప్రాంతాల్లో రైతులు అనధికారికంగా పంప్‌సెట్లు బిగించుకున్నారు. అంటే గత మూడేళ్ల కాలంలో జిల్లాలో 4,114 బోర్‌ పాయింట్లను ప్రతిపాదించగా చివరకు 1167 యూనిట్లకు అధికారిక, అనధికారిక విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వగలిగారు. అంటే మూడేళ్లలో 28 శాతం మాత్రమే ప్రగతి సాధించారు. బోర్లు వేసి రెండేళ్లు పూర్తవుతున్నా పలు చోట్ల పంప్‌సెట్లు, విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయకపోవటంతో వేసినవి పూడి పోతున్నాయని నిరుపేద రైతులు మానసిక వేదనకు గురవుతున్నారు. బోర్‌వెల్‌ యజమానులకు లబ్ధిచేర్చేవిధంగా పథకం మిగిలిపోతుం దని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్లు వేసిన తర్వాత నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా సూక్ష్మ సేద్య పరికరాలు అందజేయాలని పథకం ప్రారంభంలో నిర్ణయించారు. ఈ పథకం కింద సామగ్రి కోసం 274 ఎకరాలకు సంబంధించిన రైతులు దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు కేవలం 13 ఎకరాలకు మాత్రమే సూక్ష్మ సేద్య సౌకర్యాన్ని కల్పించారు. 2011-12లో ప్రారంభమైన ఈ పథకం 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి ముగియనుంది. ప్రస్తుతానికి సాధించిన ప్రగతి తీరును అంచనా వేసుకుంటే వచ్చే మార్చి నాటికి కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్లే దుస్థితి జిల్లాలో ఏర్పడింది.
గోడు పట్టించుకోవడంలేదు సపావత్‌ హట్యానాయక్‌, నర్సాపురం
ఇందిరాజలప్రభ కింద నలుగురు రైతులకు కలిపి రెండు సంవత్సరాల క్రితం బోరు మంజూరైంది. బోరు మాత్రమే వేసి నేటి వరకు ట్రాన్స్‌ఫార్మర్‌, మోటార్‌ బిగించలేదు. సొంతంగా వేసుకునే ఆర్థిక స్థోమత లేదు. అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా స్పందించాలి.
విద్యుత్‌ సదుపాయం కల్పించాలి ధీరావత్‌ భీమానాయక్‌, కల్లేపల్లి
ఐజేపీ పథకం కింద బోరు వేసి సంవత్సరంన్నర కావస్తోంది. ఇప్పటికీ విద్యుత్‌ సదుపాయం కల్పించలేదు. బోర్‌లో నీరున్నా నిరుపయోగంగా ఉంది. భూమి బీడుగా ఉంది. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలి.