Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:11AM

మార్గశిరంలో ‘కల్యాణలక్ష్మి’!


- ప్రస్తుతం ముహుర్తాల్లేవు
- దసరా తర్వాత ప్రారంభించేందుకు
కసరత్తులు
- మంచిదని సూచించిన పండితులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో మార్గశిర మాసంలో ‘కల్యాణలక్ష్మి’ కాంతులు విరబూయనున్నాయి. ప్రస్తుతం మూఢం న డుస్తుండటంతో... మంచి రోజులు వచ్చేదాకా ప్రతిష్ఠాత్మకమైన ఈ పథకాన్ని ప్రవేశపెట్టరాదని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. దసరా పండుగ తర్వాత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వం, మంచిముహూర్తాల కోసం ఎదురుచూస్తోంది. ఎస్సీ, ఎస్టీలలోని 18 ఏళ్లు నిండి... దారిద్య్రరేఖకు దిగువన ఉండే కుటుంబాల్లో అమ్మాయిల వివాహానికి రూ.51 వేలను ఈ పథకం కింద అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ మార్గశిర మాసం కావడం, తొలి వారం నుంచి మంచి ముహూర్తాలు ఉండడం, జనవరి 22వ తేదీ నతతుంచి మాఘమాసం, మార్చిలో ఫాల్గుణం ప్రారంభం కానుండడంతో వివాహాలకు ఇవే దివ్యమైన ముహూర్తాలని... అప్పుడే పథకాన్ని ప్రారంభించి, అమలు చేస్తే మేలు జరుగుతుందని, ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుందని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు అక్టోబర్‌ మొదటివారంలో ముస్లిం కుటుంబాల్లో పెళ్లిళ్లున్నాయి. అయితే ఈ లోగా పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టారు.
సిద్ధమవుతున్న మార్గదర్శకాలు
ఎస్సీ, ఎస్టీలకు ‘కల్యాణలక్ష్మి’ని అమలు చేయడంతో పాటు ఇదే విధానంతో ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లకు సహాయం అందించే పథకం అమలుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకు ఈ పథకం కింద సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకే ఈ పథకం కింద ఎంపిక చేయనున్నారు. పెళ్లి కుదరగానే... లగ్నపత్రికను జత చే సి, అమ్మాయి బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌, ఆధార్‌ కార్డునెంబర్‌ను జతచేసి, దరఖాస్తు సమర్పించగానే పెళ్లికి వారం రోజుల ముందు ఆన్‌లైన్‌లో రూ.51 వేలను ఖాతాలో జమచేస్తారు. ఎస్సీ, ఎస్టీల ఆదాయ పరిమితిని రూ.2 లక్ష ల దాకా, ముస్లింలకు రూ.1.5 లక్షన్నర దాకా నిర్ణయిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచనలు వచ్చాయి. ఈ లోగా సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందగానే... పథకం మార్గదర్శకాలు జారీ కానున్నాయి. దరఖాస్తులు రాగానే.. తొలి దశలో సమగ్ర సామాజిక సర్వే వివరాలతో సరిచూసుకొని.. క్షేత్రస్థాయిలో మరోసారి ప్రాథమిక సర్వే చేశాకే లబ్ధిదారులకు సహాయం అందిస్తారు.