desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:10AM

భూబకాసురుల చెరలో చెరువులు


హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌ ప్రాంతంలోని చెరువులు భూబకాసురుల కబ్జాలతో కనుమరుగవుతు న్నాయి. ఒకనాడు జలకళతో కనువిందు చేసిన చెరువులు, కుంటలు ఇప్పు డు అక్రమార్కుల చెరలో మగ్గుతున్నాయి. నైజాం కాలంలో భూగర్భ జలాలు పెంపొందించడంతోపాటు తాగు, సాగునీటికి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఊరచెరువులు రాజకీయ రాబందులు, భూబకాసురుల చేతుల్లో కకావికలమవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి ఆరుదశాబ్దాలు దాటిన తరువాత ప్రభుత్వాలు మేలుకున్నాయి. ఇప్పుడు ఆక్రమణలపై సర్వేలు చేపట్టారు. దీంతో అసలు భూబాగోతం బట్టబయలైంది. రెవెన్యూ అధికారుల అండదండలతో చెరువు భూములు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. రాజకీయ నాయకులు, భూబకాసురులు, రియల్టర్లు, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, రెవెన్యూ అధికారులు ఇలా చెప్పుకుంటూపోతే అందరూ తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా చెరువు ముక్కలు ముక్కలుగా పంచుకున్నారు.
లోకాయుక్త ఆదేశంతో చెరువుల ఆక్రమణలపై సర్వే..
మోతె మండలానికి చెందిన తుమ్ముల సురేందర్‌రెడ్డి హుజూర్‌నగర్‌ ప్రాంతంలో పెద్దఎత్తున ఎఫ్‌టిఎల్‌, చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురై రియల్టర్లు, భూస్వాముల చేతుల్లో చేతులు మారుతున్నాయని లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. ఒక్క హుజూర్‌నగర్‌ మండలంలోని ఆరు చెరువులు ఆక్రమణలో ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆక్రమణల డొంక కదిలి అధికారుల మెడకు చుట్టుకుంది. రెవెన్యూ అధికారుల అందండలతోనే చెరువులు ఆక్రమణలకు గురయినా, ఇప్పుడు లోకాయుక్త ఆదేశంతో రెవెన్యూ, మైనర్‌ ఇరిగేషన్‌, పంచాయితీరాజ్‌ అధికారులు తప్పనిసరిగా సర్వే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఇరవై రోజులుగా హుజూర్‌నగర్‌ ప్రాంతంలో అధికారులు చెరువుల ఆక్రమణలపై సర్వే చేపట్టారు. హుజూర్‌నగర్‌ ఊరచెరువు మొదులుకొని పోతిరేణికుంట, అలకశంకర కుంట, బట్టోరికుంటలు సగానికి సగం కబ్జాకు గురయ్యాయి. పట్టణంలోని పోచమ్మతల్లి ఊరచెరువు సర్వే నెం.240లో 72.31 ఎకరాలలో విస్తరించి ఉండగా అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం సుమారు 15 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 14 మంది రైతులు చెరువు భూమిని ఆక్రమించుకొని సేద్యం చేస్తున్నారు. దీంతో పాటు పోతిరేణికుంట సర్వే నెం.968లో సుమారు 45.30 ఎకరాలు విస్తీర్ణం ఉండగా అందులో సుమారు 22 ఎకరాలు 18 మంది రైతులు ఆక్రమించుకున్నారు. కాగా అలకశంకర కుంట సర్వే నెం.48లో సుమారు 19.32 ఎకరాలు విస్తరించి ఉండగా 10 మంది రైతులు సుమారు 2 ఎకరాలు ఆక్రమించుకున్నారు. కాగా ఆయా చెరువుల్లో బావులు తవ్వి కొంతమంది భూస్వాములు, దళిత రైతులు సేద్యం చేస్తుండగా మరో కొంతమంది ఎడ్ల కొట్టాలు వేశారు. మరికొందరు దర్జాగా కబ్జా చేసిన భూములను అమ్ముకున్నారు. ఎకరం రూ.25 లక్షల చొప్పున అమ్మగా మరో ప్రాంతంలోని శిఖం భూమిని ఏకంగా ఎకరం రూ.40 లక్షలకు అమ్ముకున్నారు.
ఆక్రమణల దారులకు నోటీసులు
హుజూర్‌నగర్‌ పట్టణంలో సు మారు 45 మంది శిఖం భూములు ఆక్రమించుకున్నారని నోటీసులు జారీ చేశారు. వారం రోజులల్లో సమా ధానం ఇవ్వటంతో పాటు భూముల నుంచి వైదొలగాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులకు నివేదిక తయారు చేసి అందజేశారు. ఇక హుజూర్‌నగర్‌ మండలంలోని మొత్తం ఆరు చెరువులు లింగగరి పెద్ద చెరువు, బూరుగడ్డ పెద్దచెరువు, మాచారం నల్లచెరువు, అమరవరం అంజలీపురం కుంట, అమరవరం ఊరచెరువు, హుజూర్‌నగర్‌లోని చెరువులకు సంబంధించి సుమారు 114 మంది ఆక్రమణదారులను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
తహసీల్దార్‌ వివరణ
మండలంలోని చెరువులు కుంటలను ఆక్రమించుకున్న వారికి సుమా రు 114 మందికి నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్‌ రవికుమార్‌ తెలిపారు. ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదికను అందించనున్నట్లు తెలిపారు.ూ గొంత0ణథీగీ